నీరు తగ్గితే నలత తప్పదు
ABN , Publish Date - Apr 14 , 2026 | 03:49 AM
వేసవిలో ప్రత్యేకించి గర్భిణులు, 180 మిల్లీలీటర్ల చొప్పున, రోజుకు 8 నుంచి 10 సార్లు నీళ్లు తాగుతూ ఉండాలి. అంటే ఇంచుమించు రోజుకు రెండు నుంచి రెండున్నర లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. ఒకవేళ వేడి ఎక్కువగా ఉంటే, తీసుకునే నీటి పరిమాణాన్ని కూడా పెంచుకోవాలి.....
వేసవిలో ప్రత్యేకించి గర్భిణులు, 180 మిల్లీలీటర్ల చొప్పున, రోజుకు 8 నుంచి 10 సార్లు నీళ్లు తాగుతూ ఉండాలి. అంటే ఇంచుమించు రోజుకు రెండు నుంచి రెండున్నర లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. ఒకవేళ వేడి ఎక్కువగా ఉంటే, తీసుకునే నీటి పరిమాణాన్ని కూడా పెంచుకోవాలి. ప్రత్యేకించి వేసవిలో ఎక్కువ నీటి అవసరతకు కారణం లేకపోలేదు. మనం తాగే నీళ్లలో 80 శాతం నీటిని చిన్నపేగులు శోషించుకుంటాయి. నీటిలో కరిగే బి, సి బి12 రైబోఫ్లేవిన్ విటమిన్లన్నీ ఈ నీటి ద్వారా శోషణ చెందుతాయి. అలా శోషణ చెందినప్పుడు మాత్రమే కడుపులో పెరిగే బిడ్డకు సరిపడా పోషకాలు అందుతాయి. రక్తప్రసరణ కూడా మెరుగ్గా జరుగుతుంది. అలాగే ఉమ్మనీరు తయారీకి కూడా గర్భిణి తాగే నీరే సహాయపడుతుంది.
ఈ ప్రయోజనాలకు తోడు గర్భిణిలకు హైడ్రేషన్‌తో పలు ఉపయోగాలుంటాయి.
మలబద్ధకం
గర్భం దాల్చిన తర్వాత హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా పేగుల కదలికలు తగ్గుతాయి. అదనంగా ఐరన్, క్యాల్షియం సప్లిమెంట్ల వాడకం వల్ల గర్భిణిలు మలబద్ధకం, గ్యాస్ట్రైటిస్ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలంటే సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి.
పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు
రోజుకు రెండున్నర లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి కాబట్టి పూర్తిగా నీళ్ల మీదే ఆధారపడవలసిన అవసరం లేదు. నీళ్లతో పాటు తాజా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, ఎలక్ట్రోలైట్ వాటర్, పాలు కూడా తీసుకోవచ్చు.
వేవిళ్లతో డీహైడ్రేషన్
మొదటి త్రైమాసికంలో గర్భిణులను వేవిళ్లు వేధిస్తాయి. ఈ ఇబ్బంది కొందర్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఆస్పత్రిలో చేర్చి ఐవి ఫ్లూయిడ్స్ కూడా అందించవలసి వస్తుంది. దాంతో డీహైడ్రేషన్ మరింత పెరుగుతుంది. నీళ్లు తాగినా వాంతులు అయిపోతున్న సందర్భాల్లో ఆస్పిత్రిలో చేర్చి, ఐవి ఫ్లూయిడ్స్‌తో పాటు ఇంజక్షన్ రూపంలో వాంతులను ఆపే మందులను కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ద్రవాలను అలవాటు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీరు తాగేయకుండా, కొద్ది కొద్ది పరిమాణాల్లో తాగుతూ ఉండాలి. అలాగే వేవిళ్లతో బాధపడే గర్భిణులు మొదటి మూడు నాలుగు నెలల పాటు మసాలాలు, కారాలు తక్కువగా ఉండే చప్పని ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి. కొబ్బరినీళ్లు, పండ్లరసాలు తీసుకుంటూ ఉండాలి. అలాగే నోటికి నచ్చిన పదార్థాలు తింటూ ఉండాలి. పొట్ట నిండా తినేయకుండా, తక్కువ పరిమాణాల్లో ఎక్కువసార్లు తింటూ ఉండాలి. తేలికగా అరిగే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే వాంతులతో పోషక నష్టం జరుగుతుంది కాబట్టి వైద్యులు సూచించే సప్లిమెంట్లు కూడా తీసుకోవాలి.
