క్రియాటిన్‌తో కండరపుష్టిక్షేమమేనా?
ABN , Publish Date - Jun 30 , 2026 | 03:51 AM
శరీర దారుఢ్యం కోసం, కండర పుష్టి కోసం, క్రీడాపరమైన సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం క్రియాటిన్, ప్రొటీన్ పౌడర్ల మీద ఆధారపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వీటి వాడకం ఎవరికి అవసరం? ఎంతవరకూ ఆరోగ్యకరం? వైద్యులేమంటున్నారు? తెలుసుకుందాం...
శరీర దారుఢ్యం కోసం, కండర పుష్టి కోసం, క్రీడాపరమైన సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం క్రియాటిన్, ప్రొటీన్ పౌడర్ల మీద ఆధారపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వీటి వాడకం ఎవరికి అవసరం? ఎంతవరకూ ఆరోగ్యకరం? వైద్యులేమంటున్నారు? తెలుసుకుందాం!
మన శరీరానికి క్రియాటిన్ అవసరమే! దీన్ని ప్రొటీన్, హార్మోన్, స్టెరాయిడ్‌గా పొరబడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇది నాలుగైదు అమైనో యాసిడ్ల మిశ్రమ ఉత్పత్తి. మూత్రపిండాలు, కాలేయం, క్లోమంలో క్రియాటిన్ తయారవుతుంది. మన శరీరంలో రోజుకు ఒకటి నుంచి రెండు గ్రాముల క్రియాటిన్ మాత్రమే ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కొంత క్రియాటిన్ రెడ్ మీట్, చేపలు గుడ్లు మొదలైన మాంసాహారం ద్వారా శరీరానికి అందుతూ ఉంటుంది. శాకాహారంలో కూడా క్రియాటిన్ ఉత్పత్తికి అవసరమైన ముడిపదార్థాలు ఉంటాయి. కాబట్టి శాకాహారుల్లో కూడా సరిపడా క్రియాటిన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సమస్యతో రక్తంలో క్రియాటిన్ తగ్గినప్పుడు మినహా ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ అదనంగా బయటి నుంచి క్రియాటిన్‌ను తీసుకోవలసిన అవసరం లేదు.
అదనపు క్రియాటిన్ ఎవరికి?
క్రీడాకారులు, బాడీ బిల్డర్లు కండర పుష్ఠి కోసం అధిక ప్రొటీన్ కలిగిన ఆహారంతో పాటు క్రియాటిన్ కూడా తీసుకోవచ్చు. శరీర దారుఢ్య పోటీలు, శారీరక శ్రమతో కూడిన క్రీడల్లో అత్యధిక సామర్థ్యాన్ని కనబరచాలనుకునేవారికి క్రియాటిన్‌తో ప్రయోజనాలుంటాయి. క్రమం తప్పకుండా జిమ్‌లో వ్యాయామాలు చేసే యువత కూడా క్రియాటిన్ పట్ల ఆసక్తి కనబరుస్తోంది. అయితే క్రియాటిన్‌తో సత్ఫలితాలను పొందాలనుకునే వారు అంతకంటే ముందు వైద్యులను కలిసి మూత్రపిండాల సమస్యలు లేవని నిర్థారించుకోవాలి. అలాగే వైద్యులు సూచించిన మోతాదులను అనుసరించాలి. మొదట శరీర బరువుకు తగ్గట్టు, తక్కువ మోతాదుతో మొదలుపెట్టి, క్రమేపీ పెంచుకోవాలి. అయితే కొందరికి క్రియాటిన్ సప్లిమెంట్స్‌తో దుష్ప్రభావాలు కూడా తలెత్తుతాయి. కడుపుబ్బరం, నొప్పి, వాంతులు, నీళ్ల విరోచనాలు, బరువు పెరగడం లాంటివి కూడా జరుగుతాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్ని రోజుల పాటు క్రియాటిన్ వాడకం ఆపేయాలి లేదా మోతాదును తగ్గించుకోవాలి. ఇలా వైద్యుల పర్యవేక్షణలో తగినంత మోతాదుల్లో తీసుకోగలిగితే, క్రియాటిన్ సత్ఫలితాలను ఇస్తుంది. మూత్రపిండాల రోగుల విషయానికొస్తే, వీరిలో సహజంగానే రక్తంలో క్రియాటినిన్ పేరుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఈ కోవకు చెందినవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రియాటిన్ సప్లిమెంట్లు తీసుకోకూడదు.
