మేడమ్ చీఫ్
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:29 AM
వ్యూహ చతురత, స్ఫూర్తిమంతమైన నాయకత్వం, సాటిలేని నిబద్ధత, సుదీర్ఘమైన అనుభవం సుసాన్ కోయిల్ సొంతం.సైనికురాలిగా మొదలైన 39 ఏళ్ళ ఆమె వృత్తి జీవితం ఎన్నో మైలురాళ్ళను దాటింది.ఇప్పుడు ఆస్ట్రేలియా దేశ చరిత్రలోనే తొలి మహిళా ఆర్మీ చీఫ్‌గా కొత్త చరిత్ర రాయడానికి ఆమె సిద్ధమవుతున్నారు.
వ్యూహ చతురత, స్ఫూర్తిమంతమైన నాయకత్వం, సాటిలేని నిబద్ధత, సుదీర్ఘమైన అనుభవం సుసాన్ కోయిల్ సొంతం.సైనికురాలిగా మొదలైన 39 ఏళ్ళ ఆమె వృత్తి జీవితం ఎన్నో మైలురాళ్ళను దాటింది.ఇప్పుడు ఆస్ట్రేలియా దేశ చరిత్రలోనే తొలి మహిళా ఆర్మీ చీఫ్‌గా కొత్త చరిత్ర రాయడానికి ఆమె సిద్ధమవుతున్నారు.
చాలా దేశ సైనిక దళాల్లో మహిళల ఉనికి ఇప్పటికీ నామమాత్రంగా ఉన్న నేపథ్యంలో... ఆస్ట్రేలియా సైనిక దళాలకు అధిపతిగా సుసాన్ కోయిల్ నియమితురాలు కావడం ఒక విశేషమైతే... ఆ దేశం రక్షణ దళాలపై ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భంలో ఆమెను ఆ పదవి వరించడం మరింత ఆసక్తికరమైన పరిణామం. సైన్యంలోని వేలాదిమంది మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు, వివక్ష చోటు చేసుకుంటున్నాయని, ఈ పరిణామాల నుంచి వారిని కాపాడడంలో ‘ఆస్ట్రేలియా డిఫెన్స్ ఫోర్స్’ (ఏడీఎఫ్) విఫలమయిందనీ ఆరోపిస్తూ కిందటి ఏడాది ఆస్ట్రేలియాలో ఒక వ్యాజ్యం దాఖలయింది. ఈ వేధింపులు వ్యవస్థాగతంగా సాగుతున్నాయన్న ఫిర్యాదులు, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడడం సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో సైనిక నాయకత్వంలో కీలకమైన మార్పులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఆర్మీ చీఫ్‌గా నియమితురాలైన సుసాన్ కోయిల్ వచ్చే జూలైలో కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు.
అదే పునాది...
ఆస్ట్రేలియాలోని క్యోగ్లీలో... 1970 మే 21న సుసాన్ జన్మించారు. పదిహేడేళ్ళ వయసులో ఆర్మీ రిజర్వ్ సైనికురాలిగా చేరిన ఆమె ‘ఆస్ట్రేలియా డిఫెన్స్ ఫోర్సెస్ అకాడమీ’ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ అందుకున్నారు. ‘రాయల్ ఆస్ట్రేలియన్ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్’లో పూర్తి స్థాయి వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆధునిక యుద్ధ వ్యూహాల్లో నిపుణురాలు కావడానికి ఇది ఆమెకు పునాదిగా నిలిచింది. అంచెలంచెలుగా ఎదిగి కమాండర్ జాయింట్ టాస్క్ ఫోర్స్ 633, సిక్స్త్ బ్రిగేడ్ కమాండ్, ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ డివిజన్, ఫోర్సెస్ కమాండ్ తదితర విభాగాల్లో బాధ్యతలు చేపట్టారు. 2024 నుంచి చీఫ్ ఆఫ్ జాయింట్ క్యాపబిలిటీ్‌సగా వ్యవహరిస్తున్నారు. స్పేస్ అండ్ సైబర్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. క్షేత్ర స్థాయి అనుభవం కూడా ఆమెకు అపారం. పశ్చిమ ఆసియా, అప్ఘనిస్తాన్, సాల్మాన్ ఐలాండ్స్, మధ్యప్రాచ్యం, తైమూర్-లెస్టే లాంటి ప్రాంతాల్లో ఆపరేషన్స్ నిర్వహించారు. 125 ఆస్ట్రేలియా సైనిక చరిత్రలో తొలి మహిళా ఆర్మీ చీఫ్‌గా తన నియామకంపై ఆమె స్పందిస్తూ.. ‘‘నాకున్నవిస్తృతమైన అనుభవమే ఈ బాధ్యతలకు, నామీద దేశం ఉంచిన నమ్మకానికి బలమైన పునాది’’ అని అన్నారు.
సంగీతం, నాటకాలు, పుస్తకాలు
సుసాన్ భర్త మార్క్ కూడా సైన్యానికి చెందిన వ్యక్తే. ఆస్ట్రేలియా సైన్యానికి చెందిన ‘రాయల్ ఆస్ట్రేలియన్ ఇంజనీర్స్’లో అధికారిగా పని చేస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ‘‘నా వృత్తిలో ఒత్తిడి సహజంగానే అధికంగా ఉంటుంది. దానినుంచి తప్పించుకోవడానికి సంగీతం వింటాను, నాటకాలు చూస్తాను, పుస్తకాలు చదువుతాను. ఖాళీ దొరికితే కుటుంబంతో పర్యటనలకు వెళ్తాను’’ అంటూ తన అభిరుచుల గురించి ఒక సందర్భంలో చెప్పుకున్నారు సుసాన్. ఆధునిక యుద్ధాల్లో సైబర్ ఆపరేషన్స్, అంతరిక్ష, నెట్‌వర్క్ ప్రధానమైన సామర్థ్యాలకు ప్రాధాన్యత నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో... ప్రత్యేకించి సమాచార, సైబర్ వ్యవస్థలపై సుసాన్‌కు ఉన్న పరిజ్ఞానం ఆస్ట్రేలియాను భద్రతాపరంగా, సైనికపరంగా మరింత పటిష్టపరుస్తుందని సైనికరంగ నిపుణులు భావిస్తున్నారు. అలాగే... తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సుసాన్ రూపంలో పరిష్కారం దొరుకుతుందని ఆస్ట్రేలియా సైన్యంలోని మహిళలు ఆశిస్తున్నారు.