Share News

పండక్కి పసందైన స్వీట్లు..

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:35 AM

దీపావళి అనగానే దీపాలు, టపాకాయలతోపాటు రకరకాల స్వీట్లు గుర్తుకువస్తాయి. పండుగ రోజున ఇంటిల్లిపాదీ ఇష్టపడేలా సులువుగా తయారుచేసుకోగలిగే వెరైటీ స్వీట్లు మీకోసం...

పండక్కి పసందైన స్వీట్లు..

  • మోహన్‌తాల్‌

కావాల్సిన పదార్థాలు

శనగపిండి- 300 గ్రాములు, నెయ్యి- 150 గ్రాములు, గోరువెచ్చటి పాలు- రెండు చెంచాలు, చక్కెర- పావు కిలో, యాలకుల పొడి- అర చెంచా, కుంకుమ పువ్వు- కొద్దిగా, బాదం పలుకులు- కొన్ని, పిస్తా పలుకులు- కొన్ని

తయారీ విధానం

వెడల్పాటి గిన్నెలో శనగపిండిని తీసుకుని పాలు, రెండు చెంచాల నెయ్యి వేసి బాగా కలపాలి. ఇరవై నిముషాలు అలాగే ఉంచి ఆపైన జల్లెడ పట్టాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి నెయ్యితోపాటు శనగపిండి మిశ్రమం వేసి కలుపుతూ చిన్న మంటమీద దోరగా వేయించి దించాలి. స్టవ్‌ మీద మరో గిన్నె పెట్టి చక్కెర వేసి అర కప్పు నీటిని పోసి తీగపాకం తయారుచేసుకోవాలి. ఇందులో యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి. ఈ పాకాన్ని వేయించిన శనగపిండి మిశ్రమంలో కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు రాకుండా కలపాలి. దీన్ని స్టవ్‌మీద పెట్టి చిన్నమంట మీద దగ్గరకు వచ్చేవరకు కలుపుతూ ఉండాలి. మిశ్రమం గిన్నె నుంచి విడిపోతున్నప్పుడు స్టవ్‌ మీద నుంచి దించాలి. ఆపైన నెయ్యి రాసిన పళ్లెంలో సమంగా పరిచి దానిమీద బాదం, పిస్తా పలుకులు చల్లి ముక్కలు కోయాలి.

  • బాదం హల్వా

కావాల్సిన పదార్థాలు

బాదం- పావు కిలో, చక్కెర- పావు కిలో, నెయ్యి- 150 గ్రాములు, పాలు- అర కప్పు, కుంకుమ పువ్వు- కొద్దిగా, యాలకుల పొడి- చెంచా, ఫుడ్‌ కలర్‌- కొద్దిగా

తయారీ విధానం

బాదాములను వేడినీటిలో అరగంటసేపు నానబెట్టి తొక్క తీయాలి. ఆపైన వాటిని మిక్సీలో వేసి పాలు పోసి మెత్తటి పేస్టులా గ్రైండ్‌ చేయాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో బాదం పేస్టు, చక్కెర వేసి కలపాలి. మధ్యమధ్యలో నెయ్యిని వేస్తూ మిశ్రమం దగ్గరకు వచ్చేదాకా కలుపుతూ చిన్న మంట మీద ఉడికించాలి. ఆపైన కుంకుమ పువ్వు, యాలకుల పొడి, ఫుడ్‌ కలర్‌ వేసి కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ బాదం హల్వాని వేడిగా లేదంటే చల్లగా సర్వ్‌ చేయవచ్చు.


  • చాక్లెట్‌ బర్ఫీ

కావాల్సిన పదార్థాలు

కోవా- 400 గ్రాములు, చక్కెర- 120 గ్రాములు, పాలు- రెండు చెంచాలు, నెయ్యి- రెండు చెంచాలు, యాలకుల పొడి- అర చెంచా, కోకో పౌడర్‌- మూడు చెంచాలు, డార్క్‌ చాక్లెట్‌- 40 గ్రాములు

తయారీ విధానం

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి కోవా, చక్కెర, పాలు, నెయ్యి వేసి కలుపుతూ చిన్న మంటమీద ఉడికించాలి. ఈ మిశ్రమం గిన్నెనుంచి విడిపోతున్నప్పుడు స్టవ్‌ మీద నుంచి దించాలి. దీన్ని రెండు భాగాలుగా చేయాలి. ఒకదానిలో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. రెండో దానిలో డార్క్‌ చాక్లెట్‌, కోకో పౌడర్‌ వేసి స్టవ్‌ మీద పెట్టి బాగా కలపాలి. ఇది గట్టిపడుతున్నట్లు అనిపిస్తే చెంచా పాలను చిలకరించవచ్చు. మిశ్రమం బాగా కలిశాక స్టవ్‌ మీద నుంచి దించాలి. నెయ్యి రాసిన పళ్లెంలో ముందుగా తెల్లటి కోవా మిశ్రమాన్ని దానిమీద చాక్లెట్‌ కోవా మిశ్రమాన్ని పరిచి ముక్కలు కోయాలి. ఈ చాక్లెట్‌ బర్ఫీని పిల్లలు ఇష్టంగా తింటారు.


  • బాలు షాహి

కావాల్సిన పదార్థాలు

మైదా- 300 గ్రాములు, నెయ్యి- 75 గ్రాములు, బేకింగ్‌ సోడా- చిటికెడు, బేకింగ్‌ పౌడర్‌- అర చెంచా, గడ్డ పెరుగు- అర కప్పు, చక్కెర- 300 గ్రాములు, యాలకుల పొడి- అర చెంచా, నిమ్మరసం- అర చెంచా, నూనె- డీప్‌ ఫ్రైకి తగినంత

తయారీ విధానం

వెడల్పాటి గిన్నెలో మైదా, వంట సోడా, బేకింగ్‌ పౌడర్‌ వేసి మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా పెరుగును వేస్తూ పిండిని ముద్దలా చేయాలి. ఈ మిశ్రమాన్ని అరగంటసేపు నాననివ్వాలి. ఆపైన పిండిని చిన్న ముద్దలుగా చేయాలి. ఒక్కో ముద్దను అరచేతిలో ఉంచుకుని మరో అరచేత్తో గుండ్రంగా తిప్పి బిళ్లలా ఒత్తి మధ్యలో రంధ్రం చేసి పెట్టుకోవాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి చక్కెర వేసి ముప్పావు కప్పు నీటిని పోసి మరిగించాలి. అందులో యాలకుల పొడి, నిమ్మరసం వేసి కలిపి వేడి చల్లారకుండా చూసుకోవాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడయ్యాక మైదా బిళ్లలు వేసి మధ్య స్థాయి మంటమీద అన్ని వైపులా దోరగా వేయించి ఆపైన చక్కెర పాకంలో ముంచి తీయాలి. ఇలా తయారుచేసిన బాలుషాహీలు వారంపాటు నిల్వ ఉంటాయి.

Updated Date - Nov 07 , 2026 | 12:35 AM