పియర్స్‌తో నోరూరేలా..!
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:01 AM
తీపి, పులుపు కలగలిసిన రుచితో కొద్దిగా కరకరలాడుతున్నట్లు ఉండే పియర్స్‌ను అందరూ ఇష్టంగా తింటారు. వీటిలో పోషకాలు కూడా అధికం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే పియర్స్‌ను విభిన్నంగా ఆస్వాదించాలనుకునేవారి కోసమే ఈ రుచులు...
తీపి, పులుపు కలగలిసిన రుచితో కొద్దిగా కరకరలాడుతున్నట్లు ఉండే పియర్స్‌ను అందరూ ఇష్టంగా తింటారు. వీటిలో పోషకాలు కూడా అధికం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే పియర్స్‌ను విభిన్నంగా ఆస్వాదించాలనుకునేవారి కోసమే ఈ రుచులు...

పియర్స్ కేక్
కావాల్సిన పదార్థాలు
పియర్స్- మూడు, కరిగించిన వెన్న- వంద గ్రాములు, చక్కెర- వంద గ్రాములు, కోడిగుడ్లు- రెండు, పాలు- అర కప్పు, వెనీలా ఎసెన్స్- చెంచా, మైదా- 200 గ్రా, బేకింగ్ పౌడర్- చెంచా, బ్రౌన్ షుగర్- ఎనిమిది చెంచాలు, దాల్చిన చెక్క పొడి- రెండు చెంచాలు, నెయ్యి- చెంచా, డ్రై ఫ్రూట్స్ పలుకులు- కొన్ని
తయారీ విధానం
పియర్స్‌కి తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో వెన్న, చక్కెర, కోడి గుడ్ల సొనలు వేసి బాగా కలపాలి. తరువాత పాలు, వెనీలా ఎసెన్స్, మైదా వేసి ఉండలు రాకుండా కలపాలి. ఒక కేక్ మౌల్డ్‌ను తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి రాయాలి. తరువాత మైదా మిశ్రమంలో సగాన్ని వేసి సమంగా పరచాలి. దానిపై పియర్స్ ముక్కల్లో సగం వేసి వాటిపై నాలుగు చెంచాల బ్రౌన్ షుగర్, చెంచా దాల్చిన చెక్క పొడి చల్లాలి. తరువాత మిగిలిన మైదా మిశ్రమాన్ని పరచాలి. దానిపై మిగిలిన పియర్స్ ముక్కలు, బ్రౌన్ షుగర్, దాల్చిన చెక్క పొడి వేయాలి. ఈ మౌల్డ్‌ను ఓవెన్‌లో ఉంచి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 50 నిమిషాలపాటు బేక్ చేయాలి. తరువాత ఈ కేక్‌ను బయటికి తీసి కొద్దిగా చక్కెర పొడి, డ్రై ఫ్రూట్స్ పలుకులు చల్లి ముక్కలుగా కోయాలి. రుచికరమైన పియర్స్ కేక్ సర్వ్ చేయడానికి రెడీ..!

పియర్స్ చాట్
కావాల్సిన పదార్థాలు
పియర్స్ ముక్కలు- రెండు కప్పులు, మొలకెత్తిన పెసలు- చెంచా, మొలకెత్తిన శనగలు- చెంచా, పనీర్ క్యూబ్స్ చిన్నవి- రెండు చెంచాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు- రెండు చెంచాలు, కీరా ముక్కలు- రెండు చెంచాలు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు- చెంచా, కొత్తిమీర తరుగు- చెంచా, సన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు- చెంచా, నిమ్మరసం- మూడు చెంచాలు, స్వీట్ చట్నీ- రెండు చెంచాలు, నల్ల ఉప్పు- పావు చెంచా, చాట్ మసాలా- పావు చెంచా, మిరియాల పొడి- అర చెంచా, కారం- చెంచా, జీలకర్ర పొడి- పావు చెంచా, వేయించి పొట్టు తీసిన వేరుశనగ గుండ్లు- ఒక కప్పు, దానిమ్మ గింజలు- రెండు చెంచాలు, ఉప్పు- చెంచా
తయారీ విధానం
ఒక వెడల్పాటి పెద్ద గిన్నెను తీసుకుని దానిలో పైన సూచించిన వాటన్నింటినీ ఒకదాని తరువాత ఒకటి వేయాలి. చెంచా సహాయంతో వాటిని బాగా కలపాలి. ఇలా తయారుచేసిన పియర్స్ చాట్‌ను గాజు ప్లేట్లలో సర్ది సర్వ్ చేయడమే..!

పియర్స్ పాప్సికల్స్
కావాల్సిన పదార్థాలు
పియర్స్- అయిదు, తాటి కలకంద- అర కప్పు, పుదీనా- కొద్దిగా, నల్ల ఉప్పు- అర చెంచా, నిమ్మకాయ- ఒకటి, నీళ్లు- అర గ్లాసు
తయారీ విధానం
పియర్స్‌కి తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. మిక్సీ గిన్నెలో పియర్స్ ముక్కలు, తాటి కలకంద, పుదీనా, నల్ల ఉప్పు వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్టయినర్ సహాయంతో మరో గిన్నెలోకి వడబోయాలి. తరువాత నిమ్మరసం వేసి కలపాలి. పాప్సికల్ మౌల్డ్స్‌లో ఈ మిశ్రమాన్ని నింపి క్యాప్స్ బిగించి డీప్ ఫ్రిజ్‌లో మూడు గంటలపాటు ఉంచాలి. అంతే పియర్స్ పాప్సికల్స్ రెడీ..!

పియర్స్ ఫ్రిట్టర్స్
కావాల్సిన పదార్థాలు
పియర్స్- మూడు, గోధుమ పిండి- ఒక కప్పు, చక్కెర- రెండు చెంచాలు, బేకింగ్ పౌడర్- చెంచా, ఉప్పు- చిటికెడు, దాల్చిన చెక్క పొడి- అర చెంచా, కొడిగుడ్డు- ఒకటి, పాలు- ఒక కప్పు, వెన్న- రెండు చెంచాలు, వెనీలా ఎసెన్స్- చెంచా, నూనె- డీప్ ఫ్రైకి తగినంత
తయారీ విధానం
పియర్స్‌ను శుభ్రంగా కడిగి తొక్క తీసి గ్రేటర్ సహాయంతో సన్నగా తురిమి పెట్టుకోవాలి. చిన్న గిన్నెలో కోడిగుడ్డు సొనలు, పాలు, వెన్న, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, చక్కెర, బేకింగ్ పౌడర్, ఉప్పు, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. తరువాత కోడిగుడ్డు-పాల మిశ్రమం, పియర్స్ తురుం కూడా వేసి బాగా కలపాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. తరువాత పిండి మిశ్రమాన్ని చెంచాతో కొద్దికొద్దిగా తీసుకుంటూ నూనెలో బిళ్లల మాదిరి వేయాలి. వీటిని రెండువైపులా ఎర్రగా వేయించి పళ్లెంలోకి తీయాలి. వీటిపై కొద్దిగా దాల్చిన చెక్క పొడి, చక్కెర పొడి చల్లితే రుచికరమైన ఫ్రిట్టర్స్ రెడీ..!