Share News

కర్ర పెండలంతో కొత్తగా..!

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:05 AM

శీతాకాలంలో విరివిగా లభించే దుంప ‘కర్ర పెండలం’. ఇది పైన గోధుమ రంగులో లోపల తెల్లగా ఉంటుంది. దీనిలో పీచు, పిండిపదార్థాలు, సి విటమిన్‌ అధికం. ఇందులో ఏ రకమైన కొవ్వులూ ఉండవు. శరీరానికి తక్షణ శక్తిని ఆరోగ్యాన్ని అందించే పెండలంతో విభిన్న రుచులు మీకోసం...

కర్ర పెండలంతో కొత్తగా..!

శీతాకాలంలో విరివిగా లభించే దుంప ‘కర్ర పెండలం’. ఇది పైన గోధుమ రంగులో లోపల తెల్లగా ఉంటుంది. దీనిలో పీచు, పిండిపదార్థాలు, సి విటమిన్‌ అధికం. ఇందులో ఏ రకమైన కొవ్వులూ ఉండవు. శరీరానికి తక్షణ శక్తిని ఆరోగ్యాన్ని అందించే పెండలంతో విభిన్న రుచులు మీకోసం...

6.jpg

పెండలం చికెన్‌ మసాలా

కావాల్సిన పదార్థాలు

  • పెండలం- అర కేజీ, బోన్‌లెస్‌ చికెన్‌ ముక్కలు- పావు కేజీ, ఉల్లిపాయలు- రెండు, టమాటాలు- రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, పచ్చి మిర్చి- మూడు, నూనె- నాలుగు చెంచాలు, ఉప్పు- తగినంత, పసుపు- అర చెంచా, కారం- రెండు చెంచాలు, ధనియాల పొడి- ఒక చెంచా, జీలకర్ర పొడి- అర చెంచా, గరం మసాల పొడి- అర చెంచా, కొత్తిమీర- కొద్దిగా

తయారీ విధానం

  • పెండలాన్ని కడిగి పెద్ద ముక్కలుగా కోసి కుక్కర్‌లో వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. చికెన్‌ ముక్కలను కడిగి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టాలి.

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడిచేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి మిర్చి ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆపైన టమాటా ముక్కలు, పసుపు వేసి మగ్గించాలి. అయిదు నిమిషాల తరువాత చికెన్‌ ముక్కలు వేసి కలిపి పది నిమిషాలు ఉడికించాలి. ఆపైన కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాల పొడి, ముందుగా ఉడికించి పెట్టుకున్న పెండలం ముక్కలు వేసి చిన్న గ్లాసు నీళ్లు పోసి బాగా కలపాలి. గిన్నె మీద మూతపెట్టి అయిదు నిమిషాలు మగ్గించాలి. తరువాత మూత తీసి ఉప్పు సరిచూడాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఇలా తయారుచేసిన పెండలం చికెన్‌ మసాల కూర.. వేడి అన్నం, చపాతీ, పుల్కా, బగారా రైస్‌, రుమాల్‌ రోటీల్లోకి రుచిగా ఉంటుంది.


3.jpg

పెండలం చిప్స్‌

కావాల్సిన పదార్థాలు

  • కర్ర పెండలం- అర కేజీ, నూనె- డీప్‌ ఫ్రైకి తగినంత, కారం- అర చెంచా, ఉప్పు- అర చెంచా, ధనియాల పొడి- పావు చెంచా, చాట్‌ మసాల పొడి- అర చెంచా

