వన్నె చిన్నెల చికన్‌కారి గాజులు..!
ABN , Publish Date - May 31 , 2026 | 04:15 AM
మహిళలు ఎంతో ఇష్టపడే చికన్‌కారి ఎంబ్రాయిడరీ వర్క్... ప్రస్తుతం గాజులపై అందంగా అల్లుకుని సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ని సృష్టిస్తోంది. లావుగా ఉండే తెల్లటి....
మహిళలు ఎంతో ఇష్టపడే చికన్‌కారి ఎంబ్రాయిడరీ వర్క్... ప్రస్తుతం గాజులపై అందంగా అల్లుకుని సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ని సృష్టిస్తోంది. లావుగా ఉండే తెల్లటి, అలాగే ముదురు, లేత రంగుల దారాలతో డిజైన్ చేసిన చికన్‌కారి గాజులు... సంప్రదాయంగా కనిపిస్తూనే ఆధునిక భావనను కలిగిస్తాయి. అన్ని రకాల చీరలు, సల్వార్ సూట్లు, కుర్తీలు, టాప్‌లు, జీన్స్ మీద అందంగా నప్పుతాయి. పండుగలు, పార్టీల లాంటి ప్రత్యేక సందర్భాల కోసం భారీ డిజైన్లు, రోజువారీ వేసుకోవడానికి సింపుల్ డిజైన్లను యవతులు విరివిగా కొనుగోలు చేస్తున్నారు.
డిజైన్ చేసుకోవచ్చు...
లేత రంగుల్లో ఉండే మల్‌మల్ కాటన్, మస్లిన్, షిఫాన్, జార్జెట్ క్లాత్‌లతోపాటు వెడల్పాటి ప్లాస్టిక్ గాజులు, తెల్లటి సూఫీ కాటన్ దారం, తొమ్మిదో నెంబరు ఎంబ్రాయిడరీ సూది తెచ్చుకోవాలి. గాజు వెడల్పుకు రెండింతలు ఉంటూ చుట్టూ చుట్టడానికి సరిపోయేంత పొడవుగా క్లాత్‌ను ఓ పట్టీలా కత్తిరించాలి. గాజు లోపలి భాగంలో ఫ్యాబ్రిక్ గ్లూను రాయాలి. క్లాత్ పట్టీని గాజుపై ఉంచి దాని అంచులను లోపలికి మడిచి అంటించాలి. దీన్ని సుమారు గంటసేపు ఆరనివ్వాలి. తరువాత క్లాత్‌పై సంప్రదాయ చికన్‌కారి వర్క్ నమూనాలైన తామర పువ్వు, మల్లె తీగ, జాలీ గ్రిడ్ లాంటివాటిలో నచ్చినదాన్ని పెన్సిల్‌తో గీయాలి. తెలుపు లేదంటే నచ్చిన రంగుల దారాలతో గీతలను రన్నింగ్ స్టిచ్‌తో కుట్టాలి. డిజైన్‌ను నింపడానికి ఫ్రెంచ్ ముడులు లేదా షాడో వర్క్‌ను ఉపయోగించాలి. దారాన్ని వదులుగా ఉంచుతూ డిజైన్ కుట్టాలి. తరువాత గాజులను గంజి నీళ్లలో ముంచి తీసి ఆరబెట్టాలి. అప్పుడే గాజులకు బిగుతుగా గరుకుగా ఉండే చికన్‌కారి ఎంబ్రాయిడరీ లుక్ వస్తుంది.

రంగుల ఎంపిక ఇలా...
మోనోక్రమాటిక్ అవుట్ ఫిట్స్, చికన్‌కారి కుర్తీలు, కో ఆర్డిసెట్ల మీద మింట్ గ్రీన్, బేబీ పింక్, పౌడర్ బ్లూ, పీచ్ బ్లష్, క్లాసిక్ వైట్ ఆన్ వైట్, లావెండర్ లాంటి లేత రంగుల్లో డిజైన్ చేసిన చికన్‌కారి గాజులు చక్కగా సూటవుతాయి.
ఆఫీస్ వేర్, ఫార్మల్ డ్రెస్‌లపై క్లాసిక్ వైట్, ఐవరీ రంగుల్లో డిజైన్ చేసిన గాజులు బాగుంటాయి.
వేడుకలప్పుడు ధరించే లెహంగాలు, పట్టు చీరలు, లంగా-ఓణీలపై ఎరుపు, నీలం, పసుపు, ముదురు గులాబీ రంగుల్లో డిజైన్ చేసి అదనపు హంగులు జోడించిన చికన్‌కారి గాజులు గ్రాండ్ లుక్‌నిస్తాయి.
రాత్రి పార్టీలప్పుడు నలుపు, ముదురు నీలం రంగులతో డిజైన్ చేసి మెరిసే రాళ్లు పొదిగిన వాటిని వేసుకుంటే రాయల్ లుక్ వస్తుంది.
వేసవికాలంలో ధరించే పాస్టెల్ కుర్తాలు, బ్రీజీ శారీ్‌సమీద సింపుల్ అండ్ కూల్ కలర్ చికన్‌కారి బ్యాంగిల్స్ అహ్లాదకరంగా కనిపిస్తాయి.
లేత రంగుల చికన్‌కారి గాజులు వేసుకున్నప్పుడు సిల్వర్ లేదా బ్లాక్ మెటల్‌తో రూపొందించిన జుంకాలు, గొలుసులు, ఉంగరాలు ధరిస్తే గ్రేస్‌ఫుల్‌గా కనిపించవచ్చు.
సౌకర్యవంతంగా...
చికన్‌కారీ గాజులు అంత బరువుగా ఉండవు. సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే తేలికగా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. స్టయిల్‌గా కనిపిస్తుంది కూడా. గాజులకు మంచి ఫ్యాబ్రిక్‌ను చుడతారు కాబట్టి చర్మంపై ఎలాంటి దురదలు, అలెర్జీలు రావు. వెండి, బ్లాక్ మెటల్, పంచలోహపు గాజుల వల్ల ఇబ్బంది పడేవారికి ఇవి అనువుగా ఉంటాయి.
