Share News

పూల జాతర

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:56 AM

తెలంగాణ పల్లె జీవనంలో మమేకమైన బతుకమ్మ పండుగ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు వాటి చుట్టూ తిరుగుతూ ఉయ్యాల పాటల పాడుతూ సంబురాలు చేసుకుంటారు.

పూల జాతర

రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు

తెలంగాణ పల్లె జీవనంలో మమేకమైన బతుకమ్మ పండుగ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు వాటి చుట్టూ

తిరుగుతూ ఉయ్యాల పాటల పాడుతూ సంబురాలు చేసుకుంటారు. ఖరీఫ్‌ పంటలు ఇంటికి చేరే సమయంలో వచ్చే ఈ పండుగకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వలస వెళ్లినవారు, కొత్తగా పెళ్లైన ఆడపడుచులు పుట్టింటికి చేరుకుని తొమ్మిది రోజుల ఈ పండుగతో మమేకమవుతారు. తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగకు మలిదశ ఉద్యమం తర్వాత మరింత ప్రాచుర్యం లభించింది. తెలంగాణకు చెందిన ప్రవాసులు విదేశాల్లోనూ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, బ్రిటన్‌... ఇంకా పలు దేశాల్లో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి.

జానపద కథల్లో...

బతుకునిచ్చేది బతుకమ్మ. కలిసి బతకమని చెప్పేది బతుకమ్మ. గౌరీదేవి మహిషాసురుణ్ణి సంహరించిన అనంతరం అలసిపోయి మూర్ఛపోగా... ఆమెను దేవతలు స్తుతించడంతో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయంటారు. కాగా, ఏడుగురు ఆడపిల్లలు పుట్టి చనిపోగా, ఎనిమిదో ఆడబిడ్డకు ‘బతుకమ్మ’ అని పేరు పెట్టడంతో ఆమె జీవించిందని, అది ఈ పండుగకు మూలమని, బతుకమ్మ ఆత్మశాంతి కోసం తంగేడు పూలతో బతుకమ్మ ఆడే సంప్రదాయం ఏర్పడిందని... ఇలా పలు కథలు ప్రచారంలో ఉన్నాయి.


సామాజిక జీవన ప్రతిబింబం

బతుకమ్మ పేర్చడం ఒక ప్రత్యేకమైన కళ. గుమ్మడి ఆకులను, ఇతర వెడల్పాటి ఆకులను అడుగున అమర్చి, వాటి మీద తంగేడు, గునుగు, చామంతి, బంతి తదితర పూలను వరుసగా పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. మధ్యలో గుమ్మడి పువ్వు లేదా తామర పువ్వును ఉంచుతారు. పసుపుతో గౌరమ్మను తయారు చేసి బతుకమ్మపై ప్రతిష్టిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ వేడుకల్లో ఒక్క రోజు మినహా అన్ని రోజులూ వివిధ నైవేద్యాలను బతుకమ్మకు సమర్పిస్తారు. రోజూ సాయంత్రం వేళ మహిళలు బతుకమ్మలను కూడళ్ల వద్దకు తీసుకు వస్తారు. గుండ్రంగా తిరుగుతూ ‘‘ఉయ్యాలో... ఉయ్యాలో’’ అంటూ పాటలు పాడతారు, ఆటలు ఆడతారు. చివరగా చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పాటలు ఆధ్మాత్మికతతోపాటు పుట్టింటి ప్రేమలను, స్థానిక ఆచారాలను, సామాజిక జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. బతుకమ్మ అంటేనే పూల పండుగ. ఇదివరకు తంగేడు, గునుగు, చామంతి, బంతి తదితర పూలు గ్రామాల్లో విరివిగా లభించేవి. వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు, పంటల మార్పిడి, వర్షాభావం కారణంగా గునుగు తదితర పూల లభ్యత తగ్గుతోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో కాగితపు బతుకమ్మలను ఉపయోగిస్తున్నారు. అయితే... పండుగ ఉత్సాహం, స్ఫూర్తి మాత్రం ప్రజల హృదయాల్లో స్థిరంగా ఉన్నాయి.

దాసరి కృష్ణ, జగదేవ్‌పూర్‌

Updated Date - Oct 09 , 2026 | 12:56 AM