కల్తీని ఇలా తెలుసుకోవాలి
ABN , Publish Date - Sep 26 , 2026 | 01:22 AM
రోజూ వంటకాల్లో వాడే దినుసుల్లో కల్తీ కలిసిందో లేదో ఇంట్లోనే సులువుగా ఎలా గుర్తించాలో చూద్దాం...
రోజూ వంటకాల్లో వాడే దినుసుల్లో కల్తీ కలిసిందో లేదో ఇంట్లోనే సులువుగా ఎలా గుర్తించాలో చూద్దాం...
పసుపు: పళ్లెంలో చిటికెడు పసుపు, చుక్క వెనిగర్ వేసి కలపాలి. పసుపు పూర్తిగా ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారితే అది కల్తీదని గుర్తించవచ్చు.
కారం: చిన్న గిన్నెలో చెంచా నూనెను తీసుకుని అందులో చిటికెడు కారం వేసి కాలపాలి. నూనె వెంటనే ఎర్రగా మారితే ఆ కారంలో రంగు కలిపినట్లు తెలుసుకోవచ్చు. నిజమైన కారం రంగు విడవడానికి కొంత సమయం పడుతుంది.
జీలకర్ర: చిటికెడు జీలకర్రను అరచేతిలో వేసుకుని మరో చేత్తో గట్టిగా రుద్దితే చక్కని సువాసన వస్తుంది. ఇదే స్వచ్ఛమైన జీలకర్ర గుర్తింపు. ఇది ముదురు గోదుమ రంగులో గరుకుగా ఉంటుంది. అలాకాకుండా నల్లగా లేదా లేత రంగులో కనిపిస్తుంటే మాత్రం కల్తీదని భావించవచ్చు.
ధనియాల పొడి: స్వచ్ఛమైన ధనియాల పొడి తియ్యటి సువాసనతో ఉంటుంది. ఏదైనా చెడు వాసన అనిపించినా, ఏ వాసన తెలియకున్నా అది కల్తీదని భావించాలి. ధనియాల పొడి మెల్లగా నీటిలో మునుగుతుంది. అలాకాకుండా ఎంతసేపయినా నీటిపై తేలుతుంటే మాత్రం చెక్క పొట్టు, గుర్రపు లద్దె పొడి కలిపినట్లు తెలుసుకోవచ్చు.
గరం మసాల పొడి: దీన్ని వాసన చూస్తే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాల వాసన విడివిడిగా తెలుస్తుంది. అలా తెలియకపోతే కల్తీ కలిసినట్లు గుర్తించాలి. అరగ్లాసు నీటిలో చిటికెడు గరం మసాల పొడి, చుక్క అయొడిన్ వేసి కలపాలి. నీళ్లు నీలంగా మారితే అందులో ఏదైనా పిండి కలిపినట్లు తెలుసుకోవచ్చు.
ఉప్పు: బంగాళదుంపను సగానికి కోసి దానిపై ఉప్పు చల్లి వెంటనే కొద్దిగా నిమ్మరసాన్ని చిలకరించాలి. బుడగలు వచ్చి బంగాళదుంప నల్లగా లేదా నీలం రంగులోకి మారితే ఉప్పులో కల్తీ కలిసినట్లే భావించాలి.