Share News

పనీర్‌తో పసందుగా..!

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:27 AM

ఎన్నో పోషకాలతో నిండిన పనీర్‌తో రకరకాల చిరుతిళ్లు, అల్పాహారాలు, గ్రేవీ కూరలు చేస్తుంటాం. ఫంక్షన్లలో ప్రత్యేకంగా వండే...

పనీర్‌తో  పసందుగా..!

వంటిల్లు

ఎన్నో పోషకాలతో నిండిన పనీర్‌తో రకరకాల చిరుతిళ్లు, అల్పాహారాలు, గ్రేవీ కూరలు చేస్తుంటాం. ఫంక్షన్లలో ప్రత్యేకంగా వండే పనీర్‌ బిర్యానీని ఇష్టంగా తింటుంటాం. ఇవికాక పనీర్‌తో ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోగలిగే రెస్టారెంట్‌ రుచులు మీకోసం...

పనీర్‌ సలాడ్‌

కావాల్సిన పదార్థాలు

పనీర్‌- 200 గ్రాములు, నూనె- చెంచా, కారం- అర చెంచా, ఉప్పు- తగినంత, పెరుగు- రెండు చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు- రెండు, చిల్లీ ప్లేక్స్‌- చెంచా, మిరియాల పొడి- అర చెంచా, నిమ్మరసం- చెంచా, కేరట్‌ తురుం- అర కప్పు, కీర తురుం- అర కప్పు, ఉల్లిపాయ- ఒకటి, టమాటా- ఒకటి, కొత్తిమీర తరుగు- కొద్దిగా

తయారీ విధానం

స్టవ్‌ మీద పాన్‌ పెట్టి నూనె వేసి వేడిచేయాలి. ఆపైన పనీర్‌ ముక్కలు, కారం, కొద్దిగా ఉప్పు వేసి కలుపుతూ దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. మిక్సీలో పెరుగు, రెండు పనీర్‌ ముక్కలు(వేయించనివి), వెల్లుల్లి రెబ్బలు, చిల్లీ ఫ్లేక్స్‌, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. వెడల్పాటి గిన్నెలో కేరట్‌ తురుం, కీర తురుం, సన్నగా పొడవుగా కోసిన ఉల్లిపాయ చీలికలు, సన్నగా కోసిన టమాటా ముక్కలు, గ్రైండ్‌ చేసిన పెరుగు మిశ్రమం వేసి బాగా కలపాలి. తరువాత వేయించిన పనీర్‌ ముక్కలు వేసి నెమ్మదిగా కలపాలి. పైన కొత్తిమీర తరుగు చల్లేస్తే రుచికరమైన పనీర్‌ సలాడ్‌ రెడీ..!


మేతి చమన్‌

కావాల్సిన పదార్థాలు

పనీర్‌- 200 గ్రాములు, మెంతి కూర ఆకులు- ఒకటిన్నర కప్పులు, జీడిపప్పు- 50 గ్రాములు, నూనె- పది చెంచాలు, సోంపు- అర చెంచా, జీలకర్ర- అర చెంచా, ఉల్లిపాయలు- రెండు, పచ్చి మిర్చి- రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు- అర చెంచా, టమాటాలు- రెండు, ధనియాల పొడి- చెంచా, పసుపు- పావు చెంచా, కారం- చెంచా, గరం మసాల పొడి- అర చెంచా, కసూరి మేతి- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, ఫ్రెష్‌ క్రీమ్‌- అర కప్పు, నెయ్యి- చెంచా

తయారీ విధానం

  • ముందుగా చిన్న గిన్నెలో జీడిపప్పు వేసి వేడి నీటిని పోసి అరగంటసేపు నానబెట్టి మెత్తటి పేస్టులా గ్రైండ్‌ చేయాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నెపెట్టి రెండు చెంచాల నూనె వేసి వేడిచేయాలి. అందులో మెంతి ఆకుల తరుగు వేసి దోరగా వేయించి పెట్టుకోవాలి. పనీర్‌లో సగాన్ని చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. మిగిలిన సగాన్ని సన్నగా తురుముకోవాలి.

  • స్టవ్‌ మీద వెడల్పాటి కడాయి పెట్టి నూనె వేసి వేడిచేయాలి. తరువాత సోంపు, జీలకర్ర, ఉల్లిపాయ తరుగు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి అయిదు నిమిషాలు వేయించాలి. ఆపైన టమాటా ముక్కలు వేసి గుజ్జులా ఉడికించాలి. తరువాత ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాల పొడి, కసూరి మేతి, ఉప్పు వేసి బాగా కలపాలి. ముందుగా వేయించి పెట్టుకున్న మెంతికూర తరుగు, జీడిపప్పు పేస్టు కూడా వేసి కలపాలి. వెంటనే రెండు కప్పుల నీటిని పోసి చిన్న మంట మీద పావుగంటసేపు ఉడికించాలి. ఆపైన పనీర్‌ ముక్కలు, పనీర్‌ తురుం వేసి కలపాలి. తరువాత ఫ్రెష్‌ క్రీమ్‌, నెయ్యి వేసి కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి. రుచికరమైన ఈ మేతి చమన్‌ని చపాతీ, పూరీ, పుల్కాలతో వేడి వేడిగా సర్వ్‌ చేయవచ్చు.


