వన్నెతరగని వెండితెర కావ్యం
ABN , Publish Date - Jun 28 , 2026 | 02:50 AM
బాపు-రమణల అపూర్వ దృశ్య కావ్యం ‘భక్త కన్నప్ప’, ఆ సినిమా చూసిన వాళ్ళకి ఇప్పటికీ అపురూపమైన పాటలు సన్నివేశాలు, పర్ఫామెన్స్...
బాపు-రమణల అపూర్వ దృశ్య కావ్యం ‘భక్త కన్నప్ప’, ఆ సినిమా చూసిన వాళ్ళకి ఇప్పటికీ అపురూపమైన పాటలు సన్నివేశాలు, పర్ఫామెన్స్... అన్ని గుర్తొస్తూనే ఉంటాయి. ఈ భక్తిరస చిత్రాన్ని అద్భుతమైన పెయింటింగ్‌లా, హృదయాలను అలరించే సౌందర్య భరితంగా సంగీత మాధుర్యంగా రూపొందించడం ‘బాపు-రమణ’లకే సాధ్యం అన్నట్టు ఉంటుంది. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై నేటికీ 50 సంవత్సరాల క్రితం వచ్చిన ‘భక్త కన్నప్ప’ (1976) ఇప్పటికీ వన్నె తగ్గని చిత్రమే! బాపు గారి అద్భుత దృశ్య రూపకల్పనకు, ముళ్ళపూడి వెంకటరమణ గారి కలం జవసత్వాలకు ఒక మచ్చుతునక.
మొదట ఈ చిత్రాన్ని కృష్ణంరాజు గారు తన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌లో నిర్మించ తలపెట్టినప్పుడు, దర్శకుడిగా ‘విక్టరీ’ వి. మధుసూదన రావు గారిని అనుకున్నారు. అంతకుముందే కృష్ణంరాజు గారికి మైలురాయి లాంటి ‘కృష్ణవేణి’ సినిమాను అందించిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. ఆ మేరకు సినిమా పనులు, కొన్ని పాటల రికార్డింగులు కూడా జరిగాయి. అయితే, 1954 నాటి రాజ్‌కుమార్ కన్నడ చిత్రం ‘బేడర కన్నప్ప’ ఆధారంగా కథను సిద్ధం చేస్తున్న తరుణంలో... కొన్ని ట్రీట్‌మెంట్ల విషయంలో, గిరిజన సంస్కృతిని తెరపై ఆవిష్కరించే విధానంలో దర్శకుడికి, నిర్మాతకు మధ్య కొన్ని సృజనాత్మక విభేదాలు (క్రియేటివ్ డిఫరెన్సెస్) తలెత్తాయి. కథను మరింత పకడ్బందీగా, తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చాలనే ఉద్దేశంతో కృష్ణంరాజు గారు బాపు-రమణలను ఆశ్రయించారు. రమణ గారు కథను పూర్తిగా ప్రక్షాళన చేసి, సరికొత్త స్ర్కిప్ట్ సిద్ధం చేశారు. మధుసూదనరావు గారి ఆధ్వర్యంలో రికార్డ్ అయిన పాత ట్యూన్లను పక్కనబెట్టి, బాపు గారి అభిరుచికి, శైలికి తగినట్లు సరికొత్త బాణీలు కట్టించారు. ఒకవేళ మధుసూదనరావుగారే ఈ సినిమాను డైరెక్ట్ చేసి ఉంటే ఇది ఒక మంచి కమర్షియల్ భక్తి చిత్రంగా మిగిలిపోయేదేమో, కానీ బాపు-రమణల చేతుల్లో పడడంతో ఒక అపురూపమైన క్లాసిక్‌గా రూపాంతరం చెందింది.
పగటిపూట కురిసిన వెన్నెల
ఈ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన లలితమైన గీతం ‘ఎన్నియల్లో ఎన్నియల్లో’... నిండు పున్నమి రాత్రివేళ సాగే ఈ పాటను బాపు గారు గోదావరి నదీ తీరంలో, పట్టిసీమ అడవుల్లో పగటిపూట మండుటెండలో షూట్ చేశారు. కెమెరాకు ప్రత్యేకమైన ఫిల్టర్లు అమర్చి, ‘డే-ఫర్-నైట్’ టెక్నిక్‌తో పగటిని రాత్రిగా భ్రమింపజేస్తూ బాపు గారు సృష్టించిన దృశ్య మాయాజాలం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ పాటలో... అడవుల అందాలను కెమెరాలో అద్భుతంగా బంధించిన తీరు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వియస్సార్ స్వామి చాయాగ్రహణం నిర్వహించగా.. ఆపరేటివ్ కెమేరామేన్‌గా ఈనాటి ప్రసిద్ధ ఛాయాగ్రాహకులు ఎస్.గోపాల్ రెడ్డి, ఆపరేటివ్ అసిస్టెంట్‌గా ‘కళ్ళు’ రఘు పని చేశారు.

