Share News

కాలేయం కులాసాగా...

ABN , Publish Date - Oct 13 , 2026 | 01:33 AM

మద్యం జోలికి వెళ్లనంత కాలం కాలేయ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని మనందరం నమ్ముతూ ఉంటాం. అయితే దీర్ఘకాలిక మధుమేహం, మెటబాలిక్‌ స్ట్రెస్‌లు కూడా కాలేయాన్ని దెబ్బతీసి...

కాలేయం కులాసాగా...

మద్యం జోలికి వెళ్లనంత కాలం కాలేయ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని మనందరం నమ్ముతూ ఉంటాం. అయితే దీర్ఘకాలిక మధుమేహం, మెటబాలిక్‌ స్ట్రెస్‌లు కూడా కాలేయాన్ని దెబ్బతీసి, సిర్రోసిస్‌కూ, కాలేయ క్యాన్సర్‌కూ దారి తీస్తాయంటున్నారు వైద్యులు. కాబట్టి ఈ రుగ్మతల పట్ల అవగాహన ఏర్పరుచుకుని, అప్రమత్తంగా వ్యవహరించడం అత్యవసరం.

భారతదేశంలో దాదాపు 40 శాతం పెద్దల్లో వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆరోగ్య సంక్షోభం... ‘నాన్‌ ఆల్కహాలిక్‌ స్టీటోహెపటైటిస్‌’. అంతర్జాతీయ వైద్య సంస్థలు ఇటీవలే దీన్ని ‘మెటబాలిక్‌ డిస్‌ఫంక్షన్‌ అసోసియేటెడ్‌ స్టీటోహెపటైటిస్’గా మార్చాయి. సాధారణంగా కాలేయంలో కొంత మొత్తంలో కొవ్వు ఉంటుంది. అయితే జీవక్రియ లోపాల వల్ల కాలేయంలో విపరీతంగా కొవ్వు పేరుకుపోయినప్పుడు కాలేయ వాపుకు దారి తీస్తుంది. కాలేయం లోపల పెరిగే ఈ వాపును తగ్గించుకునే నిరంతర ప్రయత్నం ఫలితంగా కాలేయంలో గట్టి మచ్చలు లేదా ఫైబ్రోసిస్‌ ఏర్పడి, కాలేయం సిర్రోసిస్‌కూ లేదా క్యాన్సర్‌కూ దారి తీస్తుంది.

సన్నగా ఉన్నా ఫ్యాటీ లివర్‌

ఫ్యాటీ లివర్‌ స్థూలకాయులకే పరిమితమని అనుకుంటూ ఉన్నాం. కానీ భారతీయుల జన్యుపరమైన ఆకృతి వల్ల శరీరం చూపులకు సన్నగా ఉన్నా, పొట్ట లోపలి అవయవాల చుట్టూరా పేరుకునే కొవ్వు వల్ల నాష్‌ అనే నాన్‌ ఆల్కహాలిక్‌ స్టీటోహెపటైటిస్‌కు గురవుతున్నారు. కాబట్టి సన్నగా ఉన్న వారు కూడా ఫ్యాటీ లివర్‌ మీద ఓ కన్నేసి ఉంచాలి.


సైలెంట్‌ స్కిప్‌

కాలేయంలో నిరంతర వాపు, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ కలిసి ఒక ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. దాంతో కాలేయ కణాలు మార్పులకు లోనై క్యాన్సర్‌ కణుతులను సృష్టిస్తాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన సైలెంట్‌ స్కిప్‌ ప్రక్రియ. సాధారణంగా కాలేయం పూర్తిగా పాడైపోయిన చివరి దశలోనే కాలేయ క్యాన్సర్‌ సోకుతుంది. కానీ నాష్‌ తాలూకు కేసుల్లో దాదాపు 30 నుంచి 50 శాతం మంది రోగుల్లో సిర్రోసిస్‌ కనిపించడం లేదు. కాలేయంలో వ్యాధి సోకని భాగం మామూలుగానే పని చేస్తుండడం వల్ల కామెర్లు, పొట్టలో నీరు చేరడం లాంటి లక్షణాలు కనిపించవు. అయినప్పటికీ కాలేయంలో కణితి నిశ్శబ్దంగా పెరిగిపోతూ ఉంటుంది. చివరకు రోగి పొట్టకు కుడివైపున నొప్పి లేదా అకారణంగా బరువు తగ్గడం లాంటి లక్షణాలతో వైద్యులను సంప్రతిస్తాడు. అప్పటికే కాలేయంలో కణితి ఎంతో పెద్దదిగా పెరిగిపోయి ఉంటుంది.

