Share News

మానసిక ఆరోగ్యమే ప్రధానం

ABN , Publish Date - Feb 12 , 2026 | 03:34 AM

కొందరి ప్రాధామ్యాలు కాస్త భిన్నంగా, సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేలా ఉంటాయి.ప్రముఖ సితార్‌ విద్వాంసులు పండిట్‌ రవిశంకర్‌ కుమార్తె అనౌష్క శంకర్‌ తాజాగా,గ్రామీ అవార్డులకు బదులుగా, తన మానసిక ఆరోగ్యానికీ, ఇండియా టూర్‌కూ ప్రాధాన్యం ఇచ్చింది. అందుకు ఆమె వెల్లడించిన ఆసక్తికరమైన కారణాలివి.

మానసిక ఆరోగ్యమే ప్రధానం

కొందరి ప్రాధామ్యాలు కాస్త భిన్నంగా, సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేలా ఉంటాయి.ప్రముఖ సితార్‌ విద్వాంసులు పండిట్‌ రవిశంకర్‌ కుమార్తె అనౌష్క శంకర్‌ తాజాగా,గ్రామీ అవార్డులకు బదులుగా, తన మానసిక ఆరోగ్యానికీ, ఇండియా టూర్‌కూ ప్రాధాన్యం ఇచ్చింది. అందుకు ఆమె వెల్లడించిన ఆసక్తికరమైన కారణాలివి.

‘‘ఈసారి గ్రామీ అవార్డుల్లో రెండు విభాగాలకు నా పాటలు ఎంపికయ్యాయి. ఇది కచ్చితంగా హర్షించదగిన విషయమే! ఇవి నా 12, 13వ గ్రామీ నామినేషన్లు. గెలిస్తే అదొక అపురూపమైన అనుభవమవమయ్యేది. కానీ నిజానికి ఆ గెలుపోటముల మీద నాకు ఆసక్తి లేదు. ఆ పాటల పోటీలు, గెలుపులు, గుర్తింపుల కంటే నా మానసిక ఆరోగ్యం, వృత్తిపరమైన బాధ్యతలకే నా తొలి ప్రాధాన్యం.

అంతటి శ్రమ అవసరమా?

ఇలాంటి పాటల పోటీలు వేడుకలన్నీ భావోద్వేగాలు, ఆర్థికపరమైన ప్రభావాలతో ముడిపడి ఉంటాయి. నాకు నా మానసిక ఆరోగ్యమే ప్రధానం. వేలకొద్దీ డాలర్లు ఖర్చుపెట్టి, విమానాల్లో గంటల తరబడి ప్రయాణించి వేడుకలకు హాజరవడం ఒక ఎత్తైతే, ఆ సమయంలో ధరించవలసిన దుస్తులు, ఓటమిని ఎదుర్కోగలిగే మనోధైర్యాన్ని కూడదీసుకోవడం మరొక ఎత్తు. గెలిస్తే పెట్టుబడిగా పెట్టిన శ్రమకు, ఖర్చుకు తగిన ఫలం దక్కుతుంది. ఓడిపోతే ఆ ప్రభావం మన మానసిక, శారీరక ఆరోగ్యాలను దెబ్బతీస్తుంది. నిజానికి సంగీత ప్రపంచంలో ప్రత్యేకించి గ్రామీ లాంటి ప్రపంచ విభాగాల్లో ప్రధాన స్రవంతికి చెందిన పెద్ద కళాకారులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కువ డబ్బున్న వాళ్లందరూ మార్కెటింగ్‌ కోసం విరివిగా ఖర్చు పెడతారు. నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, నామినీ ఈవెంట్లకు హాజరవుతూ, వాళ్ల సంగీతం, పేర్లను ఓటర్ల మనసుల్లో ముద్రించుకుపోయేలా కృషి చేసే సంగీతకారులు కూడా ఉంటారు. నేనిలా లాస్‌ ఏంజిల్స్‌లో గ్రామీ వేడుకలకు హాజరు కాకూడదనే నిర్ణయం తీసుకోవడం వెనక మరొక బలమైన కారణం లేకపోలేదు. నాకు నా పాటలు, అభిమానులు, పర్యటనలే ముఖ్యం.

దురుద్దేశం లేదు

ఈ ఏడాది ఈ వేడుకలకు హాజరు కాకూడదనీ, బదులుగా భారతదేశంలో టూర్‌లో పాల్గొనాలనీ ఉద్దేశపూర్వకంగానే నిర్ణయించుకున్నాను. అవార్డులు ముఖ్యం కాదు. కళాకారిణిగా ప్రజలకు సంగీతాన్ని వినిపించడం ద్వారా మనకు దొరికే ఆదరణ నాకెంతో ముఖ్యం. ఈ అనుభవం ప్రశంసలకు మించినది.

ఛాప్టర్‌ 3: వి రిటర్న్‌ టు లైట్‌ ఆల్బమ్‌కూ, ఆల్బమ్‌లోని ప్రధాన పాట, ‘డే బ్రేక్‌’కూ రెండుసార్లు నామినేట్‌ అయినందుకు గర్వపడుతున్నాను. అయినప్పటికీ అవార్డులకు హాజరవడానికి బదులుగా స్వదేశంలో టూర్‌కు ప్రాధాన్యం ఇవ్వడంలో ఎలాంటి దురుద్దేశం లేదు. గ్రామీ అవార్డుల పట్ల ఎలాంటి వ్యతిరేకతా లేదు. తెర వెనక వాస్తవం ఎలా ఉంటుందో తెలియపరచడానికే ఈ వివరణ ఇస్తున్నాను.

భారత దేశంలో నా అద్భుతమైన బ్యాండ్‌తో, సిబ్బందితో మ్యూజిక్‌ టూర్‌లో పాల్గొనడం నాకొక అపురూప అనుభవం. గ్రామీకి ఎంపికైన నా సాటి నామినీలకూ, మరీ ముఖ్యంగా నా అభిమాన సంగీతకారులకూ బెస్ట్‌ విషెస్‌ తెలుపు కుంటున్నాను.

Updated Date - Feb 12 , 2026 | 03:34 AM