Share News

దైవం కోసం త్యాగం

ABN , Publish Date - May 22 , 2026 | 02:29 AM

ఇస్లాం చరిత్రలో ఇబ్రహీం ప్రవక్తది అద్వితీయమైన స్థానం. ఆయన కథ ఎన్ని తరాలు గడిచినా ఆదర్శంగా నిలిచే ఉంది. ఆయన చేసిన త్యాగాలను స్మరిస్తూ ‘ఈదుల్‌ జుహా’ (బక్రీద్‌)...

దైవం కోసం త్యాగం

సందేశం

28న బక్రీద్‌

ఇస్లాం చరిత్రలో ఇబ్రహీం ప్రవక్తది అద్వితీయమైన స్థానం. ఆయన కథ ఎన్ని తరాలు గడిచినా ఆదర్శంగా నిలిచే ఉంది. ఆయన చేసిన త్యాగాలను స్మరిస్తూ ‘ఈదుల్‌ జుహా’ (బక్రీద్‌) పండుగను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు నిర్వహించుకుంటారు. ఇబ్రహీం అడుగుజాడలను అనుసరిస్తూ... లక్షల సంఖ్యలో ముస్లింలు ప్రతి సంవత్సరం ‘హజ్‌’ యాత్ర నిర్వహిస్తారు. ప్రళయం వచ్చేవరకూ గుర్తుండిపోయే త్యాగశీలి ఇబ్రహీం.

దైవభీతి, విధేయత, చిత్తశుద్ధి, కర్తవ్య నిష్ట, అకుంఠిత దీక్ష, ఆదర్శం ... వీటన్నిటి కలబోత ఇబ్రహీం ప్రవక్త. ఆయన జీవితమంతా త్యాగాలమయం. చిన్న వయసులోనే తండ్రిని, ఆ తరువాత మాతృభూమిని, భార్యా బిడ్డలను త్యాగం చేశారు. చివరకు ప్రాణప్రదంగా పెంచిన ఏకైక కుమారుణ్ణి కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. దైవం విధించిన అన్ని పరీక్షల్లోనూ గెలిచి... దైవ ప్రసన్నతను పొందారు. ‘ఖలీలుల్లాహ్‌’ (అల్లాహ్‌ స్నేహితుడు)గా ప్రసిద్ధి చెందారు. ఆయన జీవితంలో ఎన్నో గొప్ప సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే.. తనకు సంతానం లేదనే వేదన ఆయనను బాధించింది. వృద్ధాప్యం వరకూ వేచి చూసిన ఇబ్రహీం... తనకు సద్వర్తనుడైన కుమారుణ్ణి ప్రసాదించాల్సిందిగా అల్లా్‌హను వేడుకున్నారు. ఆయన ప్రార్థనను అల్లాహ్‌ స్వీకరించాడు. సహనశీలుడైన కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆ కుమారుడే హజ్రత్‌ ఇస్మాయిల్‌. లేకలేక పుట్టిన ఇస్మాయిల్‌ను ఇబ్రహీం అల్లారుముద్దుగా పెంచుకున్నారు.

స్వప్నంలో ఆదేశం

బాల్యం నుంచి ఇబ్రహీం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇస్మాయిల్‌ పుట్టాక కష్టాలన్నిటినీ క్రమంగా మరచిపోతున్న సందర్భంలో... ఎన్నడూ లేనంత కఠినమైన పరీక్ష ఆయనకు ఎదురయింది. అల్లాహ్‌ సందేశం ప్రవక్తలకు చాలా రకాలుగా అందుతుంది. అలాంటి సందేశం ఇబ్రహీంకు స్వప్నం ద్వారా అందింది. ఇస్మాయిల్‌ను తాను స్వయంగా బలి ఇస్తున్నట్టు ఆ కలలో కనిపించింది. ‘ఏదో కలే కదా?’ అని ఇబ్రహీం దాన్ని నిర్లక్ష్యం చెయ్యలేదు. ఆ కలను అల్లాహ్‌ ఆదేశంగా భావించారు. తన ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ కల గురించి ఇస్మాయిల్‌కు వివరించి, ‘‘అది అల్లాహ్‌ ఆదేశం’’ అని చెప్పినప్పుడు... ‘‘అల్లాహ్‌ కోరితే నన్ను ఒక సహనశీలిగా చూడగలవు’’ అని వినయ విధేయతలతో తండ్రితో అంటూ అంగీకారం తెలిపాడు.


అల్లాహ్‌ ప్రసన్నత

దైవాదేశాన్ని అమలు చేయడానికి మర్వా కొండకు ఇస్మాయిల్‌ను ఇబ్రహీం తీసుకు వెళ్ళారు. అక్కడ అతణ్ణి బలి (జిబహ్‌) ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అప్పుడు... తన దాసుని త్యాగనిరతికి ప్రసన్నుడైన అల్లాహ్‌... ఇస్మాయిల్‌కు బదులుగా ఒక పొట్టేలును జిబహ్‌ చేసేందుకు పంపించాడు. ‘‘ఇబ్రహీం! నీవు కలను నిజం చేసి చూపించావు. దైవం కోసం గొప్ప త్యాగానికి సిద్ధపడ్డావు. సత్కార్యం చేసేవారికి మేము ఇటువంటి ఇలాంటి ప్రతిఫలాన్నే ఇస్తాం. నిశ్చయంగా ఇది ఒక స్పష్టమైన పరీక్ష. మేము ఒక పెద్ద ఖుర్బానీని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించుకున్నాము’’ అని అల్లాహ్‌ ప్రకటించాడు (దివ్య ఖుర్‌ఆన్‌). తదనంతరం తన కుమారుడితో కలిసి కాబా మసీద్‌ను ఇబ్రహీం నిర్మించారు. ఆ తండ్రీ కుమారుల త్యాగాన్ని స్మరిస్తూ... ముస్లింలు బక్రీద్‌ పండుగ నిర్వహించుకుంటారు. ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ ఖుర్బానీ ఇస్తారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌.

ఇవి కూడా చదవండి..

అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..

రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..

Updated Date - May 22 , 2026 | 02:29 AM