వహ్వా..!వాటర్ యాపిల్..!
ABN , Publish Date - Mar 28 , 2026 | 03:38 AM
ప్రస్తుతం వాటర్ యాపిల్స్ విరివిగా లభిస్తున్నాయి. ఎర్రటి పండ్లు తియ్యగా తినడానికి బాగుంటాయి. పచ్చివి మాత్రం ఆకుపచ్చని రంగులో పుల్లటి రుచితో ఉంటాయి. వీటితో రకరకాల వంటకాలు కూడా చేస్తూ ఉంటారు. ఎన్నో పోషకాలతో నిండిన వాటర్ యాపిల్‌ను విభిన్నంగా ఆస్వాదించాలనుకునేవారి కోసమే ఈ రుచులు...
ప్రస్తుతం వాటర్ యాపిల్స్ విరివిగా లభిస్తున్నాయి. ఎర్రటి పండ్లు తియ్యగా తినడానికి బాగుంటాయి. పచ్చివి మాత్రం ఆకుపచ్చని రంగులో పుల్లటి రుచితో ఉంటాయి. వీటితో రకరకాల వంటకాలు కూడా చేస్తూ ఉంటారు. ఎన్నో పోషకాలతో నిండిన వాటర్ యాపిల్‌ను విభిన్నంగా ఆస్వాదించాలనుకునేవారి కోసమే ఈ రుచులు...

వాటర్ యాపిల్ సలాడ్
కావాల్సిన పదార్థాలు
వాటర్ యాపిల్స్- పావు కేజీ, టమాటా- ఒకటి, కేరట్- ఒకటి, కీరా- ఒకటి, పుదీనా ఆకులు- ఆరు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, జీలకర్ర పొడి- పావు చెంచా, మిరియాల పొడి- పావు చెంచా, కారం- పావు చెంచా, ఉప్పు- తగినంత, చెర్రీలు- ఆరు, గుల్కంద్- రెండు చెంచాలు, తేనె- నాలుగు చెంచాలు, నిమ్మకాయ- ఒకటి
తయారీ విధానం
ఒక గిన్నెలో తేనె, మిరియాలపొడి, జీలకర్ర పొడి, గుల్కంద్, కారం, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో వాటర్ యాపిల్ ముక్కలు, కీరా ముక్కలు, కేరట్ తురుం, టమాటా ముక్కలు, చెర్రీలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, ముందుగా చేసి పెట్టుకున్న తేనె తదితరాల మిశ్రమం వేసి చెంచాతో బాగా కలపాలి. ఇలా తయారుచేసిన వాటర్ యాపిల్ సలాడ్‌ను చిన్న గాజు బౌల్స్‌లో సర్వ్ చేయాలి.

వాటర్ యాపిల్ హల్వా
కావాల్సిన పదార్థాలు
రెడ్ వాటర్ యాపిల్స్- పావు కేజీ, కార్న్‌ఫ్లోర్- పావు కప్పు, చక్కెర- అర కప్పు, నెయ్యి- మూడు చెంచాలు, డ్రై ఫ్రూట్స్ పలుకులు- కొన్ని
తయారీ విధానం
వాటర్ యాపిల్స్‌ను మధ్యకు కోసి గింజలు తీయాలి. ఈ ముక్కలను బ్లెండర్‌లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. చిన్న గిన్నెలో కార్న్‌ఫ్లోర్ వేసి కొన్ని నీళ్లు చిలకరించి ఉండలు రాకుండా కలపాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి కరిగించాలి. అందులో వాటర్ యాపిల్ పేస్టు వేసి బాగా కలుపుతూ చిన్న మంట మీద ఉడికించాలి. తరువాత కార్న్‌ఫ్లోర్ మిశ్రమం, చక్కెర వేసి తిప్పుతూ ఉండాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరకు వచ్చిన తరువాత నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసి సమంగా పరచాలి. దీనిమీద కొన్ని డ్రైఫ్రూట్స్ పలుకులు చల్లాలి. ఈ హల్వా పూర్తిగా చల్లారిన తరువాత ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి.

స్పైసీ ట్యాంగీ వాటర్ యాపిల్ జ్యూస్
కావాల్సిన పదార్థాలు
రెడ్ లేదా గ్రీన్ వాటర్ యాపిల్స్- నాలుగు, చాట్ మసాలా- అర చెంచా, మిరియాల పొడి- పావు చెంచా, నల్ల ఉప్పు- అర చెంచా, నిమ్మరసం- రెండు చెంచాలు, చక్కెర- రెండు చెంచాలు, ఐస్ క్యూబ్స్- రెండు, పుదీనా ఆకులు- రెండు
తయారీ విధానం
వాటర్ యాపిల్స్‌ను మధ్యకు కోసి గింజలు తీసి వేయాలి. ఈ ముక్కలను మిక్సీ గిన్నెలో వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ జ్యూస్‌ను స్టయినర్ సహాయంతో మరో గిన్నెలోకి వడబోయాలి. పొడవాటి గాజు గ్లాసును తీసుకొని అందులో చాట్ మసాలా పొడి, మిరియాల పొడి, నల్ల ఉప్పు, చక్కెర, నిమ్మరసం, ఐస్ క్యూబ్స్, పుదీనా ఆకులు వేసి చివరగా వాటర్ యాపిల్ జ్యూస్ పోయాలి. అందులో ఒక స్ట్రా పెట్టి సర్వ్ చేయడమే..!

వాటర్ యాపిల్ ఊరగాయ
కావాల్సిన పదార్థాలు
గ్రీన్ వాటర్ యాపిల్స్- పావు కేజీ, నూనె- ఎనిమిది చెంచాలు, ఆవాలు- చెంచా, మెంతులు- పావు చెంచా, కారం- మూడు చెంచాలు, ఎండు మిర్చి- రెండు, వెల్లుల్లి రెబ్బలు- పది, అల్లం- రెండు చిన్న ముక్కలు, ఇంగువ- పావు చెంచా, ఉప్పు- తగినంత, పసుపు- పావు చెంచా
తయారీ విధానం
వాటర్ యాపిల్స్‌ను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడవాలి. ఒక్కోదాన్ని నాలుగు పొడవాటి ముక్కలుగా కోయాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నాలుగు చెంచాల నూనె వేసి వేడిచేయాలి. ఆపైన వాటర్ యాపిల్ ముక్కలు వేసి పైన కొద్దిగా ఉప్పు చల్లి కలుపుతూ పది నిమిషాలు వేయించాలి. ముక్కలు కొద్దిగా రంగు మారిన తరువాత గిన్నెను స్టవ్ మీద నుంచి దించాలి. స్టవ్ మీద మరో వెడల్పాటి గిన్నె పెట్టి నాలుగు చెంచాల నూనె వేసి వేడిచేయాలి. అందులో ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండు మిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పసుపు వేసి బాగా కలపాలి. అయిదు నిమిషాల తరువాత.. ముందుగా వేయించి పెట్టుకున్న వాటర్ యాపిల్ ముక్కలు, కారం, కొద్దిగా ఉప్పు వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఈ ఊరగాయ పూర్తిగా చల్లారిన తరువాత ఉప్పు సరిచూసుకుని గాజు సీసాలోకి తీసి ఫ్రిజ్‌లో పెడితే రెండు వారాలు నిల్వ ఉంటుంది. ఇది వేడి వేడి అన్నం, చపాతీ, పుల్కాల్లోకి బాగుంటుంది.