Dr. Kalpana Shankar: భవిష్యత్తుకు చేయూత
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:02 AM
ఆదుకోవడం అంటే దానం చేయడం కాదు... బతికే దారి చూపించడం’’ అంటారు డాక్టర్ కల్పనా శంకర్.వెట్టి చాకిరితో బాల్యాన్ని, భవిష్యత్తును కోల్పోతున్న పిల్లల కోసం...
‘‘ఆదుకోవడం అంటే దానం చేయడం కాదు... బతికే దారి చూపించడం’’ అంటారు డాక్టర్ కల్పనా శంకర్.వెట్టి చాకిరితో బాల్యాన్ని, భవిష్యత్తును కోల్పోతున్న పిల్లల కోసం ఈ సైంటిస్ట్ ఇరవయ్యేళ్ళ క్రితం ప్రారంభించిన సంస్థ...విదేశాల్లోనూ లక్షలాది ప్రజల జీవితాల్లో మార్పుకి దోహదం చేస్తోంది. ఆ కథ డాక్టర్ కల్పన మాటల్లోనే...
‘‘నేను మద్రాస్ యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేశాక... క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో ఉద్యోగం వచ్చింది. నా భర్త జిల్లా కలెక్టర్. ఎలాంటి లోటూ లేని జీవితం. కానీ ఉద్యోగం విషయంలో ఏదో వెలితి. దాంతో మహిళా అభివృద్ధి సంస్థకు మారాను. తరువాత ప్రపంచబ్యాంక్ దారిద్య్ర నిర్మూలన ప్రాజెక్ట్‌లో చేరాను. ఆ సమయంలో కాంచీపురంలో మేము చేపట్టిన ఒక అధ్యయనం నన్ను కొత్త మార్గంలోకి నడిపించింది. పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన కాంచీపురంలో 60 వేలకు పైగా మగ్గాలు, 45 వేలమంది చేనేత కళాకారులు ఉన్నారు. పట్టు చీరల మెరుపుల వెనుక మసకబారుతున్న ఎందరో పిల్లల బాల్యం ఉంది. చీరలకు ఉపయోగించే జరీ, పట్టుదారం వడికే పనిలో ఎక్కువమంది పిల్లలే. ఎక్కడయినా పిల్లలు చాలా చవగ్గా దొరికే కూలీలు. వారి కుటుంబాలకు స్థిరమైన ఆదాయం లేకపోవడంతో... పిల్లల్ని పనికి పంపిస్తున్నారు. అయిదు వందల రూపాయలు తీసుకొని ఒక తండ్రి తన కొడుకును వెట్టి చాకిరీకి వదిలిపెట్టిన ఉదంతాన్ని విని దిగ్ర్భాంతి చెందాను. పిల్లలతో, వారి కుటుంబాలతో మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలు తెలిశాయి. బాల్యాన్ని, భవిష్యత్తును కోల్పోతున్న ఆ పిల్లల దుస్థితి నాకు ఆవేదన కలిగించింది. అదే సమయంలో... ఆ పిల్లల కోసం ఏదైనా చేయాలనుకుంటున్న స్వీడన్‌కు చెందిన పెర్సీ బార్నెవిక్ కలిశారు. 2002లో కాంచీపురంలో మా కార్యక్రమాలను ప్రారంభించాం. ఆ తరువాత 2004లో ‘హ్యాండ్ ఇన్ హ్యాండ్’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశాం.
బహుముఖ వ్యూహంతో...
తొలి రోజుల్లో పిల్లలకోసం సాయంత్రం బడులు నిర్వహించాం. వారికి చాకిరీ నుంచి విముక్తి కలిగించాలంటే... వారి కుటుంబాలు వారి సంపాదనమీద ఆధారపడకూడదు. దీనికోసం కుటుంబాలకు స్థిరమైన ఆదాయం కల్పించడానికి స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశాం. మైక్రో ఫైనాన్స్ ద్వారా పెట్టుబడులు సమకూర్చాం. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, వ్యర్థాల నిర్వహణ, సహజవనరుల నిర్వహణ, గ్రామీణాభివృద్ధి పనులు.. ఇలా ఎన్నో చేపట్టాం. మహిళా సాధికారత, ఉద్యోగాల సృష్టి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వారికి విద్యా కల్పన, ఆరోగ్య సేవల అందుబాటు, పర్యావరణ పరిరక్షణలను ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకున్నాం. గత ఇరవయ్యేళ్ళలో మా ‘హ్యాండ్ ఇన్ హ్యాండ్’ దేశంలోని 20 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఎనిమిది దేశాలకు విస్తరించింది. పేదరిక నిర్మూలన, మహిళా సాధికారకతల కోసం మేము రూపొందించిన నమూనాను ఆఫ్ఘనిస్తాన్, కెన్యా, శ్రీలంక, బ్రెజిల్, కంబోడియా, మయన్మార్ దేశాలు అనుసరిస్తున్నాయి.
కలలా ఉంది...
మా సంస్థ ద్వారా ఇప్పటివరకూ ఆరు లక్షలకు పైగా స్వయంసహాయక బృందాలను ఏర్పాటు చేశాం. సుమారు 23 లక్షల మంది మహిళలను సాధికారతవైపు నడిపించాం. దాదాపు నాలుగు లక్షల మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాం. 545 గ్రామాల రూపురేఖలు మార్చాం. కిరాణా, టైలరింగ్, ఆహార విక్రయం, మొబైల్ రిపేరింగ్... ఇలా కుటుంబాలే నిర్వహించుకొనే వ్యాపారాలు లక్షల సంఖ్యలో ఏర్పాటు చేయిం చాం. పదిహేడున్నర వేలకు పైగా మహిళా పారిశ్రామికవేత్తలను సృష్టించాం. 15 లక్షల మందికి పైగా మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటి మందికి పైగా మహిళలు, పిల్లలు మా సంస్థ ద్వారా ప్రయోజనం పొందారు. ‘బెల్‌స్టార్ మైక్రో ఫైనాన్స్’ అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా నేను వ్యవహరిస్తున్నాను. కాంచీపురంలో సాధారణంగా మొదలైన నా సేవా ప్రస్థానం... ఇరవయ్యేళ్ళకు పైగా కొనసాగుతూ ఉండడం, రాష్ట్రపతుల చేతుల మీదుగా ‘నారీశకి’్త, ‘బాల కళ్యాణ పురస్కార్’తో సహా దేశవిదేశాల్లో పలు ప్రతిష్టాత్మ సంస్థల నుంచి అవార్డులు, ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందడం కలలా ఉంది. కొందరికైనా స్ఫూర్తినిస్తుందనే ఆలోచనతో ‘ది సైంటిస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్’ అనే పేరుతో నా జీవితంపై పుస్తకం రాశాను.’’