Share News

పిల్లలు వద్దనుకుంటే...

ABN , Publish Date - Feb 09 , 2026 | 11:09 PM

పిల్లలను కనడానికి సిద్ధంగా లేని దంపతులు, అనుసరించదగిన కుటుంబ నియంత్రణ విధానాలు అనేకం ఉన్నాయి. అయితే వైద్యుల సలహా మేరకు, స్వల్ప కాలిక, దీర్ఘకాలిక కుటుంబ నియంత్రణ విధానాల్లో అనువైనదాన్ని ఎంచుకోవడం ఉత్తమం.

పిల్లలు వద్దనుకుంటే...

పిల్లలను కనడానికి సిద్ధంగా లేని దంపతులు, అనుసరించదగిన కుటుంబ నియంత్రణ విధానాలు అనేకం ఉన్నాయి. అయితే వైద్యుల సలహా మేరకు, స్వల్ప కాలిక, దీర్ఘకాలిక కుటుంబ నియంత్రణ విధానాల్లో అనువైనదాన్ని ఎంచుకోవడం ఉత్తమం.

పెళ్లైన వెంటనే పిల్లలు వద్దనుకునే దంపతులుంటారు. అలాగని తోచిన గర్భనిరోధక సాధనాలను ఎంచుకోవడం సరికాదు. ఇవి కొన్ని సందర్భాల్లో విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో వైద్యుల సలహా పాటించడం తప్పనిసరి.

అవసరాన్ని బట్టి...

  • ఎంత వ్యవధిలో మీకు తల్లి కావాలనే ఉద్దేశం ఉంది?

  • ఒక్కో కుటుంబనియంత్రణ పద్ధతి సామర్ధ్యం ఎంత?

  • దుష్ప్రభావాలు ఏవైనా ఉంటాయా?

  • మీరెంత తరచుగా సెక్స్‌లో పాల్గొంటారు?

  • ఏ పద్ధతి మీ ఇద్దరికీ సౌకర్యంగా ఉంటుంది?

  • ఎంతో సమర్థమైన కుటుంబనియంత్రణ పద్ధతులు కూడా ఒక్కోసారి ఫెయిలవుతూ ఉంటాయి. కాబట్టి గర్భం దాల్చే అవకాశాలను సమర్థంగా అడ్డుకునే పద్ధతిని ఎంచుకోవాలి.

కుటుంబ నియంత్రణ పద్ధతులు:

ఫిమేల్‌ అండ్‌ మేల్‌ స్టెరిలైజేషన్‌: సర్జరీ ద్వారా శాశ్వతంగా గర్భం రాకుండా చేయవచ్చు.

లాంగ్‌ యాక్టింగ్‌ రివర్సిబుల్‌ కాంట్రాసెప్టివ్స్‌: ఈ విధానంలో శరీరం లోపల అమర్చే పరికరం ద్వారా 3 నుంచి పదేళ్లపాటు గర్భం రాకుండా నియంత్రించవచ్చు. పిల్లలు కావాలనుకున్నప్పుడు ఆ పరికరాన్ని తీసేయొచ్చు.

షార్ట్‌ యాక్టింగ్‌ హార్మోనల్‌ మెథడ్స్‌: మాత్రలు, మినీ పిల్స్‌, ప్యాచ్‌, షాట్‌, వెజైనల్‌ రింగ్‌ - వీటి ద్వారా గర్భధారణను అడ్డుకోవచ్చు. షాట్‌ను ప్రతి మూడు నెలలకూ తీసుకోవాలి. మాత్రలు, వెజైనల్‌ రింగ్‌ ప్రతి రోజూ వాడాలి.

బ్యారియర్‌ మెథడ్స్‌: కండోమ్స్‌, డయాఫ్రమ్‌, స్పాంజ్‌, సర్వికల్‌ క్యాప్‌ - వీటిని లైంగికంగా కలిసే ప్రతిసారీ వాడాలి.

న్యాచురల్‌ రిథమ్‌ మెథడ్స్‌: ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులూ పాటించకుండా అండాలు విడుదల కాని సమయంలో సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఈ రోజులను కచ్చితంగా గుర్తించడం కోసం ఓవ్యులేషన్‌ హోమ్‌ టెస్ట్‌ కిట్‌ లేదా ఫర్టిలిటీ మానిటర్‌లను ఉపయోగించాలి. అయితే, ఉజ్జాయింపు లెక్కలతో పాటించే ఈ విధానం ఫెయిలయ్యే అవకాశాలూ ఎక్కువే!

డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,

సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌, హైదరాబాద్‌

Updated Date - Feb 09 , 2026 | 11:24 PM