Share News

చీకటిని గెలిచిన వెలుగు దివ్వె

ABN , Publish Date - Aug 10 , 2026 | 01:41 AM

‘‘నాది ఝార్ఖండ్‌లోని సైరెకెలా-ఖార్సవా జిల్లాలో రాంచికి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోలాదిహ్‌ అనే చిన్న గ్రామం. చిన్నప్పుడే నాకు ధనంజయ్‌ మహతోతో వివాహమైంది.

చీకటిని గెలిచిన వెలుగు దివ్వె

‘‘నాది ఝార్ఖండ్‌లోని సైరెకెలా-ఖార్సవా జిల్లాలో రాంచికి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోలాదిహ్‌ అనే చిన్న గ్రామం. చిన్నప్పుడే నాకు ధనంజయ్‌ మహతోతో వివాహమైంది. కొన్నేళ్లపాటు మా సంసారం చాలా ప్రశాంతంగా, అందరిలాగా మామూలుగా సాగిపోయింది. కానీ ఒక చిన్న మాట నా జీవితాన్నే తలకిందులు చేస్తుందని నేను అనుకోలేదు. ఒక రోజు నా బావగారి చిన్న కూతురు వాంతి అయ్యేటట్టు ఉందని చెప్పింది. నేను సరదాగా నవ్వుతూ ‘నువ్వు అమ్మవి కాబోతున్నావేమో ఎవరికి తెలుసు?’ అన్నాను. ఆ అమ్మాయి నవ్వి ఊరుకుంది. కానీ నా పక్కనే ఉన్న ఆమె అక్క మాత్రం నన్ను అనుమానంగా చూస్తూ ‘ఆమె అమ్మ కాబోతోందని నీకెలా తెలుసు?’ అని ప్రశ్నించింది. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి అనారోగ్యానికి గురైంది. దీంతో ఊరి వాళ్లంతా నన్ను అనుమానంగా చూడటం మొదలుపెట్టారు. నా దగ్గర ఏవో శక్తులు ఉన్నాయని, నేనే చేతబడి చేశానని నా అత్తమామలు, ఊరివాళ్లు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. నన్ను ఒక డాయన్‌ (మాంత్రికురాలు) అని పిలవడం మొదలుపెట్టారు.

దుస్తులు చింపి ఊరేగింపు

ఆ తర్వాత నాపై జరిగిన దౌర్జన్యాలు, శారీరక, మానసిక వేధింపులు మాటల్లో చెప్పలేను. నేను చేతబడి చేస్తున్నాననే మూఢనమ్మకంతో నన్ను రోజూ చిత్రహింసలకు గురిచేసేవారు. గ్రామంలోని కొందరు నన్ను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. కొన్నిసార్లు నా దుస్తులు చింపి రోడ్డుపై ఈడ్చూకెళ్తూ ఊరంతా తిప్పేవారు. ఆ దారుణాలను తలచుకుంటుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. వేధింపులు అక్కడితో ఆగలేదు. 1995 సెప్టెంబర్‌లో గ్రామ పంచాయతీ ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంది. నన్ను ముక్కలు ముక్కలుగా నరికి, ఆ రాత్రే నదిలో పడేయాలని తీర్మానించారు.


అర్ధరాత్రి పరారీ

ఆ నరకం నుంచి నేను ఎలా బయటపడ్డానో తలచుకుంటే ఇప్పటికీ కళ్ల వెంట నీళ్లు తిరుగుతాయి. ఆ రోజు పంచాయతీలో ఉన్న మా మేలుకోరే ఒక వ్యక్తి అర్ధరాత్రి మా ఇంటికి వచ్చాడు. ‘ఈ ఊరిలో ఉంటే మిమ్మల్ని చంపేస్తారు. వెంటనే పారిపోండి’ అని చెప్పాడు. అప్పుడు ఇంట్లో నేను, నా భర్త, నా నలుగురు పిల్లలు మాత్రమే ఉన్నాము. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అర్ధరాత్రి ఇంటి వెనుక తలుపు గుండా పారిపోయాం. ఒక చిన్న పడవలో నది దాటి, ఎలాగోలా నా సోదరుడి ఇంటికి చేరుకున్నాను. నేను ఏ తప్పూ చేయలేదు. గ్రామస్థుల అసూయ, మూఢనమ్మకాలే నన్ను ఈ స్థితికి నెట్టాయి. నా నలుగురి పిల్లల్లో ముగ్గుర్ని తీసుకుని నేను బయటపడగా.. ఇంటిని, పశువులను చూసుకునేందుకు నా భర్త, పెద్దకుమారుడు అక్కడే ఉండిపోయారు.

ఎనిమిది నెలలు చెట్టుకిందే..

ఊరి నుంచి తప్పించుకున్నాక కూడా నా కష్టాలు తీరలేదు. నా సోదరుడి ఊరైన బిర్బాన్స్‌లో నేను, నా పిల్లలు దాదాపు ఎనిమిది నెలలపాటు ఒక పెద్ద చెట్టుకిందే కాలం గడిపాము. నా సోదరుడు తన ఇంట్లో ఉండమని ఎంత చెప్పినా, ఎవరిపైనా ఆధారపడటం ఇష్టం లేక తిరస్కరించాను. నేనే కష్టపడి నా పిల్లలను పెంచాలనుకున్నాను. అందుకే కొంత భూమి ఉంటే వ్యవసాయం చేసుకుంటానని అడిగాను. ఆ సమయంలో నా భర్త ఏడాదిపాటు నాతో ఉన్నప్పటికీ ఊరివాళ్లు ఆయనను భయపెట్టేవారు. ‘ఆ దయ్యంతో ఎందుకు ఉంటున్నావు? ఏదో ఒక రోజు అది నిన్ను తినేస్తుంది’ అని నూరిపోశారు. దాంతో ఆయన నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు.


