Share News

చిటికెలో స్నాక్స్‌

ABN , Publish Date - Feb 14 , 2026 | 01:40 AM

ప్లేట్‌లో వడ్డించిన స్నాక్స్‌ చిటికెలో ఖాళీ అయిపోతాయి. అదే చిటికెలో వాటిని తయారుచేసే వీలుందా? నిజానికి నిమిషాల వ్యవధిలో తయారు చేయగలిగే స్నాక్స్‌ కూడా ఉన్నాయి. అవేంటంటే...

చిటికెలో స్నాక్స్‌

ప్లేట్‌లో వడ్డించిన స్నాక్స్‌ చిటికెలో ఖాళీ అయిపోతాయి. అదే చిటికెలో వాటిని తయారుచేసే వీలుందా? నిజానికి నిమిషాల వ్యవధిలో తయారు చేయగలిగే స్నాక్స్‌ కూడా ఉన్నాయి. అవేంటంటే...

3.jpg

ఫ్రూట్‌ శ్రీఖండ్‌

పెరుగు ప్రియుల మనసు దోచే స్నాక్‌ ఇది. తయారీ సులభం, రుచి అమోఘం. ఒకసారి ట్రై చేసి చూడండి.

కావలసిన పదార్థాలు:

  • నీళ్లు ఒంపేసిన పెరుగు (హంగ్‌ కర్డ్‌) - రెండు కప్పులు

  • పాల పొడి - కప్పు

  • జెల్లీ - అర కప్పు

  • పళ్ల ముక్కలు (యాపిల్‌, బొప్పాయి, సపోటా, దానిమ్మ, ద్రాక్ష, అరటి) - అర కప్పు

తయారీ విధానం:

  • పెరుగులో పాలపొడి ఉండలు లేకుండా కలపాలి.

  • దీన్లో పళ్ల ముక్కలు సమంగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి.

  • చల్లబడిన తర్వాత బౌల్స్‌లోకి తీసుకుని పైన జెల్లీతో అలంకరించి చల్లగా సర్వ్‌ చేయాలి.


4.jpg

పొటాటో బాల్స్‌

బంగాళాదుంపలతో వండే ఏ వంటకమైనా కమ్మగానే ఉంటుంది. భిన్నమైన ప్రయోగాలకు కూడా ఈ దుంపలు అనువుగా ఉంటాయి కాబట్టి ఇదిగో ఈ వెరైటీ స్నాక్‌ తయారుచేసి, రుచి చూడండి...

కావలసిన పదార్థాలు:

ఉడకబెట్టిన బంగాళాదుంపలు: పావు కిలో

ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్‌: సరిపడా

చీజ్‌: 100 గ్రాములు

గుడ్డు: 1

బ్రెడ్‌ పొడి: అర కప్పు

నూనె: వేపుడుకు సరిపడా

తయారీ విధానం:

  • బంగాళా దుంపలను, మెత్తగా మెదుపుకోవాలి

  • గుడ్డు బాగా గిలక్కొట్టుకోవాలి

  • బ్రెడ్‌ పొడిని వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి

  • చీజ్‌: గ్రేట్‌ చేసి పెట్టుకోవాలి

  • దుంపల ముద్దలో ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్‌, మిరియాల పొడి వేసి, బాగా కలుపుకోవాలి.

  • పూరీ పిండి పరిమాణంలో దుంపల ముద్దను తీసుకుని దాన్లో అర టీస్పూను చీజ్‌ తరుగును ఉంచి, ఉండలా చుట్టుకోవాలి.

  • ఇలా ఉండలన్నిటినీ తయారు చేసుకున్న తర్వాత, ముందుగా కోడిగుడ్డు సొనలో, తర్వాత బ్రెడ్‌ పొడిలో ముంచి పక్కన పెట్టుకోవాలి.

  • ఇలా ఉండలన్నీ రెడీ చేసుకుని, మరిగే నూనెలో వేయించి, బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి.

  • తర్వాత ఈ పొటాటో బాల్స్‌ను టమాటో సాస్‌, సలాడ్‌ డ్రెస్సింగ్‌తో అలంకరించి వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.


5.jpg

యాపిల్‌ రింగ్స్‌

యాపిల్‌ పండ్లతో స్నాక్‌ సాధ్యమా? అని ఆశ్చర్యపోకండి. నిజానికి ఈ స్నాక్స్‌ను ఒకసారి రుచి చూస్తే, తీరిక దొరికిన ప్రతిసారీ వీటినే వండుకుని తీనేస్తూ ఉంటారు.

కావలసిన పదార్థాలు:

యాపిల్స్‌: 3 (పులుపు లేకుండా తీయగా ఉండాలి)

మైదా పిండి: 1 కప్పు

బేకింగ్‌ పౌడర్‌: పావు టీస్పూను

ఉప్పు: పావు టీస్పూను

దాల్చిన చెక్క పొడి: అర టీస్పూను

చక్కెర పొడి: 2 టేబుల్‌ స్పూన్లు

చిక్కని మజ్జిగ: 1 కప్పు

గుడ్డు: 1

కోటింగ్‌ కోసం: సమ పరిమాణాల్లో చక్కెర పొడి, దాల్చిన చెక్క పొడి కలిపి, వెడల్పాటి ప్లేట్‌లో వేసి పెట్టుకోవాలి.

తయారీ విధానం:

  • వెడల్పాటి గిన్నెలో మైదా, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, చక్కెర పొడి వేసి కలిపి పెట్టుకోవాలి.

  • మరో గిన్నెలో గుడ్డు, మజ్జిగ వేసి బాగా కలుపుకోవాలి.

  • ఇలా కలిపి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమాన్ని మైదా పిండి మిశ్రమంలో వేసి జారుడుగా కలుపుకోవాలి.

  • యాపిల్స్‌ తొక్క తీయకుండానే పావు అంగుళం మందంతో చక్రాల్లా తరుక్కోవాలి. విత్తనాలు తీసేయాలి.

  • ఇలా యాపిల్‌ చక్రాలను సిద్ధం చేసుకుని, పిండిలో ముంచి, అదనపు పిండి వదిలేవరకూ పైకి లేపి ఉంచి, మరిగే నూనెలో వేయాలి.

  • ఇలా ఒకసారికి నాలుగు, నుంచి ఐదు చక్రాలు బాండీలో వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించి, తీయాలి.

  • వేయించిన వాటన్నింటినీ చక్కెర, దాల్చినచెక్క పొడిలో రెండు వైపులా అద్ది ప్లేట్లో అమర్చు కోవాలి.

  • వీటిని జామ్‌, కెచప్‌, పీనట్‌ బటర్‌లతో కలిపి తింటే చాలా బాగుంటాయి.

Updated Date - Feb 14 , 2026 | 01:40 AM