వివక్షను దాటి చైతన్యం వైపు
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:59 AM
చిన్నప్పుడు తనకు ఎదురైన ఓ చేదు అనుభవం... బాలికలను విద్యావంతులను చేయాలనే దృఢ సంకల్పాన్ని కలిగించింది. మహిళల పట్ల వేళ్లూనుకున్న వివక్షను రూపుమాపి... వారిని ఉన్నతంగా నిలబెట్టే దారిలో తొలి అడుగుకు నాంది అయింది. ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి... దేశ వ్యాప్తంగా లక్షలమంది గ్రామీణ బాలికలను బడి బాట పట్టిస్తున్న సఫీనా హుసేన్ స్ఫూర్తిదాయక కథ ఇది.
చిన్నప్పుడు తనకు ఎదురైన ఓ చేదు అనుభవం... బాలికలను విద్యావంతులను చేయాలనే దృఢ సంకల్పాన్ని కలిగించింది. మహిళల పట్ల వేళ్లూనుకున్న వివక్షను రూపుమాపి... వారిని ఉన్నతంగా నిలబెట్టే దారిలో తొలి అడుగుకు నాంది అయింది. ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి... దేశ వ్యాప్తంగా లక్షలమంది గ్రామీణ బాలికలను బడి బాట పట్టిస్తున్న సఫీనా హుసేన్ స్ఫూర్తిదాయక కథ ఇది.
‘‘దాదాపు రెండు దశాబ్దాల కిందటి మాట... ఉత్తరాఖండ్ ముసోరీ సమీపంలోని ఓ గ్రామం. స్థానిక ప్రజల కోసం ఆరోగ్య కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతానికి వెళ్లాను. మా నాన్న కూడా నాతో వచ్చారు. అక్కడి మహిళలు నాన్నను అడిగారు... ‘మీకు ఎంతమంది పిల్లలు’ అని. ‘ఈమె ఒక్కతే’ అని చెప్పారు. ఆ క్షణం వారి ముఖ కవళికలు మారిపోయాయి. కూతురు పుట్టడం ఏదో విషాదమన్నట్టుగా చూస్తూ... ‘మీరు ఇంకా వయసులోనే ఉన్నారు. కొడుకు కోసం ప్రయత్నించండి’ అని నాన్నకు సలహా ఇచ్చారు. అది నన్ను బాధించింది. ముఖ్యంగా... మగపిల్లల కంటే ఆడపిల్లలను తక్కువ చేసి చూసే వారి ఆలోచనా ధోరణి కలవరపెట్టింది. సాంకేతికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నా... ఇంకా పితృస్వామ్య పోకడలు పట్టి పీడిస్తున్నాయని అర్థమైంది. ఈ పరిస్థితిలో మార్పు తేవాలని గట్టిగా నిర్ణయించుకున్నా.
లండన్ వెళ్లి...
నేను పుట్టి పెరిగిందంతా ఢిల్లీలోనే. పాఠశాల విద్యాభ్యాసం తరువాత బ్రిటన్ వెళ్లాను. ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్’ (ఎల్‌ఎ్‌సఈ)లో బీఎస్సీ చదివాను. అనంతరం దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని వెనుకబడిన ప్రాంతాలకు వెళ్లాను. కొన్నేళ్లు అక్కడి ప్రజలతో కలిసి పని చేశాను. ఇంతటి శక్తిని, ఆత్మస్థైర్యాన్ని నాకు ఇచ్చింది చదువు మాత్రమే. ఈ విషయం అనుభవపూర్వకంగా అర్థమైన వెంటనే భారత్‌కు తిరిగి వచ్చేశాను. వివక్షకు గురవుతున్న గ్రామీణ ప్రాంతాల బాలికల అభ్యున్నతికి చదువు మాత్రమే మార్గమని గ్రహించాను. వివిధ కారణాలతో చదువుకు దూరమైన బాలికలను గుర్తించి, వారిని తిరిగి బడి బాట పట్టించే కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్నాను. దాని కోసం ముంబయిలో ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ పేరుతో 2007లో ఒక స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాను. విద్య నాకు ఎలాంటి అవకాశాలను ఇచ్చిందో... అవే అవకాశాలను గ్రామీణ, అణగారిన వర్గాల బాలికలకు కూడా కల్పించాలని సంకల్పించాను.