ముంచుకొస్తున్న ముప్పు

వైద్య నిపుణుల అంచనా ప్రకారం 2030 నాటికి ప్రపంచదేశాలతో పాటు భారతదేశంలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలకు నాష్‌ ప్రధాన కారణంగా మారబోతోంది. వ్యాక్సిన్‌ వల్ల వైరల్‌ కాలేయ వైఫల్యాలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ మధుమేహం, జీవక్రియ లోపాల కారణగా ఆ నాష్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రాబోయే దశాబ్దంలో కాలేయం పూర్తిగా దెబ్బతినే తీవ్రమైన కేసుల సంఖ్య దాదాపు 168శాతం పెరగవచ్చని ఒక అంచనా. దీని వల్ల లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కోసం వేచి చూసే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. నాష్‌ రోగులకు కేవలం కాలేయ సమస్య మాత్రమే కాకుండా, టైప్‌2 డయాబెటిస్‌, గుండెజబ్బులు, అధిక బరువు మొదలైన ఇతర సమస్యలు కూడా కలిసి ఉంటాయి. దీని వల్ల కాలేయ మార్పిడి సర్జరీ పెద్ద సవాలుగా మారుతుంది. ఆధునిక జీవనశైలి వల్ల దానానికి ఉపయోగించే కాలేయాల్లో సైతం కొవ్వు ఎక్కువగా పేరుకుపోతోంది. దీని వల్ల మార్పిడికి పనికొచ్చే ఆరోగ్యకరమైన కాలేయాల కొరత తీవ్రం కానుంది.


కాలేయ రక్షణ ఇలా...

నాష్‌ వ్యాధి నేరుగా క్యాన్సర్‌కు దారి తీస్తుంది కాబట్టి లక్షణాలు బయల్పడే వరకూ వేచి ఉండడం ప్రమాదకరం. కాబట్టి ముందుగానే అప్రమత్తం కావాలి. అందుకోసం...

ముందస్తు పరీక్షలు: టైప్‌ 2 మధుమేహం, రక్తపోటు లేదా పొట్ట చుట్టూ కొవ్వు ఉన్న వారు వెంటనే వైద్యుల సలహాతో లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌, అబ్డామినల్‌ అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేయించుకోవాలి. అవసరాన్ని బట్టి ఫైబ్రోస్కాన్‌ కూడా చేయించుకోవాలి.

వీటికి దూరం: మైదా, తెల్ల బియ్యం, పంచదార వాడకాన్ని తగ్గించాలి. బదులుగా జొన్నలు, సజ్జలు, రాగులు లాంటి తృణధాన్యాలు, దంపుడు బియ్యం తీసుకోవాలి.

వ్యాయామం: వారానికి ఐదు రోజులు, రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం లేదా సైక్లింగ్‌ చేయడం వల్ల ఇన్సులిన్‌ పనితీరు మెరుగై, కాలేయంలో కొవ్వు వేగంగా కరుగుతుంది.

బరువు: శరీర బరువు అదుపులో ఉన్నా, పీలగా ఉన్నా కుటుంబంలో మధుమేహం ఉన్న వారు, పొట్ట భాగంలో కొవ్వు ఉన్నవారు కాలేయ పరీక్షలు చేయించుకోవాలి.

ఆహారపుటలవాట్లతో...

కాలేయ ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారశైలిని అలవరుచుకోవాలి. అందుకోసం...


పిండిపదార్థాలు: అన్నం, చపాతీలు, ఇడ్డీ, దోశల్లో పిండిపదార్థాలు ఎక్కువ. శరీరం వీటన్నిటినీ గ్లూకోజ్‌గా మారుస్తుంది. శారీరక శ్రమ లోపించినప్పుడు, ఈ అదనపు గ్లూకోజ్‌ను కాలేయం ట్రైగ్లిజరైడ్స్‌ అనే కొవ్వు కణాలుగా మార్చి నిల్వ చేసుకుంటుంది.

ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌: అధిక పిండిపదార్థాల వల్ల శరీరంలో ఇన్సులిన్‌ హార్మోన్‌ ప్రభావం తగ్గుతుంది. దాంతో కాలేయంలో కొవ్వు మరింత వేగంగా పేరుకుపోతుంది.

వంట నూనెలు: భారతీయ వంటకాల్లో నూనెల వాడకం ఎక్కువ. కానీ నూనెతో పాటు, దాని పరిమాణం కూడా కాలేయానికి శాపంగా మారుతోంది. ఎక్కువ నూనెతో కూరలు వండుకోవడం, పదార్థాలు నూనెలో మునిగేలా వేపుళ్లు వండుకోవడం మనకు అలవాటు. ఈ విధంగా మనం ప్రతి రోజూ 3 నుంచి 4 చెంచాల కంటే ఎక్కువ నూనె తీసుకుంటూ ఉంటాం. ఈ నూనె కాలేయంలో కొవ్వుగా పేరుకుపోతూ ఉంటుంది.

