ఉదయాన్నే ఇవి తినాలి...
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:43 AM
రోజంతా శరీరం ఉత్సాహంగా, చురుగ్గా ఉండేందుకు ఉదయాన్నే ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం...
రాత్రంతా నానబెట్టిన అయిదారు బాదం పప్పులను ఉదయాన్నే తొక్క తీసి తినాలి. దీనివల్ల బాదం పప్పుల్లోని ఇ విటమిన్, ప్రొటీన్లు, మెగ్నీషియం తదితరాలను శరీరం త్వరగా గ్రహిస్తుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది.
అలాగే నాలుగైదు కిస్‌మిస్‌లు లేదా డ్రై అంజూర్లను నానబెట్టి తింటే రక్తహీనత, నీరసం, మలబద్దకం మాయమవుతాయి. వీటిలో ఉండే ఐరన్, పొటాషియం, పీచులు రక్తంలో హెమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి. జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. వీటిని నానబెట్టిన నీటిని తాగడం వల్ల పేగుల్లో చేరిన వ్యర్థాలు వేగంగా బయటికి వెళ్లిపోతాయి.
ఓ గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా చియా సీడ్స్ లేదా అవిసె గింజల పొడిని కలుపుకుని తాగాలి. దీంతో శరీరానికి ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడతాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అంతర్గత అవయవాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి.
ఉదయాన్నే ఓ కప్పు బొప్పాయి పండు ముక్కలు తింటే వాటిలోని పపైన్ ఎంజైమ్... జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే యాపిల్ ముక్కలు తింటే వాటిలోని పెక్టిన్ అనే పీచు.. పేగుల్లో మంచి బ్యాక్టీరియాలను పెంచడంతోపాటు పొట్ట ఉబ్బరం, అసిడిటీ లాంటి సమస్యలను నివారిస్తుంది.
పొద్దున్నే ఓ గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె కలుపుకుని తాగితే రాత్రంతా శరీరంలో పేరుకున్న టాక్సిన్లు మూత్రం ద్వారా బయటికి వెళతాయి. అంతర్గత కణాల్లో తేమ నిండుతుంది. జీవక్రియల వేగం పెరిగి రోజంతా అలసట, నీరసం రాకుండా ఉంటాయి.