విద్య... ప్రగతి...
‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ద్వారా ప్రధానంగా రెండు కార్యక్రమాలపై దృష్టి పెట్టాను. ఒకటి... విద్య. రెండోది ప్రగతి. ‘విద్య’లో భాగంగా గ్రామీణ, మారుమూల పల్లెల్లో చదువుకు దూరమైన ఆరు నుంచి పధ్నాలుగేళ్ల మధ్య వయసు బాలికలను గుర్తించడం, వారిని మళ్లీ బడి బాట పట్టించడం. సాధారణ పాఠశాల విద్యాభ్యాసానికి అర్హతలేని 15 ఏళ్ల బాలికల నుంచి 29 ఏళ్ల యువతులకు మద్దతుగా నిలవడం. వారికి విద్యతో పాటు నైపుణ్యం పెంచుకోవడానికి, స్వశక్తితో ఎదగడానికి కావల్సిన అంశాలను బోధించడం. పితృస్వామ్యం, పేదరికం లాంటి సామాజిక అవరోధాలు మహిళలను వెనక్కు నెట్టేస్తున్నాయి. దీనివల్ల చిన్న వయసులోనే బడి మానేస్తున్నారు. బాల్య వివాహాలకు బలవుతున్నారు. ఇంటి పనులకే పరిమితమవుతున్నారు. అదేవిధంగా వ్యవస్థాగత అడ్డంకులు వ్యక్తిగత స్వేచ్ఛను, నిర్ణయాధికారాన్ని హరిస్తున్నాయి. ఫలితంగా ఏటా లక్షలమంది గ్రామీణ బాలికలకు తమ చదువును కొనసాగించడం ఆచరణ సాధ్యంకాని అంశంగా మారిపోయింది. పితృస్వామ్యం అబ్బాయిని ఒక ఆస్తిగా, అమ్మాయిని ఒక బాధ్యతగా భావిస్తోంది. ఈ అసమానతలు పోవాలంటే ఆడపిల్ల చదువుకోవాలి.
ఇరవై లక్షలమందికి...
బడి మానేయడం కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు... ఏ ప్రాంతంలో సమస్య ఎక్కువగా ఉందో ముందుగా ఆ ప్రాంతంపై దృష్టి పెడతాం. పద్ధెనిమిదేళ్ల కిందట రాజస్థాన్ పాలి జిల్లాలోని యాభై గ్రామాలలో మా కార్యక్రమం మొదలుపెట్టాం. నాటి నుంచి స్థానిక ప్రజలు, నాయకులు, ప్రభుత్వ సహకారంతో అడుగులు వేస్తున్నాం. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లోని 30 వేలకు పైగా గ్రామాల్లో... 22 లక్షలమంది బాలికలను తిరిగి బడికి వెళ్లేలా ప్రోత్సహించాం.
అరుదైన పురస్కారాలు...
మా ‘ఎడ్యుకేట్ గర్ల్స్’తో కలిసి పలు రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు, వేలమంది వాలంటీర్లు, సామాజిక కార్యకర్తలు పని చేస్తున్నారు. వారందరి కృషి ఫలితంగా ఎన్నో మైలురాళ్లను అధిగమించాం. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినందుకు గానూ రెండుసార్లు ఖతార్ ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక ‘వైజ్ ప్రైజ్’ అందుకున్నాను. నేను చదివిన ఎల్‌ఎ్‌సఈ నుంచి గౌరవ డాక్టరేట్ పొందటం మరిచిపోలేని అనుభూతి. అలాగే ఇటీవల ప్రకటించిన టైమ్స్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో నాకు చోటు దక్కింది. ఇంకా ఎన్నో పురస్కారాలు నన్ను వరించాయి. ఇవన్నీ నా సంకల్పానికి బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాయి.’’