Share News

‘ఆత్మగౌరవం’తో ఒకటయ్యారు

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:01 AM

సినీ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌... వ్యాపారవేత్త కావ్యా మారన్‌... తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా ముడివేసుకున్నారు. గ్రీస్‌లో అట్టహాసంగా జరిగిన వేడుకలో ఇద్దరూ ఒకటయ్యారు.

‘ఆత్మగౌరవం’తో ఒకటయ్యారు

సినీ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌... వ్యాపారవేత్త కావ్యా మారన్‌... తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా ముడివేసుకున్నారు. గ్రీస్‌లో అట్టహాసంగా జరిగిన వేడుకలో ఇద్దరూ ఒకటయ్యారు. సంప్రదాయ పెళ్లిళ్లకు, ఆచారాలకు విరుద్ధంగా... కులమతాలకు అతీతంగా... ‘ఆత్మగౌరవ వివాహం’ చేసుకొని సమానత్వపు స్ఫూర్తిని చాటారు. ఘనంగా నవజీవన ప్రయాణంలోకి అడుగుపెట్టారు. ఇంతకీ ఏమిటీ ‘ఆత్మగౌరవ వివాహం’?

ఒకరు సుమధుర స్వరాలతో సంగీతాభిమానులను సమ్మోహితులను చేస్తున్నారు. మరొకరు వ్యాపారవేత్తగా, ఐపీఎల్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ సహయజమానిగా క్రికెట్‌ ప్రేమికులకు దగ్గరయ్యారు. అనిరుధ్‌ రవిచందర్‌, కావ్యా మారన్‌... భిన్న రంగాలు... విభిన్న నేపథ్యాలు... కానీ ప్రేమ వారిద్దరినీ కలిపింది. తమ ప్రేమానురాగాలను జీవితకాలం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. గ్రీస్‌లో వైభవంగా జరిగిన వేడుకలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

వేద మంత్రాలు... పురోహితులు లేకుండా... సంప్రదాయ వివాహాలు, ఆచారాలకు భిన్నంగా... దండలు మార్చుకున్నారు. ‘ఆత్మగౌరవా’నికి చిహ్నంగా ఇద్దరూ మ్యాచింగ్‌ పెండెంట్‌లను, బంగారు హారాలను ఇచ్చిపుచ్చుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తదితర ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. ముందు రోజు జరిగిన నిశ్చితార్థం, మరుసటిరోజు పెళ్లి ఫొటోలు బయటకు రావడం, అందులో వధూవరులు ఒకరి మెడలో ఒకరు బంగారు గొలుసులు వేసుకొంటున్న చిత్రాలు కనిపించడంతో ‘ఆత్మగౌరవ వివాహం’ (సెల్ఫ్‌రెస్పెక్ట్‌ మ్యారేజ్‌) గురించి ఆసక్తికర చర్చ మొదలైంది.


ఇదే విషయాన్ని డీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి డాక్టర్‌ టీబీఆర్‌బీ రాజా ధ్రువీకరించారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆశీర్వదించగా ఇద్దరూ ‘ఆత్మగౌరవ వివాహం’ చేసుకున్నారని ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. స్టాలిన్‌ను ‘తలైవర్‌’ అని, రజనీకాంత్‌ను ‘సూపర్‌స్టార్‌’ అని తన పోస్టులో ఆయన పేర్కొన్నారు. ‘‘కావ్య, అనిరుధ్‌ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు.

తలైవర్‌... కావ్యకు, సూపర్‌స్టార్‌... అనిరుధ్‌కు గొలుసులు అందించారు. వాటిని వధూవరులు ఒకరి మెడలో ఒకరు వేసుకున్నారు. పెద్దల సమక్షంలో ఇరువురి హృదయాలు ఒక్కటయ్యాయి’’ అంటూ రాజా పోస్ట్‌ చేశారు. రజనీ, స్టాలిన్‌లకు నూతన జంటతో బంధుత్వం కూడా ఉంది. అనిరుధ్‌కు రజనీ మేనమామ. కావ్య తండ్రి కళానిధి మారన్‌కు స్టాలిన్‌ బంధువు.

ఏమిటీ పెళ్లి ప్రత్యేకత...

