Share News

సుగంధభరితం...విష దోష హరణం

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:19 AM

ఏలకులు సుగంధ ద్రవ్యాల్లో మేలైనవి. తీపి పదార్థాలు, పాయసం, పలావు, మసాలా వంటకాలు, టీ, కాఫీలకు చక్కని వాసన, రుచిని, నోటికి తాజాదనాన్ని ఇస్తాయి. ఏలకుల్లో పచ్చ ఏలకులు, నల్ల ఏలకులు ముఖ్యమైనవి.

సుగంధభరితం...విష దోష హరణం

ఏలా తిక్తోష్ణ కటుకా లఘ్వీ వాత కఫాపః

శ్వాసాంగమర్ద హృల్లాస మూత్రకృచ్ఛ్ర విషప్రనుత్‌

  • ఏలకులు సుగంధ ద్రవ్యాల్లో మేలైనవి. తీపి పదార్థాలు, పాయసం, పలావు, మసాలా వంటకాలు, టీ, కాఫీలకు చక్కని వాసన, రుచిని, నోటికి తాజాదనాన్ని ఇస్తాయి. ఏలకుల్లో పచ్చ ఏలకులు, నల్ల ఏలకులు ముఖ్యమైనవి. పచ్చ ఏలకులు చిన్నవిగా, తియ్యని సువాసనతో ఉంటాయి. తీపి, పాల పదార్థాలు, పానీయాల్లో వీటిని ఎక్కువగా వాడతారు. నల్ల ఏలకులు పెద్దవిగా, గాఢమైన వాసనతో ఉంటాయి. మసాలా వంటకాలు, కూరలు, పలావుల్లో వీటి వాడకం ఎక్కువ.

  • ఏలకుల్లో సువాసన ఇచ్చే నూనెలు ప్రధానమైనవి. సినియోల్‌, టెర్పినైల్‌ అసిటేట్‌ పదార్థాలు వాటి ప్రత్యేక వాసనకు కారణం. యాలకులకు విష దోషాలను హరించటం, వాపును తగ్గించటం లాంటి లక్షణాలు ఉన్నాయి. వీటిల్లోని సుగంధ తైల పదార్థాలు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. అజీర్తి, కడుపులో అసౌకర్యం తగ్గుతాయి. వీటికి విష దోషాలను హరించే గుణం ఉందని ‘భోజన కుతూహలం’ గ్రంథం పేర్కొంది. వెల్లుల్లి లాంటి ఉగ్రగంథ ద్రవ్యాలను తిన్న తరువాత నోటి దుర్గంధం పోయి, సుగంధభరితంగా ఉండాలంటే రెండు ఏలకులు నమలాలి. ఇది స్త్రీ-పురుష సంబంధాలను బలపరిచే ద్రవ్యం. లైంగిక శక్తిని, ఆసక్తిని పెంచుతాయి. గుండెకు బలాన్నిస్తాయి. హృదయ వ్యాధులున్నవారు చక్కగా తినదగినవి. అయితే గర్భవతులు తినకుండా ఉండటమే మంచిదని సూచించింది ‘భోజన కుతూహలం’.


  • ఈ సుగంధ ద్రవ్యం జఠరాగ్నిని పెంచుతుంది. తిన్నది అరిగేలా చేస్తుంది. మేథ్యా... అంటే తెలివితేటలను పెంచుతుంది. కాబట్టి చదువుకునే పిల్లలకు ఏలకులను పెట్టడం మంచిది. పరీక్షల సమయంలో ఏలకులను నీళ్లలో వేసి కాచి, వేడిగా ఇస్తే పిల్లలకు అలసట తగ్గుతుంది. గాయాలు, పుండ్లు త్వరగా తగ్గేలా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మొలలని నివారించటాకి తోడ్పడుతుంది. ఎలర్జీవల్ల కలిగే దురదలను తగ్గిస్తుంది.

  • ఏలకులు కాస్త వగరుగా, కారంగా ఉంటాయి. దాని పరిమళం ముందు ఈ వగరు, కారం తెలియకుండా పోతుంది. ఇవి తీక్షణంగానే పని చేస్తాయి కాబట్టి, వేడి చేసే స్వభావం ఉంది. చాలా తేలికగా వంటబడతాయి. వాత, కఫ వ్యాధుల్ని బాగా తగ్గిస్తాయి. ఆయాసం, ఉబ్బసం, దగ్గు, జలుబు వ్యాధుల్లో పని చేస్తాయి. రెండు మూడు ఏలకుల్ని దంచి, కప్పు నీళ్లలో వేసి మరగబెట్టి ఆ నీటిని తాగిస్తే, ఈ లక్షణాలు త్వరగా తగ్గుతాయి. ఒళ్లు నొప్పులు, అలసటకు కూడా ఇది పని చేస్తుంది. నోట్లో నీళ్లూరటం, వికారం కూడా ఆగుతాయి. మూత్రం మంటగా ఉండి సరిగా నడవని వారికి ఏలకుల కషాయం రోజూ రెండు మూడు సార్లు ఇస్తే సమస్య తీరుతుంది.

గంగరాజు అరుణాదేవి

Updated Date - Oct 31 , 2026 | 12:19 AM