ఈ లక్షణాల మీద కన్నేసి...
సరిపడా నీళ్లు తాగని సందర్భాల్లో డీహైడ్రేషన్‌కు లోనవుతాం. అప్పుడు బయల్పడే లక్షణాలు ఈ విధంగా ఉంటాయి...
విపరీతమైన తలనొప్పి
నీరసం, నిస్సత్తువ
కళ్లు తిరగడం
చర్మం పొడిబారడం
మూత్రం ముదురు పసుపు రంగులోకి మారడం
కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడం
పురిటి నొప్పుల్లో సైతం...
డీహైడ్రేషన్‌తో కడుపులో పెరిగే బిడ్డ మీద ఎలాంటి ప్రభావం లేకపోయినా, గర్భిణి మీద కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఉమ్మనీరు తగ్గిపోవడం, మలబద్ధకం, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు వేధించడం వేధిస్తాయి. అరుదుగా నెలలు నిండకుండా ప్రసవమైపోయే పరిస్థితి కూడా తలెత్తుతుంది. ప్రసవ నొప్పులు పడుతున్నప్పుడు తలెత్తే అసౌకర్యం వల్ల కూడా గర్భిణులు నీళ్లు తాగలేరు. కానీ నిజానికి ఈ సమయంలో కూడా తరచూ నీళ్లు, పండ్లరసాలు తాగుతూ ఉండాలి. లేదంటే డీహైడ్రేషన్ వల్ల కడుపులోని బిడ్డ హృదయస్పందనలో తేడాలు చోటుచేసుకుంటాయి. బలమంతా కూడదీసుకుని సహజ ప్రసవానికి సన్నద్ధం కావలసిన కీలక సమయంలో నిండు గర్భిణి అలసటకు లోనవుతుంది. ఒకవేళ సిజేరియన్ చేయవలసిన పరిస్థితి తలెత్తితే, అనస్తీషియా ఇవ్వడానికి కూడా డీహైడ్రేషన్ అడ్డుపడుతుంది. ఆ సమయంలో ఐవి ద్వారా ఫ్లూయిడ్స్ అందించి, ఆ తర్వాతే సర్జరీకి పూనుకోవలసి వస్తుంది.
ప్రసవం తర్వాత కూడా...
సహజ ప్రసవమైనా, సిజేరియన్ ద్వారా బిడ్డను కన్నా, జననాంగ ప్రదేశం ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నీరు తాగాలి. లేదంటే జననాంగ ప్రదేశంలో, కుట్ల దగ్గర పలు రకాల ఇన్‌ఫెక్షన్లు వేధించే ప్రమాదం ఉంటుంది. తల్లి పాలలోనే సరిపడా నీరు ఉంటుంది కాబట్టి ప్రసవానంతరం బిడ్డకు డీహైడ్రేషన్ సమస్య ఉండదు. కానీ సరిపడా నీళ్లు తాగకపోవడం వల్ల తల్లుల్లో కోలుకునే సామర్థ్యం క్షీణిస్తుంది. అలసట, నిస్సత్తువలు వేధిస్తాయి. ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. వీటిని తగ్గించడం కోసం వాడుకునే యాంటిబయాటిక్స్ వల్ల నీరసం తలెత్తి, ఈ సైకిల్ నిరంతరం నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రసవానంతరం త్వరగా కోలుకోవడం కోసం సరిపడా నీరు, పోషకాహారం తీసుకోవాలి. ప్రతి రోజూ నీటి పరిమాణం ఎక్కువగా ఉండే, పుచ్చ, దోస లాంటి రెండు, నుంచి మూడు రకాల పండ్లు తీసుకోవాలి. రోజుకు రెండు సార్లు పాలు తాగాలి. కొబ్బరినీళ్లు, చెరకు రసం, మజ్జిగ తాగుతూ ఉండాలి.

ఉద్యోగినులు, గృహిణులు
ఉద్యోగినుల్లో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువ. ఎసి గదుల్లో పని చేయడం, కదలికలు లేకపోవడం వల్ల దాహం వేయక తక్కువ నీళ్లు తాగుడూ ఉంటారు. దాంతో డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. మన శరీరం 60 నుంచి 70 శాతం నీటితో నిండి ఉంటుంది. శరీరంలోని నీరు కణనిర్మాణాన్ని స్థిరీకరిస్తుంది.