నటీనటుల అంకితభావం:
అప్పటికే గ్లామర్ క్వీన్‌గా ఉన్న వాణిశ్రీ గిరిజన యువతి ‘నీల’ పాత్ర కోసం గ్లామర్‌ను పూర్తిగా పక్కనపెట్టి, మేకప్ ఉండీ లేనట్టు, లేకుండా నటించారు. పట్టిసీమ, గూటాల, బుట్టాయగూడెం అడవుల్లో కళాత్మకమైన నేపథ్యాన్ని సృష్టించిన ఘనత ‘సీతారాముడు’ అనే బివిఎస్ రామారావు గారిది. బుట్టాయిగూడెంలో కరాటం కృష్ణమూర్తి గారి పొలంలో పెద్ద ఎరీనా సెట్ ప్లాన్ చేశారు. 30 అడుగుల అమ్మవారి తల మోల్డ్ చేశారు. తాటి చెట్లతో పెద్ద ప్రహరీ.. నిర్మించారు. ‘కండ గెలిచింది ...’ అనే పాటలో డ్రమ్ డ్యాన్స్ కోసం గొప్ప మాయాజాలమే చేశారు.
హీరో హీరోయిన్ల తర్వాత అంత గొప్పగా పేరు వచ్చింది కైలాసనాథ శాస్త్రి గారికి, కాశీకి! రావు గోపాలరావు, సారథి ఈ రెండు పాత్రల్లోనూ రచనకు తగినట్టు జీవించారు.
ముఖ్యంగా పాత్రల చిత్రణలో ముళ్ళపూడి చమత్కార భరితంగా రూపొందించిన సన్నివేశాలు మారువేషంలో వచ్చిన శివుడికి, తిన్నడికి మధ్య ఉండే నిష్కల్మషమైన ప్రేమని ఒకవైపు చూపిస్తూనే, ‘‘శివుడి కంట భగ్గుమనే మంట ఉంది. ఓదార్చే వెన్నెలా ఉంది’’ అంటూ రచయిత రాసిన కీలకమైన డైలాగ్ మనోహరంగా ఉంటుంది.
అలాగే సాంబయ్య... తిన్నడికి నీలకి మధ్య అలకని సంధాన పరిచే ప్రయత్నంలో, సరదాగా ప్రారంభించి, పతాక సన్నివేశానికి ప్రాణం పోశారు రమణ .
ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోదగ్గది, విజయానికి బలమైన కారణమైనది... సత్యం గారి సంగీతమే. పాటలన్నీ సూపర్ హిట్! అలాగే రీ-రికార్డింగ్ ఈ సినిమా సాధించిన ఘనవిజయంలో తోడొచ్చింది.
వెండితెరపై బాపు గారి బొమ్మ ఎంత మాట్లాడిందో, తెరవెనుక మెలోడీ బ్రహ్మ చెళ్ళపిళ్ళ సత్యం (సి.సత్యం) గారి సంగీతం అంతకంటే ఎక్కువ మాట్లాడింది. సత్యం గారు అనగానే మనకు మాస్, కమర్షియల్ పాటలు ఎక్కువగా గుర్తొస్తాయి. కానీ ఆయనలోని అసలైన క్లాసికల్ యాంగిల్‌ను, భక్తిరస విద్వత్తును బాపు ఈ సినిమా ద్వారా పరిపూర్ణంగా బయటకు తీశారు. బాపు గారి ప్రత్యేక సూచన మేరకు సత్యం గారు ఈ సినిమా థీమ్ మ్యూజిక్ (నేపథ్య సంగీతం) కోసం (మధ్యమావతి) రాగాన్ని ఎంచుకున్నారు. శాస్త్ర ప్రకారం మధ్యమావతి రాగానికి ఎలాంటి దోషాలనైనా పోగొట్టి, చివరకు మంగళం పాడే (శాంతిని చేకూర్చే) శక్తి ఉందంటారు. కన్నప్ప శివుడికి కన్ను అర్పించే ఆ పరమ భక్తి ఘట్టంలో, అలాగే అరణ్య నేపథ్యంలో వచ్చే ప్రధాన దృశ్యాలలో సత్యంగారు మధ్యమావతి రాగంలోని స్వరాలను సింఫనీ తరహాలో ఆర్కెస్ట్రాతో మిక్స్ చేసి వాయించారు. ఈ సినిమా రీ-రికార్డింగ్ కోసం సత్యం గారు, బాపు గారు రాత్రింబగళ్లు స్టూడియోలోనే గడిపి, ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా మలిచారు. ఆ రీ-రికార్డింగ్ థియేటర్లలో ఉన్న ప్రేక్షకులను ఒక గొప్ప ఆధ్యాత్మిక తాదాత్మ్యత (మైమరపు)లోకి తీసుకెళ్ళింది. దీని రికార్డిస్ట్ స్వామినాథన్ గారికి జాతీయ అవార్డు తెచ్చింది.
