Share News

వారి జ్ఞాపకం.. ఆమె అభిరుచి

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:23 AM

అపురూపమైన, అరుదైన వస్తువులు సేకరించే హాబీ ఎంతోమందికి ఉంటుంది. కానీ ప్రచేతా బెనర్జీ అభిరుచి ప్రత్యేకమైనది. అరుదైన డిజైన్లున్న వెడ్డింగ్‌ గౌన్లను పన్నెండేళ్ళుగా ఆమె...

వారి జ్ఞాపకం.. ఆమె అభిరుచి

అపురూపమైన, అరుదైన వస్తువులు సేకరించే హాబీ ఎంతోమందికి ఉంటుంది. కానీ ప్రచేతా బెనర్జీ అభిరుచి ప్రత్యేకమైనది. అరుదైన డిజైన్లున్న వెడ్డింగ్‌ గౌన్లను పన్నెండేళ్ళుగా ఆమె సేకరిస్తున్నారు. ‘‘అవి కేవలం దుస్తులు కావు. ఒక గొప్ప వేడుకకు చిహ్నాలు. వధువు కోసం రూపుదిద్దుకున్న కళాఖండాలు’’ అంటున్నారు పెయింటర్‌గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రచేత. ఆ ఆసక్తి వెనుకకథేమిటంటే...

‘‘ప్రతి కళకూ మరొక కళతో అంతర్గతమైన అనుబంధం ఉందనేది నా నమ్మకం. ఒక కళ నుంచి మరో కళలోకి నన్ను నేను మార్చుకోగలను’’ అని చెబుతారు ప్రచేతా బెనర్జీ. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన ఆమె చిన్నప్పుడే కాగితాలు, రంగు పెన్సిళ్ళు పట్టుకొని బొమ్మలు గీయడం ఆరంభించారు. ‘‘మొదట్లో సరదాగా బొమ్మలు వేసేదాన్ని. వాటిని చూసి అందరూ మెచ్చుకోవడంతో... గొప్ప ఆర్టిస్ట్‌ కావాలన్న ఆలోచన పదకొండేళ్ళ వయసులో కలిగింది. అప్పటి నుంచి సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేశాను. కలరింగ్‌లో ‘చిత్ర చైల్డ్‌ ఆర్ట్‌ ఇనిస్టిట్యూట్‌’ నుంచి జాతీయ పురస్కారాన్ని, బంగారు పతకాన్ని అందుకున్నాను. విద్యార్థినిగా ఎన్నో అవార్డులు దక్కించుకున్నా’’ అంటున్న ప్రచేత... 2011 నుంచి డిజిటల్‌ పెయింటింగ్స్‌ వేస్తున్నారు.


పాత్ర కోసం తొలిసారిగా...

కోల్‌కతాలో సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో యానిమేషన్‌ స్పెషలైజేషన్‌తో మాస్‌ మీడియాలో గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నప్పుడు... కాస్ల్పే కళాకారులతో ప్రచేతకు పరిచయం ఏర్పడింది. ‘‘కాస్ల్పే’ లేదా ‘కాస్‌-ప్లే’ అనే మాట కాస్ట్యూమ్స్‌, ప్లే అనే పదాల కలయికతో ఏర్పడింది. కామిక్‌ పుస్తకాలు, వీడియో గేమ్స్‌, టీవీ షోలు, యానిమేషన్‌ చిత్రాల్లోని పాత్రల్లా దుస్తులు, మేకప్‌, అభరణాలు ధరించి... ఆ పాత్రలు మాట్లాడే తీరును, హావభావాలను, బాడీ లాంగ్వేజ్‌ను అనుసరించి ఫొటో షూట్లలో, స్టేజీ ప్రోగ్రామ్స్‌లో, వీడియోల్లో నటించడాన్ని ‘కాస్ల్పే’ అంటారు’’ అని చెబుతున్న ప్రచేత... 2013లో తొలి కాస్ల్పే ప్రదర్శన ఇచ్చారు.

ఒక పాత్ర కోసం తొలిసారిగా ధరించిన పాత మోడల్‌ వెడ్డింగ్‌ గౌను ఆమెను అమితంగా ఆకట్టుకుంది. ‘‘ప్రతి వెడ్డింగ్‌ గౌన్‌ వెనుక ఒక గొప్ప జ్ఞాపకం ఉంటుంది. ఒక వధువు కలలకు, అభిరుచికి అది ప్రతిరూపం. ప్రత్యేకించి... యాభై, అరవై ఏళ్ళ క్రితం వివిధ దేశాల్లో తయారైన వెడ్డింగ్‌ గౌన్ల డిజైన్లు... ఇప్పుడు వింటేజ్‌ లుక్‌తో గొప్పగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన వాటిని సేకరించాలనే ఆలోచనకు అప్పుడే బీజం పడింది’’ అని గుర్తు చేసుకున్నారు ప్రచేత. అలాంటి వాటికోసం వెతుకుతున్నప్పుడు... ‘అలీఎక్స్‌ప్రెస్‌’ అనే చైనీస్‌ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో ఒక గౌను ఆమెకు బాగా నచ్చింది. అప్పట్లో ఇండియాలో ఆ ప్లాట్‌ఫామ్‌ అందుబాటులో ఉండేది. అందులో మొదటగా కొనుగోలు చేసి... వెండ్డింగ్‌ గౌన్‌ కలెక్షన్‌కు 2015లో శ్రీకారం చుట్టారు. ప్రస్తుతానికి వాటి సంఖ్య వంద దాటేసింది.


