ఉంగరాల జుట్టుని ఇలా...
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:41 AM
ఉంగరాల జుట్టు చిక్కులు పడకుండా పొడిబారకుండా నల్లగా నిగనిగలాడుతూ ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...
ఉంగరాల జుట్టు చిక్కులు పడకుండా పొడిబారకుండా నల్లగా నిగనిగలాడుతూ ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...
రింగులు తిరిగిన శిరోజాలకు కొద్దిగా కొబ్బరినూనె లేదా బాదం నూనె రాయాలి. ఆపైన వాటిని నాలుగు భాగాలుగా విభజించి ఒక్కోదాన్ని దువ్వెనతో నెమ్మదిగా దువ్వాలి. వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో దువ్వితే శిరోజాలపై ఒత్తిడి పడదు. కాబట్టి వాటి చివర్లు చిట్లవు. చిక్కులను కూడా త్వరగా తీసేయవచ్చు.
ఉంగరాల జుట్టును కుదుళ్ల నుంచి చివరి దాకా ఒకేసారి గట్టిగా దువ్వకూడదు. దానివల్ల చిక్కులన్నీ చివర్లకు చేరతాయి. వాటిని తీసే క్రమంలో శిరోజాలు ఎక్కువగా ఊడిపోవచ్చు. ముందుగా శిరోజాల చివర్లలో ఉన్న చిక్కులను తీసి ఆపైన క్రమంగా పైకి వెళుతూ కుదుళ్ల నుంచి దువ్వుకోవాలి.
తలస్నానం చేసిన తరువాత కండిషనర్ లేదా సీరమ్‌ను అప్లయ్ చేస్తే శిరోజాలు పొడిబారకుండా ఉంటాయి. లేదంటే వాటి రింగులు పీచులా మారి బలహీనమవుతాయి.
ఉంగరాల జుట్టుకు తేమ అత్యవసరం. కాబట్టి వేడి నీటితో తలస్నానం చేయకూడదు. గోరువెచ్చటి నీటిని మాత్రమే ఉపయోగించాలి. అలాగే తడి శిరోజాలను ఆరబెట్టేందుకు హెయిర్ డ్రైయర్‌ను వాడకూడదు. వీలైనంత వరకు సల్ఫేట్ సమ్మేళనాలు లేని షాంపూలు, కండిషనర్లు ఉపయోగించడం మంచిది.