Share News

ఇంగువ.. పరిమళభరితం.. ఆరోగ్యం

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:37 AM

మన ఆహార సంస్కృతిలో ఇంగువకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వేద కాలం నుంచి వంటల్లో సుగంధ ద్రవ్యంగా, జీర్ణక్రియకు సహాయపడే పదార్థంగా, ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నాం.

ఇంగువ.. పరిమళభరితం.. ఆరోగ్యం

హింగు వాత కఫానాహ శూలఘ్నం పిత్తప్రకోపనం

కటుపాకే సరం రూక్షం ప్లీహానాహాంత్ర వృద్ధిజిత్‌

మన ఆహార సంస్కృతిలో ఇంగువకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వేద కాలం నుంచి వంటల్లో సుగంధ ద్రవ్యంగా, జీర్ణక్రియకు సహాయపడే పదార్థంగా, ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నాం. ఇంగువ చెట్టు నుంచి తీసిన జిగురు (ఓలియోగమ్‌ రెజిన్‌).

మాంసంలో నీచు వాసన తగ్గటానికి వెల్లుల్లికన్నా ఎక్కువ శక్తివంతంగా పని చేస్తుంది. శాకాహారపు తాలింపుల్లో చిటికెడంత ఇంగువ పొడి వేస్తే చాలు... ఇల్లంతా ఘుమఘుమ వ్యాపిస్తుంది. అంత కొద్ది పరిమాణంలోనే ఇది కడుపులో గ్యాస్‌, ఉబ్బరం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది.

‘ఫెరులా అసఫొటిడా’ అనే వృక్షనామం కలిగిన మొక్క వేర్లకు గాటు పెట్టి, వచ్చిన స్రావాన్ని గట్టిపరచినదే ఇంగువ. ఈ మొక్కలు ప్రధానంగా ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, మధ్య ఆసియా ప్రాంతాల్లో పెరుగుతాయి. కాబూలీ ఇంగువ పేరెన్నికగన్నది.

ఇంగువలో ఫెరూలిక్‌ యాసిడ్‌, ఉంబెల్లిఫెరోన్‌ అనే రసాయనాలు జీవకణాలను కాపాడే యాంటీ ఆక్సిడెంటుగా, వాపు ఏర్పడే పరిస్థితులను నివారించేవిగా ఉంటాయి. ఇతర రసాయనాల వలన సూక్ష్మజీవుల పెరుగుదల, జీవక్రియలపై ప్రభావం కలిగిస్తుంది ఇంగువ.


ఇంగువను వాతాన్ని, కఫాన్ని తగ్గించే ఔషధంగా భావిస్తారు. జీర్ణశక్తిని ప్రేరేపిస్తుందని, కడుపు నొప్పిని తగ్గిస్తుందని ‘చరక సంహిత’ పేర్కొంది. ఆధునిక పరిశోధనల్లో కూడా ఇంగువలోని రసాయన పదార్థాలు, యాంటీఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్‌ లక్షణాలు, జీర్ణవ్యవస్థపై వాటి ప్రభావం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

ఇంగువ వాత వ్యాధుల్లో ఉత్తమ ఔషధం అని భోజన కుతూహలం పేర్కొంది. కఫాన్ని జయిస్తుంది. ఇంగువ, ముద్ద కర్పూరం కలిపి నూరి, పెసర గింజంత మాత్రలు చేసుకుని, ఒకటి రెండు మాత్రలు చొప్పున అవసరాన్నిబట్టి రోజూ రెండుసార్లు మింగుతూ ఉంటే ఉబ్బసం తీవ్రత తగ్గుతుంది.

వేడిశరీర తత్త్వం ఉన్నవారికి ఇంగువ బాగా వేడి చేస్తుంది. అజీర్తి వలన కలిగే కడుపు ఉబ్బరానికి మాత్రమే దీన్ని వాడాలి. ఇది ఎసిడిటీని పెంచుతుంది కాబట్టి గ్యాస్ట్రయిటిస్‌, అల్సర్లు లాంటీవి ఏర్పడినప్పుడు ఇంగువను ఎక్కువ వాడకపోవడమే మంచిది.

ఇంగువ విరేచనకారి. చర్మాన్ని పొడిబారుస్తుంది. కానీ లివరు స్ప్లీన్‌లలో ఏర్పడిన వాపులవల్ల కలిగే వ్యాధులపై బాగా పని చేస్తుంది.

రక్తాన్ని పలుచబరచే ఔషధ గుణం ఇంగువకు ఉంది. కాబట్టి రక్తస్రావం అవుతున్నప్పుడు, నెలసరి సమయాల్లోనూ, ఇంగువని తక్కువగా వాడుకోవాలి.

ఇంగువతో తయారైన ఆయుర్వేద ఔషధాలలో ‘రజఃప్రవర్తనీ వటి’ అనేది నెలసరి సక్రమంగా రానివారికి బాగా ఉపయోగపడుతుంది. ‘ఫలసర్పి’ అనే ఔషధం స్త్రీల వ్యాధుల్లో బాగా పని చేస్తుంది.

‘హింగ్వాష్టక చూర్ణం’ అనే ఔషధం జీర్ణశక్తిని పెంచి, గ్యాసును తగ్గిస్తుంది.

ఇంగువకు ప్రత్యేకమైన, ఘాటైన వాసన, రుచి ఉంటాయి. చాలా తీక్షణమైన పరిమళం కలిగింది. ఇంగువకు అనేక రెట్లు గోధుమ పిండిని కలిపిన ఇంగువ మాత్రమే మనకు మార్కెట్లో దొరుకుతోంది. అసలైన ఇంగువ ముద్ద బజార్లో దొరికేది కాదు. దొరికినా గుండుసూది మొనతో తీసి తాలింపులో వేసినా ఎక్కువైపోతుంది. అంత ఉగ్రగంథి ఇంగువ.

- గంగరాజు

అరుణాదేవి

Updated Date - Nov 28 , 2026 | 12:37 AM