వెయ్యి నుంచి లక్షల దాకా...

‘‘మొదటి వెడ్డింగ్‌ గౌన్‌ వెయ్యి రూపాయలకు కొన్నాను. డెలివరీ కూడా ఫ్రీయే. అయితే విదేశాల నుంచి తెప్పించడం ఇప్పుడు బాగా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. కొన్నేళ్ళ క్రితం 20-30 డాలర్లుండేది. ఇప్పుడు ఒక గౌను తెప్పించడానికి దాదాపు 120 డాలర్లు ఖర్చవుతోంది. కస్టమ్స్‌ డ్యూటీ దానికి అదనం. ఇక గౌన్ల ఖరీదు వాటి గ్రేడ్‌, విలువను బట్టి ఉంటుంది. మన కరెన్సీలో చెప్పాలంటే... నా దగ్గర వెయ్యి రూపాయల నుంచి కొన్ని లక్షల ఖరీదైన గౌన్లు ఉన్నాయి. నాణ్యమైన మెటీరియల్‌, విస్తృతమైన లేస్‌ వర్క్‌తో తయారైనవి, పాతకాలం నాటివి, వింటేజ్‌ లుక్‌తో ఉన్నవి ఎక్కువ ధర పలుకుతాయి. యాభై-అరవై ఏళ్ళ పూర్వం నాటి గౌన్లు నా కలెక్షన్‌లో ప్రధానంగా ఉన్నాయి’’ అని చెబుతున్నారు ప్రచేత.

భారీ అలంకరణలున్న, లేస్‌, పూల అప్లిక్‌లతో పొరలుగా ఉన్న రొమాంటిక్‌ ఏ-లైన్‌ స్కర్టుల నుంచి నిరాడంబరంగా కనిపించే సరళమైన, కాలమ్‌-కట్‌, పొడవాటి చేతులున్న వాటి వరకూ ఆమె కలెక్షన్‌లో ఎన్నో రకాలున్నాయి. దుస్తులు పారదర్శకంగా, లేస్‌తో నిండి ఉంటే, మరికొన్ని అలంకరణల కన్నా రూపకల్పనలో నైపుణ్యం, సున్నితమైన ఎంబ్రాయిడరీలతో ఆకర్షిస్తాయి. ‘‘పదేళ్ళకు పూర్వం నాటి గౌన్లను జాగ్రత్తగా భద్రపరచాలి. వింటేజ్‌, ఆధునిక ఫ్యాబ్రిక్‌లు వేర్వేరుగా ఉంటాయి. పాత దుస్తులు మరీ సున్నితంగా ఉంటాయి. ఇస్త్రీ కూడా జాగ్రత్తగా చెయ్యాలి. కొన్ని గౌన్లకు డ్రై వాషింగ్‌ లేదా ప్రొఫెషనల్‌ డ్రై క్లీనింగ్‌ అవసరం’’ అంటారామె.


పెట్టుబడిగా చూడడం లేదు...

పెయింటర్‌గా ప్రచేతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. 2016లో... కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రతిష్ఠాత్మకమైన ‘మిల్లర్‌ వరల్స్‌ అవార్డును గెలుచుకున్నారు. ఆమె ఆ అవార్డు పొందిన తొలి భారతీయురాలు కాగా, ప్రపంచవ్యాప్తంగా 1500 మంది కళాకారుల్లోంచి ఎంపికైన ఆరుగురిలో ఒకరు. ఆ తరువాత మన దేశంలో, విదేశాల్లో అనేక ప్రదర్శనలను స్వయంగాను, ఇతరుల భాగస్వామ్యంతో నిర్వహించారు. అనేక పురస్కారాలను అందుకున్నారు. బ్రిటన్‌కు చెందిన ‘ది గార్డియన్‌’ లాంటి పత్రికల్లో, సుప్రసిద్ధమైన ఆర్ట్‌ వెబ్‌సైట్లలో ఆమె రూపొందించిన చిత్రాలు చోటు చేసుకున్నాయి. పెయింటర్‌గా, కాస్ల్లే కళాకారిణిగా బిజీగా ఉంటూనే... అరుదైన వెడ్డింగ్‌ గౌన్ల సేకరణను కొనసాగిస్తున్నారు. ‘‘నేను సేకరించిన ప్రతి గౌను నా సైజులోనే ఉండాలనుకోను. భవిష్యత్తులో లాభాలు వచ్చే పెట్టుబడిగా కూడా పరిగణించను. వాటిలో ఒక్కొక్కదాన్ని కుట్టడంలో కళాకారులు చూపిన శ్రద్ధ, కచ్చితత్వం, నైపుణ్యం... అవే నాకు ఆనందాన్ని కలిగిస్తాయి. వీటిని నేను కళాత్మక దృష్టితో మాత్రమే సేకరిస్తున్నాను తప్ప ధరించడం కోసం కాదు. భవిష్యత్తులో వాటితో ప్రదర్శన ఏర్పాటు చేస్తాను’’ అంటున్నారు ప్రచేత.

Updated Date - Nov 28 , 2026 | 01:03 AM