అలా చేయకుంటే బతికేదాన్నే కాదు

ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆ రోజు అర్ధరాత్రి నేను ఊరి నుంచి పారిపోవడమే నా జీవితాన్ని కాపాడిందని అనిపిస్తుంది. సరదాగా అన్న ఒక్కమాట సమాజం దృష్టిలో నన్ను నేరస్తురాలిని చేసింది, తీవ్రమైన వేధింపులకు గురిచేసింది. నేను కనుక ఆ రోజు ఊరిలోనే ఉండి ఉంటే ఈ రోజు సజీవంగా ఉండేదాన్ని కాదు. ఆ రోజు పారిపోయాను కాబట్టే, ఈ రోజు నేను ఈ స్థాయిలో నిలబడగలిగాను. నా జీవితంలో జరిగిన అన్యాయాన్ని తలచుకుని నేను కుంగిపోలేదు. జీవితాన్ని మళ్లీ కొత్తగా నిర్మించుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాను.

జీవితాన్ని మార్చిన మలుపు

నా జీవితంలో అసలైన మలుపు ఝార్ఖండ్‌కు చెందిన ‘ఫ్రీ లీగల్‌ ఎయిడ్‌ కమిటీ’ (ఎఫ్‌ఎల్‌సీ) రూపంలో వచ్చింది. ఆ సంస్థ వ్యవస్థాపకులు జి.ఎస్.జైస్వాల్‌కు నా కథ తెలిసింది. ఆయన నా కథను వెలుగులోకి తెచ్చి, నాకు న్యాయం జరిగేలా సాయం చేశారు. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి జైస్వాల్‌ సార్‌ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. ఆయన నాకు డబ్బు ఇవ్వలేదు కానీ, జీవితంలో ఎలా ముందుకెళ్లాలో సరైన మార్గదర్శకత్వం చేశారు. చేతబడి పేరుతో వేధింపులకు గురవుతున్న మహిళల వివరాలు సేకరించి, వారికి అండగా నిలిచేందుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1996 నుంచి నేను ఆ సంస్థతో కలిసి పనిచేస్తూ, చేతబడి ముద్రపడి వేధింపులు ఎదుర్కొంటున్న వందలాదిమంది మహిళలను రక్షించే పనిలో భాగమయ్యాను.


బాధితురాలి నుంచి రక్షకురాలిగా..

ఒకప్పుడు సమాజం తిరస్కరించి, ఊరి నుంచి నన్ను తరిమేసింది. అదే నేను ఈ రోజు ఝార్ఖండ్‌ ప్రజల దృష్టిలో ‘టైగ్రెస్‌ ఆఫ్‌ ఝార్ఖండ్‌’గా ప్రశంసలు అందుకుంటున్నాను. ప్రస్తుతం నేను బిర్బాన్స్‌ పంచాయతీలోని పునరావాస కేంద్ర బాధ్యతలు చూస్తున్నాను. చేతబడి నెపంతో అన్యాయానికి గురైన మహిళలు ఇక్కడ ఆశ్రయం, ధైర్యం, కొత్త జీవితంపై ఆశను పొందుతున్నారు. సమాజంలో అవగాహన పెరుగుతున్నప్పటికీ, ఝార్ఖండ్‌లోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో ‘చేతబడి’ పేరుతో మహిళలపై దాడులు ఇంకా కొనసాగుతున్నాయి’’

‘పద్మశ్రీ’ పురస్కారంతో గుర్తింపు

సమాజానికి నేను చేసిన సేవలను, మూఢనమ్మకాలపై నేను సాగించిన పోరాటాన్ని గుర్తించి భారత ప్రభుత్వం 2021లో నన్ను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఆ అవార్డు అందుకోవడం నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం. నా జీవిత పోరాటం ఆధారంగా 2014లో ‘కాలా సచ్‌: ది డార్క్‌ ట్రూత్‌’ అనే బాలీవుడ్‌ సినిమా, అలాగే ‘ఆఖిర్‌ కబ్‌తక్‌’ అనే డాక్యుమెంటరీ కూడా వచ్చాయి. అయితే, నాకు వచ్చిన అవార్డుల కంటే గొప్ప విజయం మరోటి ఉంది. భయంతో, సమాజం తిరస్కరించి, నలిగిపోయిన స్థితిలో నా ఇంటికి వచ్చిన ప్రతి మహిళకు నేను రక్షణ కల్పించడమే నా అసలైన విజయం. వారి బాధను అర్థం చేసుకునే ఒక మనిషిగా నేను వారికి అండగా నిలవగలిగాను. సంవత్సరాల క్రితం నా సొంత ఊరి ప్రజలే నను ‘మంత్రగత్తె’ అని పిలిచారు. కానీ ఈ రోజు వందలాది మంది బాధితులు నన్ను తమ రక్షకురాలిగా, మార్గదర్శిగా, ఒక గొప్ప ఆశల వెలుగుగా భావిస్తున్నారు.

Updated Date - Aug 10 , 2026 | 01:42 AM