చీకటి మలుపు
‘భక్త కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద శతదినోత్సవాలు జరుపుకొని ఎనలేని కీర్తి సంపాదించుకుంది. అయితే, వెండితెరపై అంతటి వెలుగులు నింపిన ఈ సినిమా... రమణగారి వ్యక్తిగత జీవితంలో ఒక చీకటి మలుపునకు కారణమైంది. ఆ విషయాన్ని రమణ గారు ఎంతో నిర్వేదంతో, దాపరికం లేకుండా తన ఆత్మకథ ‘కోతికొమ్మచ్చి’లో రాసుకున్నారు. ఒక పెద్ద ఆర్థిక లావాదేవీ రమణ గారిని అప్పుల ఊబిలో పడేసింది. ఒక ప్రముఖ ‘‘ఆరడుగుల పొడుగువాడి కంట గ్లిసరిన్ చూసి కన్నీరనుకొని జాలిపడి అప్పిచ్చాను. ‘ఇంత గొప్పవాడు నన్ను అడిగాడే’ అన్న అహంకారపు మైకంలో బాపుకి కూడా చెప్పకుండా ఇచ్చాను’’ అంటూ రమణ గారు రాసిన వాక్యాలు చదువుతుంటే, ఆ విజయవంతమైన సినిమా తర్వాత... ఆయన అనుభవించిన గుండెకోత అర్థమవుతుంది. అయితే, ఈ కష్ట కాలంలో కూడా బాపు గారు రమణకు తోడుగా నిలబడడం, రమణ గారు ఇల్లు అమ్ముకున్నాక మళ్లీ బాపు గారి ఇంటి డాబా పైన గదులు కట్టుకుని చేరడం... వారి స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచింది. దీనిపై బాపు గారు ‘‘ఆ విధంగా మేమిద్దరం మళ్ళీ ఒకే ఇంటివాళ్ళమయ్యాం’’ అని వ్యాఖ్యానించడం విశేషం.
‘భక్త కన్నప్ప’ కేవలం కళ్ళ నుండి రక్తం కార్చే శివభక్తుడి కథ మాత్రమే కాదు; సినిమా రంగంలో ఉండే సృజనాత్మక మార్పులకు, బాపు-రమణల అచంచలమైన ప్రతిభకు, సత్యం గారి సంగీత విద్వత్తుకు, జీవితం నేర్పిన చేదు నిజాల కలబోతకు ఒక సజీవ సాక్ష్యం. మధుసూదనరావుగారి ఆలోచనతో మొదలై, బాపుగారి కుంచె గుండా సాగి, రమణగారి కలంలో అమరత్వం పొందిన ‘భక్త కన్నప్ప’... తెలుగు సినిమా ఉన్నంత కాలం బాపు-రమణల కీర్తి కిరీటంలో ఒక స్వచ్ఛమైన మణిపూసగా ప్రకాశిస్తూనే ఉంటుంది. సాంకేతిక హంగులు ఏమాత్రం లేకుండా... హాయిగా సాగే చక్కటి దృశ్య కావ్యం... తరతరాలకు నిలిచిపోయే ‘భక్తకన్నప్ప’.
మళ్లీ మన కోసం...
ముళ్ళపూడి వెంకటరమణ గారి పుట్టినరోజు సందర్భంగా, అలాగే ‘భక్తకన్నప్ప’ సినిమా 50 ఏళ్ల పండుగ సందర్భంగా... బాపు-రమణల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వర ముళ్ళపూడి... ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్ర ప్రదర్శనను ఈ రోజు (ఆదివారం) ఏర్పాటు చేశారు. ఎమ్వీయల్ రాసిన ‘భక్త కన్నప్ప’ వెండితెర నవలతో పాటు రమణ గారి రచనలు ‘ఇద్దరమ్మాయిలు- ముగ్గురబ్బాయిలు’, ‘గిరీశం లెక్చర్లు’ పుస్తకాలను ‘అక్షజ్ఞ’ పబ్లికేషన్స్ వారు పునః ప్రచురణ చేసి ఈ సందర్భంగా ఆవిష్కరించబోతూండడం మరో విశేషం.