పక్కదారి పట్టించే లేబుల్స్‌: ఆలివ్‌ నూనె, స్వచ్ఛమైన నెయ్యి, గానుగ నూనెలు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ వాటిని అతిగా వాడినా కాలేయానికి చేటు జరుగుతుంది. కాబట్టి నూనె పరిమాణం కూడా ముఖ్యమే!

నూనెలు మార్చాలి: ఒకే రకమైన రిఫైన్డ్‌ నూనె ఏళ్ల తరబడి వాడుకోకుండా, సంప్రదాయ నూనెలైన వేరుసెనగనూనె, ఆవ నూనె, నువ్వుల నూనె, పొద్దుతిరుగుడు నూనెలను తరచూ మారుస్తూ వాడుకుంటూ ఉండాలి.


పదే పదే నూనె వాడకం: రోడ్ల పక్కన దొరికే సమోసాలు, పానీ పూరి, కచోరీలు, నూడుల్స్‌, మంచూరియా మొదలైన ఫాస్ట్‌ ఫుడ్స్‌ నాష్‌ వ్యాధినీ, కాలేయ క్యాన్సర్‌నూ పెంచుతాయి. ఇందుకు కారణం వాడిన నూనెనే పదే పదే వాడడం. ఇలా నూనెను పదే పదే వేడి చేయడం వల్ల దాన్లోని ట్రాన్స్‌ ఫ్యాట్స్‌, టోటల్‌ పోలార్‌ కాంపౌండ్స్‌ విపరీతంగా పెరిగిపోతాయి. ట్రాన్స్‌ఫ్యాట్స్‌ కాలేయ కణాలను విషపూరితం చేస్తాయి. ఇవి ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను పెంచి, ఫ్యాటీ లివర్‌ దశ నుంచి నాష్‌కూ కాలేయ క్యాన్సర్‌ దశల్లోకి తీసుకువెళ్తాయి.

వనస్పతి/డాల్డా: బేకరీ పదార్థాలు, ప్యాకెట్‌ ఫుడ్స్‌ నిల్వ కోసం వనస్పతిని ఉపయోగిస్తారు. ఇది కొవ్వుగా మారి, కాలేయం చుట్టూ పేరుకుపోతుంది.

  • కాలేయ వ్యాధి దశలవారీగా...

మొదటి దశ ఫ్యాటీ లివర్‌:

ఈ దశలో కాలేయ కణాల్లో 5 శాతం కంటే తక్కువ కొవ్వు ఉంటుంది. ఈ దశ కాల వ్యవధి ఐదు నుంచి పదేళ్లు. ఈ దశలో ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. సమతులాహారం, వ్యాయామంతో ఈ దశను నయం చేయవచ్చు.

రెండో దశ నాష్‌/మ్యాష్‌:

కొవ్వు వల్ల కాలేయం వాపుకు గురయ్యే దశ ఇది. కాల వ్యవధి ఐదు నుంచి పదిహేనేళ్లు. పొట్టలో కుడివైపు నొప్పి, విపరీతమైన నీరసం వేధిస్తూ ఉంటాయి. ఈ దశను కూడా చికిత్సతో నయం చేయవచ్చు. జీవనశైలి మార్పులతో సాధారణ స్థితికి తీసుకురావచ్చు.

మూడో దశ ఫైబ్రోసిస్‌:

నిరంతర వాపు వల్ల కాలేయం పైన పీచు కణజాలం ఏర్పడుతుంది. ఈ దశకు 10 నుంచి 20 ఏళ్లు పడుతుంది. తీవ్రమైన అలసట, ఆకలి మందగించడం ప్రధాన లక్షణాలు. చికిత్సతో కొంతమేరకు కాలేయాన్ని కాపాడుకోవచ్చు.

నాలుగో దశ లివర్‌ సిర్రోసిస్‌:

కాలేయం పూర్తిగా మచ్చలతో నిండిపోయి, ముడుచుకుపోయి, గట్టి పడుతుంది. ఈ దశకు చేరుకోడానికి 15 నుంచి 20 ఏళ్లు పడుతుంది. ఈ దశను పూర్తిగా వెనక్కి తిప్పడం సాధ్యపడదు. కాలేయ మార్పిడి ఒక్కటే ఏకైక మార్గం.

డాక్టర్‌ టి.ఎల్‌.వి.డి. ప్రసాద్‌

క్లినికల్‌ డైరెక్టర్‌,

గ్యాస్ట్రోఎంటరాలజీ, ప్యాంక్రియాస్‌,

లివర్‌ అండ్‌ రోబోటిక్‌ సర్జన్‌,

యశోద హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌.

Updated Date - Oct 13 , 2026 | 01:33 AM