రుచిగా...ఆరోగ్యంగా
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:05 AM
శరీరాన్ని మనసును ఆరోగ్యంగా ఉంచే పురాతన భారతీయ వైద్య విధానమే ఆయుర్వేదం. ఇందులో మన పూర్వీకులు చెప్పిన నియమాలు పాటిస్తూ ప్రకృతితో మమేకమైతే ఎలాంటి అనారోగ్యమూ దరిచేరదంటున్నారు ‘కైరాలీ ఆయుర్వేదిక్ గ్రూప్’ మేనేజింగ్ డైరెక్టర్ గీత రమేష్.
శరీరాన్ని మనసును ఆరోగ్యంగా ఉంచే పురాతన భారతీయ వైద్య విధానమే ఆయుర్వేదం. ఇందులో మన పూర్వీకులు చెప్పిన నియమాలు పాటిస్తూ ప్రకృతితో మమేకమైతే ఎలాంటి అనారోగ్యమూ దరిచేరదంటున్నారు ‘కైరాలీ ఆయుర్వేదిక్ గ్రూప్’ మేనేజింగ్ డైరెక్టర్ గీత రమేష్. ఆయుర్వేదం సూచిస్తున్న జీవన విధానంతోపాటు ఆరోగ్యానికి ఉపకరించే విభిన్న వంటల గురించి ఆమె తన ‘హార్మోని’ పుస్తకంలో ఇలా చెప్పుకొచ్చారు.
ఆయుర్వేద సూత్రాలను దైనందిన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి?
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. వంటకు స్టీల్ లేదా కంచు పాత్రలు, ఆహారాన్ని నిల్వకు గాజు సీసాలు వినియోగించడం మంచిది. ప్రమాదకరమైన నాన్‌స్టిక్ సామాన్లను తెచ్చుకోకూడదు. చెక్క, వెదురు, మట్టితో చేసిన వాటిని ఉపయోగించుకోవాలి. వీటివల్ల వంటకాలు పోషక విలువలతో నిండి రుచికరంగా ఉంటాయి. వంట పాత్రలను శుభ్రం చేయడానికి రసాయనభరితమైన లిక్విడ్ డిటర్జెంట్లకు బదులు వెనిగర్, బేకింగ్ సోడా, నిమ్మ చెక్క తదితరాలను వాడాలి.
ప్రతి ఒక్కరూ సరైన ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలి. తినేముందు వాటి తయారీ, నాణ్యతలను గమనించాలి. బాగా నములుతూ తినాలి. కాలానుగుణంగా స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలను తరచూ తింటుంటే జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది.
ఇంటి వాతావరణానికి, భావోద్వేగాలకు ప్రాముఖ్యమివ్వాలి. ఇంటి పరిసరాలతోపాటు హాల్, కిచెన్, బాల్కనీల్లో వీలైనన్ని మెక్కలు పెంచాలి. ఇవి మనం పీల్చే గాలిని శుద్ధి చేస్తాయి. పత్తి, జనపనార, ఉన్ని, మట్టితో తయారుచేసిన కళాత్మక వస్తువులతో ఇంటిని అలంకరించుకోవాలి. కుట్లు, అల్లికలు లాంటివి మానసిక ఆనందాన్ని పెంపొందిస్తాయి. వీలైనప్పుడల్లా బంధువులు, స్నేహితులతో గడుపుతూ సంబంధ బాంధవ్యాలను పెంచుకోవాలి.
పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేయాలి. వస్తువుల పునర్వినియోగం, సేంద్రీయ వ్యవసాయం, వర్షపు నీటి సేకరణలపై దృష్టి సారిస్తూ ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకోవాలి.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
శరీరంలో వాత, కఫ, పిత్త దోషాలు ఉంటాయి. ఆ తత్వాలకు సరిపడే విధంగా ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆకలిగా ఉంటేనే తినాలి. సాధ్యమైనంత వరకు వేడిగా ఉన్నప్పుడే తినడం మంచిది. రాత్రిపూట త్వరగా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఎండాకాలంలో చలువచేసేవి, చలికాలంలో వేడినిచ్చేవి తినడం ఉత్తమం.
ఆయుర్వేద జీవనశైలిని పాటిస్తూ మాంసాహారాన్ని తినవచ్చా?
సమతుల్యమైన ఆహారాన్ని తినమని ఆయుర్వేదం చెబుతుంది. శరీర తత్వం, ఆరోగ్య స్థితిని అనుసరించి అవసరం మేరకు మితంగా మాంసాహారాన్ని తీసుకోవచ్చు.
ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని తినవచ్చా?
తాజాగా వండినవి ఆరోగ్యానికి మంచివి. కానీ నేటి బిజీ లైఫ్ వల్ల కొంత వెసులుబాటును అనుసరించవచ్చు. ఫ్రిజ్ నుంచి తీసిన ఆహారం గది ఉష్ణోగ్రతకు వచ్చాక కొద్దిగా వేడిచేసుకుని తినవచ్చు. దానితోపాటు తాజా పండ్లు లేదా అప్పుడే తయారుచేసిన సలాడ్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
ఆయుర్వేదం ప్రకారం వంట ఎలా చేయాలి?
