ఇది కల్తీ బంగారం!
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:48 AM
బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పుడు, ఆభరణాలను కాస్త తక్కువ ధరకు విక్రయించే దుకాణాల కోసం వెతుకుతాం! అయితే భార లోహాలు కలిపిన కల్తీ బంగారం ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా చలామణి అవుతోంది. నాణ్యతా పరీక్షలకు చిక్కని ఈ నకిలీ బంగారం గురించిన మరిన్ని వివరాలు...
కొత్త రకం బంగారం కల్తీ బంగారం వ్యాపారుల్లో ఆందోళనను పెంచుతోంది. కొందరు బంగారం సరఫరాదారులు అక్రమంగా పొడి రూపంలోని భార లోహాలను బంగారానికి కలుపుతూ కల్తీకి పాల్పడుతున్నారు. మార్కెట్లో ఇలాంటి కల్తీ పదార్థాలకు ‘గోల్డ్ పౌడర్’ అనే పేరు కూడా ఉంది. సంప్రదాయ బంగారం నాణ్యతా పరీక్షా పద్ధతులతో దీన్ని కనిపెట్టడం కష్టం. కల్తీ బంగారం ప్రాథమిక పరీక్షల్లో అసలైన బంగారాన్ని తలపిస్తూ ఉండడంతో, బులియన్ డీలర్లు, ఆభరణాల తయారీదారులు, వ్యాపారులు ఆందోళనకు లోనవుతున్నారు.
ఈ సమస్య వీరికే పరిమితం అనుకుంటే పొరపాటు. మనం దుకాణాల్లో కొనే బంగారు ఆభరణాలన్నీ ఈ ముడి సరుకు నుంచే రూపొందుతూ ఉంటాయి. అయితే హాల్మార్క్ గుర్తింపు కలిగిన, విశ్వసనీయమైన ప్రముఖ బంగారు దుకాణాలకు బదులుగా, స్థానికంగా అందుబాటులో ఉండే బంగారం దుకాణాల్లో ఆభరణాలు తయారుచేయించుకునే వారు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం.
చిక్కదు, దొరకదు
కొందరు, కొన్న ఆభరణాల బరువు, నాణ్యతలను పరీక్షించుకోవడం కోసం మరో దుకాణానికి వెళతారు. అయుతే ఈ కొత్త రకం పద్ధతిలో కల్తీ అయిన బంగారంలోని భార లోహాలు, సంప్రదాయ నాణ్యతా పరీక్షలకు చిక్కవు. ఈ కల్తీ బంగారం ప్రామాణిక పాత తరం పరీక్ష అయిన క్యారెట్ పరీక్ష యంత్రాలతో పాటు, ఆమ్ల పరీక్షలు, టచ్స్టోన్ పరీక్షలకు కూడా చిక్కదు. దాంతో ఈ కల్తీ బంగారాన్ని అసలైన బంగారంగా పొరబడే ప్రమాదం పెరుగుతోంది. ఆభరణాల తయారీ ప్రక్రియలో భాగంగా ఈ బంగారాన్ని కరిగించినప్పుడు మాత్రమే కల్తీ బయటపడుతోంది.
ఈ కల్తీ బంగారంలో రుథీనియం, ఇరిడియం, ఓస్మియం అనే భార లోహాల పొడులను కలుపుతూ ఉంటారు. ఈ లోహాలు బంగారాన్ని మించిన సాంద్రత కలిగి ఉంటాయి. దాంతో అసలైన బంగారం పరిమాణం తక్కువగా, భార లోహాల పరిమాణం ఎక్కువగా ఉండడంతో పాటు, మొత్తంగా బంగారం బరువు పెరుగుతుంది. దాంతో ఈ కల్తీ బంగారంతో తయారుచేసే ఆభరణాలు కూడా ఎక్కువ బరువు తూగుతూ ఉంటాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ గుండా భారతీయ మార్కెట్లలోకి ప్రవేశిస్తున్న గోల్డ్ పౌడర్ చైనాలో తయారవుతుందన్నట్టు అనుమానిస్తున్నారు.
ఈ పరీక్షలు తప్పనిసరి
కల్తీ బంగారాన్ని సంప్రదాయ పరీక్షలతో కనిపెట్టే వీలు లేనప్పుడు, మరింత ఆధునిక పరీక్షా పద్ధతులను అనుసరించక తప్పదు. అందుకోసం ఇతర లోహాలను కనిపెట్టడంతో పాటు, బంగారం పరిమాణాన్ని కచ్చితంగా అంచనా వేయగలిగే, ఎక్స్ రే ఫ్లోరెసెన్స్ అనాలసిస్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ పరీక్షలను అనుసరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బంగారు ఆభరణాలను కొనే సమయంలో ఈ నియమాలను పాటించడంతో పాటు పేరున్న బంగారం దుకాణాల్లో, హాల్మార్క్ కలిగిన ఆభరణాలను మాత్రమే విక్రయించాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.