‘ఆత్మగౌరవ వివాహం’ చేసుకోవాలనేది కావ్య, అనిరుధ్‌ నిర్ణయంగా చెబుతున్నారు. ఇంతకీ ఏమిటి ఈ పెళ్లి ప్రత్యేకత? దీని వెనుక కథేమిటి? ఈ ప్రశ్నలతో సెర్చ్‌ ఇంజన్లు తెగ బిజీ అయిపోయాయి. తమిళనాడులో సంఘసంస్కర్త పెరియార్‌ రామస్వామి 1925లో ‘ఆత్మగౌరవ ఉద్యమం’ స్థాపించారు. ఇందులో నుంచి పుట్టుకొచ్చిందే ‘ఆత్మగౌరవ వివాహం’. సమానత్వం, వ్యక్తిగత గౌరవాన్ని కోరుకొంటూ... కుల వివక్ష, పితృస్వామ్య ఆచారాలను సవాలు చేస్తూ చేపట్టిన హక్కుల ఉద్యమం ఇది. భారత కుల వ్యవస్థలో అణచివేతకు గురైనవారికి సామాజిక సమానత్వాన్ని సాధించడం దీని లక్ష్యం.

పెళ్లికి మతపెద్దల ఆమోదం కానీ, విస్తృతమైన ఆచారాలు, క్రతువులు కానీ అవసరం లేదనేది ఉద్యమం ప్రధాన ఆలోచనల్లో ఒకటి. ఒక జంట పూల మాలలు, ఉంగరాలు, లేదా వివాహానికి సంబంధించిన మరేదైనా చిహ్నాలను మార్చుకొని ఒక్కటి అవ్వడం. పెద్దల సమక్షంలో తమ నిబద్ధతను ప్రకటించుకోవడం. అంటే సంప్రదాయ హిందూ వివాహ వేడుకలకు, ఇతర సంప్రదాయ ఆచార వ్యవహారాలకు భిన్నంగా జరిగే వేడుక ఇది.

దంపతుల అంగీకారం, నిబద్ధత, సమానత్వం దీని ప్రధాన ఉద్దేశం. 1967లో హిందూ వివాహ చట్టానికి చేసిన సవరణ ద్వారా తమిళనాడులో ఈ ఆచారానికి చట్టపరమైన గుర్తింపు లభించింది. ఈతరహా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం అనిరుధ్‌, కావ్యలదేనని చెబుతున్నారు.


ఆ పెళ్లిపై రగడ...

కాగా ఈ నెల 1న డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ మనవరాలి పెళ్లి వేద మంత్రాలతో జరిగింది. దీన్ని ద్రవిడ కజగం అధ్యక్షుడు కె.వీరమణి తప్పు పట్టారు. ఇది పార్టీ సిద్ధాంతాలైన హేతువాదానికి, ఆత్మగౌరవానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఇది డీఎంకే ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని టీవీకే నాయకుడు, తమిళనాడు ఆర్థిక మంత్రి మేరీ విల్సన్‌ విమర్శించారు.

ఈ విమర్శలపై దురైమురుగన్‌ స్పందిస్తూ... విదేశాల్లో చదువుకున్న తన మనవరాలు కులాంతర వివాహం చేసుకుందని, ఆమె అభీష్టం ప్రకారమే వివాహాన్ని వైదిక సంప్రదాయబద్ధంగా జరిపించానని, దీన్ని రాజకీయం చేయవద్దని కోరారు. ఈ వివాహానికి డీఎంకే అధినేత స్టాలిన్‌ కూడా హాజరవడం గమనార్హం.

జీవితంలో ఒక్కసారే...

అనిరుధ్‌, కావ్య తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచారు. ఇద్దరూ ఎక్కడ, ఎలా కలుసుకున్నారు, ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించింది అనేది కూడా ఎక్కడా పంచుకోలేదు. అయితే గత ఏడాది న్యూయార్క్‌ వీధుల్లో ఇద్దరూ కలిసి నడుస్తున్న ఫొటో ఒకటి ఇంటర్‌నెట్‌లో ప్రత్యక్షమవడంతో ఊహాగానాలు మొదలయ్యాయి.

ఆ ఊహాగానాలే నేడు నిజమయ్యాయి. కాగా కావ్యతో తన పెళ్లికి సంబంధించిన ఫొటోను అనిరుధ్‌ తొలిసారి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశారు. ‘‘నా జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అవకాశం. జీవితాంతం నిలిచిపోయే క్షణం... 11.11’’ అంటూ దానికి క్యాప్షన్‌ పెట్టారు. వీరిద్దరి రిసెప్షన్‌ ఈ నెల 21న చెన్నైలో జరగనుంది.

Updated Date - Nov 14 , 2026 | 12:11 AM