ఆహారంలో పోషకవిలువలు పోకుండా జీర్ణక్రియ వేగంగా జరిగేలా వంట చేయాలని ఆయుర్వేదంలో చెప్పారు. ఆవిరి మీద ఉడికించడం, నీళ్లు పోసి మూతపెట్టి ఉడకబెట్టడం, కాల్చడం లాంటివి తప్పనిసరి. వంటకాల రుచిని పెంచడానికి తగిన మూలికలు, సుగంధ ద్రవ్యాలను చేర్చడం కూడా సూచించారు.
ఎర్ర బియ్యం పాయసం
కావాల్సిన పదార్థాలు: ఎర్ర బియ్యం- అర కప్పు, బెల్లం తురుము- అర కప్పు, యాలకుల పొడి- అర చెంచా, శొంఠి పొడి- పావు చెంచా, నెయ్యి- రెండు చెంచాలు
తయారీ విధానం: కుక్కర్లో ఎర్ర బియ్యాన్ని తీసుకుని ఓసారి కడిగి రెండు కప్పుల నీటిని పోసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి బెల్లం తురుము వేసి నాలుగు చెంచాల నీటిని చిలకరించి కరిగాక వడబోయాలి. కుక్కర్ మూత తీసి అందులో బెల్లం నీటిని పోసి బాగా కలపాలి. దీన్ని స్టవ్ మీద పెట్టి అయిదు నిముషాలు ఉడికించాలి. ఆపైన యాలకుల పొడి, శొంఠి పొడి, నెయ్యి వేసి కలిపి దించాలి. దీన్ని వేడిగా లేదా చల్లగా సర్వ్ చేయవచ్చు.
పనీర్ కొబ్బరి కూర
కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె- రెండు చెంచాలు, అల్లం తురుము- చెంచా, వెల్లుల్లి తురుము- చెంచా, అందుబాటులో ఉన్న కూరగాయల ముక్కలు (క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ తదితరాలు)- కప్పు, పనీర్ ముక్కలు- 200 గ్రాములు, ధనియాల పొడి- చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా, కొబ్బరి పాలు- రెండు కప్పులు, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- చెంచా
తయారీ విధానం: స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి కొబ్బరి నూనె వేసి వేడిచేయాలి. ఆపైన అల్లం తురుము, వెల్లుల్లి తురుము, కూరగాయల ముక్కలు, పనీర్ ముక్కలు, ధనియాల పొడి వేసి కలిపి పది నిముషాలు వేయించాలి. ఆపైన కొబ్బరి పాలు పోసి మరో పది నిముషాలు ఉడికించాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి కలిపి దించాలి. ఇలా తయారైన పనీర్ కొబ్బరి కూరను వేడన్నం లేదా ఉడికించిన క్వినోవాతో సర్వ్ చేయవచ్చు.
మునగాకు సూప్
కావాల్సిన పదార్థాలు: నెయ్యి- రెండు చెంచాలు, ఉల్లిపాయ ముక్కలు- పావు కప్పు, అల్లం తురుము- చెంచా, వెల్లుల్లి తురుము- చెంచా, మునగాకు- మూడు కప్పులు, ఆవ ఆకుల తరుగు- అర కప్పు, సోంపు గింజలు- చెంచా, పసుపు- పావు చెంచా, అన్నం- రెండు చెంచాలు, మిరియాల పొడి- అర చెంచా, నిమ్మరసం- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత
తయారీ విధానం: స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నెయ్యి వేసి అది కరిగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, వెల్లుల్లి తురుము వేసి కలుపుతూ అయిదు నిముషాలు వేగనివ్వాలి. ఆపైన ఆవ ఆకుల తరుగు, మునగాకు తరుగు వేసి కలపాలి. ఇవన్నీ వేగి దగ్గరకు వచ్చాక సోంపు గింజలు, పసుపు, ఉప్పు, అన్నం వేసి కలపాలి. ఆపైన అయిదు కప్పుల నీటిని పోసి చిన్న మంట మీద పావుగంటసేపు మరిగించి దించాలి. బ్లెండర్ సహాయంతో సూప్‌ని రెండు నిముషాలు బ్లెండ్ చేయాలి. తరువాత మిరియాల పొడి, నిమ్మరసం వేసి కలిపి ఉప్పు సరిచూసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
క్వినోవా వెజిటబుల్ ఫ్రై
కావాల్సిన పదార్థాలు
క్వినోవా- కప్పు, కొబ్బరి నూనె- రెండు చెంచాలు, అల్లం తురుము- చెంచా, వెల్లుల్లి తురుము- చెంచా, క్యాప్సికమ్ ముక్కలు- అర కప్పు, క్యారెట్ ముక్కలు- అర కప్పు, పనీర్ ముక్కలు- 200 గ్రాములు, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- అర చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా, పుదీనా తరుగు- కొద్దిగా
తయారీ విధానం
క్వినోవాను శుభ్రంగా కడిగి రెండు కప్పుల నీటిని పోసి మూతపెట్టి పావుగంటసేపు ఉడికించాలి. తరువాత నీటిని వంచేసి చల్లారనివ్వాలి. స్టవ్ మీద పాన్ పెట్టి కొబ్బరి నూనె వేసి వేడిచేయాలి. ఆపైన అల్లం తురుము, వెల్లుల్లి తురుము వేసి ఓ నిముషం వేయించాలి. తరువాత క్యాప్సికమ్, క్యారెట్, పనీర్ ముక్కలు వేసి కలిపి అయిదు నిముషాలు వేయించాలి. ఆపైన క్వినోవా, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి నెమ్మదిగా కలపాలి. రెండు నిముషాల తరువాత దించి కొద్దిగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.