తయారీ విధానం

  • చిన్న గిన్నెలో ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్‌ మసాల పొడి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. పెండలాన్ని మట్టి లేకుండా కడిగి పీలర్‌తో తొక్క తీయాలి. తరువాత మరోసారి ఉప్పు నీళ్లతో కడగాలి. ఆపైన మూడు ముక్కలుగా కోయాలి. తరువాత స్లైసర్‌ సహాయంతో పలుచని స్లైసెస్‌గా కట్‌ చేయాలి. స్టవ్‌ మీద మూకుడు పెట్టి సగానికిపైగా నూనె పోసి వేడిచేయాలి. నూనె బాగా వేడెక్కాక అందులో పెండలం స్లైసెస్‌ వేసి పెద్ద మంట మీద దోరగా వేయించాలి. మధ్య మధ్యలో చిల్లుల గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇవి ఎర్రగా వేగిన తరువాత స్టయినర్‌ సహాయంతో నూనెలో నుంచి తీసి దాన్ని ఒక గిన్నె మీద పెట్టాలి. అదనంగా ఉన్న నూనె మొత్తం గిన్నెలోకి దిగిన తరువాత చిప్స్‌ను మరో వెడల్పాటి గిన్నెలో వేయాలి. వీటిపైన ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు, కారం మిశ్రమాన్ని చల్లి గిన్నెను పైకి కిందికి ఊపాలి. ఇలా తయారు చేసిన పెండలం చిప్స్‌ వారం రోజుల వరకూ కరకరలాడుతూ ఉంటాయి. వీటిని స్నాక్‌లా సర్వ్‌ చేయవచ్చు. లేదంటే పప్పు, చారు, సాంబార్‌తోపాటు సైడ్‌ డిష్‌గా వడ్డించవచ్చు.


4.jpg

పెండలం హల్వా

కావాల్సిన పదార్థాలు

  • కర్ర పెండలం- అర కేజీ, బెల్లం పొడి- ఒక కప్పు, నెయ్యి- ఒక కప్పు, శొంఠి పొడి- అర చెంచా, జీడిపప్పు- కొద్దిగా, కిస్‌మి్‌సలు- కొన్ని, యాలకుల పొడి- అర చెంచా

తయారీ విధానం

  • పెండలాన్ని శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలుగా కోసి కుక్కర్‌లో వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. వీటిని మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఆపైన స్టయినర్‌లోకి తీసుకుని గరిటెతో ఒత్తుతూ మరో గిన్నెలోకి వడబోయాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి బెల్లం పొడి వేసి ఒక కప్పు నీళ్లు పోసి కరిగించాలి. ఆపైన పెండలం పేస్టు వేసి కలపాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు అర కప్పు నెయ్యి వేసి బాగా కలపాలి. మిశ్రమం కొద్దిగా దగ్గరకు వచ్చిన తరువాత మిగిలిన నెయ్యి వేసి కలుపుతూ చిన్న మంట మీద ఉడికించాలి. పది నిమిషాల తరువాత మిశ్రమం పూర్తిగా ఉడికి గిన్నెకు అంటుకోకుండా దగ్గరకు వస్తుంది. ఈ దశలో శొంఠి పొడి, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్‌మి్‌సలు వేసి కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ హల్వాని నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసి సమంగా పరచాలి. కొద్దిగా చల్లారిన తరువాత ముక్కలుగా కోసి సర్వ్‌ చేయాలి.


5.jpg

పెండలం అట్టు

కావాల్సిన పదార్థాలు

  • కర్ర పెండలం- అర కేజీ, బియ్యం- ఒక గ్లాసు, పచ్చి శనగ పప్పు- పావు కప్పు, జీలకర్ర- ఒక చెంచా, ఎండు మిరపకాయలు- పది, ఉప్పు- తగినంత, నూనె- తగినంత, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, కొత్తిమీర తరుగు- కొద్దిగా

తయారీ విధానం

  • ముందుగా ఒక గిన్నెలో బియ్యం, పచ్చి శనగపప్పు వేసి నీళ్లతో శుభ్రంగా కడగాలి. తరువాత నిండా నీళ్లు పోసి ఒక పూటంతా నానబెట్టాలి. పెండలానికి తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. మిక్సీలో పెండలం ముక్కలు, నానిన బియ్యం-పచ్చి శనగ పప్పు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ పిండి మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని గరిటె జారుగా ఉండేలా మరికొన్ని నీళ్లు కలపాలి. ఉప్పు సరిచూసుకోవాలి. స్టవ్‌ మీద పెనం పెట్టి వేడి చేయాలి. దానిమీద చెంచాతో కొద్దిగా నూనె రాసి గరిటెతో పిండిని తీసుకుని అట్టు పోయాలి. దీనిమీద చెంచా నూనె వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గించాలి. తరువాత మూత తీసి అట్టును రెండో వైపునకు తిప్పి మరో రెండు నిమిషాలు ఉంచాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా వేగిన అట్టును పళ్లెంలోకి తీసి సర్వ్‌ చేయాలి.

Updated Date - Jan 24 , 2026 | 04:06 AM