పనీర్‌ మెజెస్టిక్‌

కావాల్సిన పదార్థాలు

పనీర్‌- పావు కేజీ, మైదా- రెండు చెంచాలు, కార్న్‌ఫ్లోర్‌- రెండు చెంచాలు, పసుపు- పావు చెంచా, ఉప్పు- తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు- చెంచా, నూనె- డీప్‌ ఫ్రైకి తగినంత, జీలకర్ర- అర చెంచా, వెల్లుల్లి తరుగు- చెంచా, జీడిపప్పులు- పది, ఎండు మిర్చి- రెండు, ఉల్లిపాయ తరుగు- పావు కప్పు, పచ్చి మిర్చి- రెండు, క్యాప్సీకమ్‌- ఒకటి, కారం- అర చెంచా, గరం మసాల పొడి- పావు చెంచా, ధనియాల పొడి- అర చెంచా, జీలకర్ర పొడి- అర చెంచా, కరివేపాకు- కొద్దిగా, పెరుగు- అర కప్పు, ఫ్రెష్‌ క్రీమ్‌- చెంచా, పుదీనా తరుగు- కొద్దిగా, కొత్తిమీర

తరుగు- కొద్దిగా

తయారీ విధానం

పనీర్‌ను పొడవాటి స్ట్రిప్స్‌ మాదిరి కోసి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి తగినంత నీటిని చిలకరిస్తూ దోశ పిండి మాదిరి జారుగా కలపాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి సగానికి పైగా నూనె పోసి వేడిచేయాలి. పనీర్‌ స్ట్రిప్స్‌ను ఒక్కోదాన్ని పిండిలో ముంచి కాగిన నూనెలో వేయాలి.

స్ట్రిప్స్‌ అన్ని వైపులా దోరగా వేగిన తరువాత పళ్లెంలోకి తీయాలి. స్టవ్‌ మీద మరో వెడల్పాటి గిన్నె పెట్టి మూడు చెంచాల నూనె వేయాలి. అది వేడెక్కిన తరువాత అందులో కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి ముక్కలు, జీడిపప్పులు వేసి దోరగా వేపాలి. ఆపైన ఉల్లిపాయ తరుగు, పచ్చి మిర్చి ముక్కలు, క్యాప్సీకమ్‌ చీలికలు వేసి కలుపుతూ రెండు నిమిషాలు వేయించాలి. తరువాత కారం, గరం మసాల పొడి, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి పెద్ద మంట మీద ఒక నిమిషం పాటు వేయించాలి.

తరువాత పెరుగు వేసి కలపాలి. ఆపైన ఫ్రెష్‌ క్రీమ్‌, పుదీనా తరుగు, వేయించి పెట్టుకున్న పనీర్‌ స్ట్రిప్స్‌ వేసి వేగంగా కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు

చల్లి స్టవ్‌ మీద నుంచి దించాలి. అంతే పనీర్‌ మెజెస్టిక్‌ రెడీ..!


పనీర్‌ బాల్స్‌

కావాల్సిన పదార్థాలు

పనీర్‌ తురుం- కప్పు, బియ్యప్పిండి- పావు కప్పు, ఉప్పు- అర చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు- అర చెంచా, పచ్చి మిర్చి- రెండు, ఉల్లిపాయ తరుగు- అర కప్పు, కేరట్‌ తురుం- పావు కప్పు, ఉడికించిన కార్న్‌- పావు కప్పు, కారం- అర చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా, పసుపు- చిటికెడు, చిల్లీ ఫ్లేక్స్‌- అర చెంచా, చాట్‌ మసాలా- అర చెంచా, గరం మసాల పొడి- అర చెంచా, మిరియాల పొడి- పావు చెంచా, వెన్న తగినంత

తయారీ విధానం

వెన్న మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని చేత్తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్‌ చేయాలి.

స్టవ్‌ మీద గుంట పొంగనాల ప్లేట్‌ పెట్టి ఒక్కో గుంటలో పావు చెంచా వెన్న వేయాలి. వెన్న కరిగిన తరువాత ఒక్కో గుంటలో ఒక్కో బాల్‌ ఉంచి పైన మూత పెట్టాలి. అయిదు నిమిషాల తరువాత మూత తీసి బాల్స్‌ను చెంచాతో రెండో వైపునకు తిప్పాలి.

దోరగా వేగిన బాల్స్‌ను పళ్లెంలోకి తీయాలి. ఇలా తయారు చేసిన పనీర్‌ బాల్స్‌ను టమాటా సాస్‌ లేదా మింట్‌ చట్నీతో సర్వ్‌ చేయాలి.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 11 , 2026 | 05:27 AM