Share News

Deepika Padukone: దీపిక... దేదీప్యంగా

ABN , Publish Date - Jan 08 , 2026 | 04:57 AM

సినీతారలు కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారనీ, వ్యాయామాలతో శరీరాన్ని అందంగా మలుచుకుంటారనీ భావిస్తూ ఉంటాం. కానీ నిండైన ఆరోగ్యానికి ఆహార నియమాల్లో...

Deepika Padukone: దీపిక... దేదీప్యంగా

సినీతారలు కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారనీ, వ్యాయామాలతో శరీరాన్ని అందంగా మలుచుకుంటారనీ భావిస్తూ ఉంటాం. కానీ నిండైన ఆరోగ్యానికి ఆహార నియమాల్లో, వ్యాయామాల్లో పట్టువిడుపు ధోరణి అవలంబించాలని సూచిస్తోంది బాలీవుడ్‌ అగ్ర తార దీపికా పదుకొనె. ఇటీవల తన 40వ పుట్టినరోజును జరుపుకున్న సందర్భంగా దీపిక 40లో 20లా కనిపించేలా చేసే తన ఫిట్‌నెస్‌, డైట్‌ రహస్యాలను అభిమానులతో పంచుకుంది.

‘‘అందంగా కనిపించడానికి వ్యాయామం చేయను, ఫిట్‌గా ఉండడం కోసం వ్యాయామం చేస్తాను. నాకు గుర్తున్నంతవరకూ వ్యాయామం నా జీవనశైలిలో భాగంగా మారిపోయింది. వ్యాయామంలో భాగంగా పిలాటిస్‌, యోగా, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ సాధన చేస్తాను. ఎంత బిజీగా ఉన్నా, వ్యాయామం కోసం ఐదు నిమిషాల సమయాన్ని తప్పనిసరిగా కేటాయిస్తాను. గంటల తరబడి విమాన ప్రయాణ బడలికను వదిలించుకోడానికీ, లేదా విపరీతమైన ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందడానికీ ఈ ఐదు నిమిషాల వ్యాయామం ఎంతో బాగా సహాయపడుతుంది. ఈ వ్యాయామంలో భాగంగా ‘విపరీతకారిణి’ యోగాసనాన్ని సాధన చేస్తాను’’ అంటూ తన వ్యాయామాల గురించి వివరించింది దీపిక. గెహరాయియా సినిమా కోసం దీపిక, యోగా శిక్షకురాలు, అనుష్క మీద ఆధారపడింది. ఆ సినిమాలో యోగా శిక్షకురాలిగా నటించిన దీపిక, చక్రాసనం, మాలాసనం మొదలైన పలు రకాల ఆసనాల్లో అద్భుతమైన సంతులనాన్ని ప్రదర్శించినట్టు ఆమెకు శిక్షణనిచ్చిన అనుష్క ఒక సందర్భంలో మీడియాకు వివరించింది.

పార్ట్‌నర్‌ వర్కవుట్స్‌

దీపిక, యోగాతో పాటు స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ కూడా సాధన చేస్తూ ఉంటుంది. తాళ్ల మీద వేలాడే రోప్‌ వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటుంది. అత్యంత శ్రమతో కూడిన ఈ వ్యాయామం శరీర దారుఢ్యంతో పాటు నమ్యత, చురుకుదనాలను కూడా పెంచుతుందనీ, ఈ వ్యాయామంతో క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయనీ ఒక సందర్భంలో దీపిక వివరించింది. దీపిక వ్యాయామాల్లో పార్ట్‌నర్‌ వర్కవుట్స్‌ కూడా ఉంటాయి. సంయమనం కోసం, కోర్‌ స్ట్రెంగ్త్‌ను పెంచుకోవడం కోసం ఇలాంటి వ్యాయామాలు కూడా అవసరమని అంటున్న దీపిక, అనన్య పాండేతో కలిసి వైవిద్యమైన ఏరోబిక్స్‌ సాధన చేసింది.


నచ్చినవి... మితంగానే...

దీపిక కచ్చితంగా భోజన ప్రియురాలే! క్రీమ్‌తో కూడిన ప్యాన్‌కేక్స్‌, వార్మ్‌ బ్రౌనీస్‌, కరకరలాడే సమోసాలు ఒక పట్టుపడుతున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన దీపిక, నచ్చిన పదార్థాలను ఆస్వాదించడానికి వెనకడుగు వేయొద్దని అభిమానులను కోరింది. ‘‘నా ఫీడ్‌లో ఈ ఫొటోలు చూసి ఆశ్చర్యపోయారా? నిజం చెప్పాలంటే నేను నచ్చినవన్నీ తింటాను. కావాలంటే నా గురించి తెలిసినవాళ్లెవరినైనా అడగండి. నా గురించి ఎక్కడో విన్నవీ, చదివినవీ నమ్మకండి. మరి అన్నీ తింటూ ఇలా ఎలా ఉన్నారని అనుకుంటున్నారా? దీనికొక చిట్కా ఉంది. సమతుల్యత, స్థిరత్వం, శరీరం చెప్తున్నది వినడం... ఈ మూడు సూత్రాలు పాటించాలి. డైట్‌ అనే పదం చుట్టూరా పలురకాల అవాస్తవాలు, అపార్థాలు అలుముకుని ఉన్నాయి. సాధారణంగా మనం డైట్‌ అనగానే కడుపు మాడ్చుకోవడమేనని అనుకుంటాం. తక్కువ తినడంతో పాటు, మనకు నచ్చని పదార్థాలన్నిటినీ తినడమే డైట్‌ అయితే, అలాంటి డైట్‌ చేయకపోవడమే మంచిదన్నది నా ఉద్దేశం. ఒక వ్యక్తి తినే, తాగే ద్రవ, ఘన పదార్థాలన్నిటినీ కలిపి డైట్‌ అనాలి. నిజానికి డైట్‌ అనే పదం, డయాయిటా అనే గ్రీకు పదం నుంచి పుట్టింది. ఈ పదానికి, జీవన విధానం అని అర్థం. నాకు గుర్తున్నంతవరకూ, ఇప్పటివరకూ సంతులన ఆహారశైలినే అనుసరించాను. ఇదే నా జీవన విఽధానం. నిలకడగా పాటించలేని, తాత్కాలికంగా ప్రాచుర్యం పొందిన ఏ ఒక్క ఆహార నియమాన్నీ నేను పాటించలేదు. మరి నేను నచ్చినవన్నీ తినేస్తూ ఉంటానా? అంటే.. అవుననే అంటాను. కానీ అది నా జీవనవిధానం మాత్రం కాదు. తినాలని అనిపించినప్పుడు కోరికను కట్టడి చేసుకోకుండా, మితంగా తినడంలో తప్పు లేదు’’. అంటూ తన ఆహారశైలిని వివరిస్తోంది దీపిక.

నిద్ర - విశ్రాంతి

‘‘వ్యాయామం చేసే వీలు దొరకని రోజు, సెలవు రోజు, కచ్చితంగా కంటి నిండా నిద్రపోతాను. నిద్రకూ, విశ్రాంతికీ సమయం కేటాయించడం వల్ల శరీరం సేద తీరి, శక్తిని పుంజుకుని తర్వాతి రోజుకు సరిపడా నూతనోత్తేజాన్ని పొందుతుంది’’ అంటూ ఎన్ని పనులున్నా, నిద్రకూ విశారంతికీ సమయం కేటాయిస్తానని వివరిస్తోంది దీపిక.

Updated Date - Jan 08 , 2026 | 04:57 AM