క్రియాటిన్ తప్పనిసరి కాదు
త్వరిత ఫలితాల కోసం, వేగంగా కండర పుష్ఠిని పెంచుకోవడం కోసం క్రియాటిన్‌ను ఉపయోగించే యువత సంఖ్య పెరుగుతోంది. కానీ ఆహారం, వ్యాయామాల ద్వారా కూడా కండరపుష్టి సాధ్యపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ సాధారణ వ్యాయామాలు చేసేవారు క్రియాటిన్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. జిమ్ ట్రైనర్లు సూచించే క్రియాటిన్‌ను కొని ఇష్టానుసారం వాడుకోవడం వల్ల శరీరంలో నీటి నిల్వ పెరిగి, దుష్ప్రభావాలు పెరిగి, పరోక్షంగా మూత్రపిండాల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి జిమ్ ట్రైనర్లకు బదులుగా వైద్యుల సలహా ప్రకారం నడుచుకోవాలి.
ప్రొటీన్ పౌడర్లు ఎవరికి?
పోషకాల లోపం ఉన్నప్పుడు వాటిని భర్తీ చేసుకోవడం కోసం అదనపు పోషకాలు తీసుకున్నట్టే ప్రొటీన్ లోపం ఉన్నప్పుడు అదనంగా బయటి నుంచి ప్రొటీన్ తీసుకోవడంలో తప్పు లేదు. మరీ ముఖ్యంగా ప్రొటీన్ విషయంలో, శరీరంలో ప్రొటీన్ తగ్గినప్పుడు, సహజసిద్ధ పద్ధతిలో ఆహారం ద్వారా సరిపడా మాంసకృత్తులు అందేలా చూసుకోవడం ఆరోగ్యకరం. కానీ తక్కువ మోతాదులో ఎక్కువ మాంసకృత్తులను సత్వరమే పొందడం కోసం కొందరు ప్రొటీన్ పౌడర్ల మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ వాటిలో ప్రొటీన్‌తో పాటు నిల్వ పదార్థాలు, రుచిని పెండే అడిటివ్స్, కలరింగ్ ఏజెంట్స్ కలిగిన హానికర రసాయనాలుంటాయి. కాబట్టి ప్రొటీన్‌తో ఒరిగే ప్రయోజనాల కంటే అదనపు రసాయనాలతో కలిగే హానికి కూడా పరిగణనలోకి తీసుకోవాలి. గుడ్లు, సోయా, చేపలు, పాలు, జున్ను, మాంసం ఉత్పత్తులు, చిక్కుళ్లు, పప్పు ధాన్యాలు, విత్తనాలు... వీటన్నిటి ద్వారా కూడా మాంసకృత్తులను పొందవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం పట్ల మొగ్గు చూపించడం అవసరం.
ప్రొటీన్ పౌడర్లతో నష్టాలు
ఈ పౌడర్లలో జోడించే నిల్వ పదార్థాలు, రుచిని పెంచే పదార్థాలతో కొందరికి దుష్ప్రభావాలుంటాయి. ఈ సమస్యతో పాటు అవసరానికి మించి శరీరానికి ప్రొటీన్‌ను అందించడం వల్ల అదనపు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అదనపు ప్రొటీన్ వల్ల జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి. ప్రొటీన్‌ను జీర్ణించుకునే క్రమంలో అమోనియా వాయువు ఉత్పత్తి అవుతుంది. దీంతో కొందరికి తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. మరీ ముఖ్యంగా కాలేయ, మూత్రపిండాల వ్యాధులున్నవారు తక్కువ మాంసకృత్తులతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ కోవకు చెందినవాళ్లు ప్రొటీన్ పౌడర్లు తీసుకున్నప్పుడు ఆ ప్రొటీన్‌ను జీర్ణించుకునే క్రమంలో విడుదలయ్యే అమోనియా వాయువును కాలేయం న్యూట్రలైజ్ చేయలేదు కాబట్టి మెదడు ప్రభావితమై స్పృహ కోల్పోవడం, మూర్ఛలు లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి కాలేయ, మూత్రపిండాల సమస్యలున్నవారు ఎటువంటి పరిస్థితిలోనూ ప్రొటీన్ పౌడర్లను వాడకూడదు. ప్రొటీన్ పౌడర్లను వాడుకోవాలనుకునే క్రీడాకారులు, జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేసే యువత కూడా తప్పనిసరిగా వైద్యులను కలిసి, కాలేయ, మూత్రపిండాల సమస్యలు లేవని నిర్థారించుకోవాలి.
