Share News

కాకరకాయ ఒరుగులు

ABN , Publish Date - Oct 17 , 2026 | 01:30 AM

కాకరకాయలకున్న సాధారణ గుణాలన్నీ కాకర ఒరుగులకూ ఉంటాయి. అయితే కాకరకాయ కూర తినడం, జ్యూస్‌ తాగ డం, ఒరుగులు తినడం మూడూ ఒకటి కావు. శరీర తత్వాల్నిబట్టి మోతాదుని పరిమితంగా తీసుకుంటేనే కాకర ఉపయోగాలు కనిపిస్తాయి.

కాకరకాయ ఒరుగులు

‘కారవల్లీ శుష్కఫలం కాసఘ్నం వర్థమ్‌ వృద్ధిజిత్‌’

కూరగాయలను సన్నని ముక్కలుగా తరిగి, ఉప్పు రాసి, నీటిని పిండేసి ఎండబెట్టిన వాటిని ఒరుగులు అంటారు. వీటిని ఒక డబ్బాలో పోసి అటకపైన భద్రపరుస్తారు. అటకపైన గోరువెచ్చగా ఉంటుంది. అందువల్ల ఒరుగులు బూజు పట్టవు. నీరు తక్కువగా ఉండే కూరగాయల్ని, పిండితే నీరంతా బయటకు వచ్చేసే వాటిని సాధారణంగా ఒరుగులు చేసుకోవటానికి వాడుతుంటారు. వంకాయలు, కాకరకాయలు, ఆగాకర, దొండ, బెండ, బుడందోస లాంటి కూరగాయలు ఇందుకు అనుకూలంగా ఉంటాయి. ఒరుగుల గురించి ఒక అధ్యాయాన్నే రాశాడు రఘునాథ సూరి. కాకర తీక్షణ స్వభావం కలిగి ఉంటుంది. వేడి చేసే స్వభావం. శరీర దోషాలను తగ్గించడానికి, బలాన్ని పెంచడానికి, విష ప్రభావాలను తగ్గించడానికి తోడ్పడుతుంది. అధిక లాలాజల స్రావం, ఆయాసం, దగ్గు, మొలలు, పేగుల్లో పురుగులు, చర్మ వ్యాధులు, జ్వరం వంటి సమస్యల్లో దీని ప్రయోగాలు ఉన్నాయి. తీపికి వ్యతిరేకంగా పని చేయటంవల్ల తీపి తెచ్చి పెట్టే దోషాలను తగ్గించే స్వభావంవల్ల ఇది షుగరు, ఊబకాయం ఉన్నవారికి వర ప్రసాదం లాంటిది.

ఒరుగులు రక్త శుద్ధి చేస్తాయి. కడుపులో నులిపురుగుల్ని వెళ్లగొడతాయి. ‘భోజన కుతూహలం’ గ్రంథం... ఒరుగులు వదలకుండా వచ్చే దగ్గుని తగ్గిస్తాయని, గజ్జల్లో వచ్చే హెర్నియాపైన పని చేస్తాయని పేర్కొంది. హెర్నియా తొలిదశలోనే గమనించినప్పుడు... కాకర ఒరుగులు రోజూ రెండు మూడు చొప్పున తింటూ ఉంటే అది ఆపరేషన్‌ దాకా వెళ్లకుండా ఉపయోగపడుతుందని దీని సారాంశం. ముదిరిన లేదా పండిన కాకరతో ఒరుగులు చేసుకునేప్పుడు గింజలు తీసేయాలి. వీటిని అతిగా తింటే వేడిని, వాతాన్నీ పెంచుతాయి. వాత వ్యాధులన్నీ ముంచుకొస్తాయి. జీర్ణ సంబంధమైన ఇబ్బందులు కలగవచ్చు. చర్మం పొడిబారి మృదుత్వం కోల్పోయి గరుకుగా మారి, చర్మవ్యాధులు పెరుగుతాయి. గర్భిణులు ముఖ్యంగా కాకరకాయ గింజలు, గాఢమైన రసాలు, ఔషధ మోతాదుల వినియోగంలో జాగ్రత్త వహించాలి.

గంగరాజు అరుణాదేవి

Updated Date - Oct 17 , 2026 | 01:30 AM