Share News

నోరూరించే ఉసిరి రుచులు

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:05 AM

పుల్లగా, వగరుగా నోరూరించే ఉసిరికాయలతో ఇంటిల్లిపాదీ ఆస్వాదించేలా నిల్వ పచ్చడి, పిల్లలకు ఎంతో ఇష్టమైన స్వీట్‌ క్యాండీలు తయారుచేస్తుంటాం. ఇవికాక ఉసిరికాయలతో సులువుగా చేసే విభిన్న వంటకాలు మీకోసం...

నోరూరించే ఉసిరి రుచులు

ఆమ్ల పెస్టో పాస్తా

కావాల్సిన పదార్థాలు

ఉసిరి కాయలు- మూడు, పాస్తా- రెండు కప్పులు, కొత్తిమీర తరుగు- అర కప్పు, వేయించిన బాదం, జీడిపప్పులు- పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, ఆలివ్‌ ఆయిల్‌- నాలుగు చెంచాలు, చీజ్‌ తురుము- రెండు చెంచాలు, ఉప్పు- చెంచా, మిరియాల పొడి- చెంచా, ఆలివ్‌ ఆయిల్‌- రెండు చెంచాలు

తయారీ విధానం

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి సగానికి పైగా నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. తరువాత పాస్తా వేసి పది నిముషాలు ఉడికించి దించాలి. నీటిని వడగట్టి ఉడికిన పాస్తాని పళ్లెంలో విడివిడిగా పరచాలి. మిక్సీలో ఉసిరికాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, బాదం-జీడిపప్పులు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, మిరియాల పొడి, చీజ్‌ తురుము, చెంచా ఆలివ్‌ ఆయిల్‌ వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి చెంచా ఆలివ్‌ ఆయిల్‌ వేసి అది వేడయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసి రెండు నిముషాలు చిన్న మంటమీద దోరగా వేయించాలి. ఆపైన మిక్సీలో ఉన్న పేస్టు వేసి రెండు చెంచాల నీటిని చిలకరించి నెమ్మదిగా కలిపి దించాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి సర్వ్‌ చేయాలి.


ఆమ్ల సల్సా

కావాల్సిన పదార్థాలు

ఉసిరికాయలు- తొమ్మిది, క్యాప్సికమ్‌- రెండు, పచ్చిమిర్చి- రెండు, చక్కెర- రెండు చెంచాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, టమాటా ముక్కలు- అర కప్పు, క్యారెట్‌ తురుం- పావు కప్పు, దానిమ్మ గింజలు- పావు కప్పు, అల్లం తరుగు- చెంచా, కారం- అర చెంచా, ఉప్పు- తగినంత, గరం మసాల లేదా చాట్‌ మసాల పొడి- చెంచా, రెడ్‌ చిల్లీ సాస్‌- చెంచా, ఆలివ్‌ ఆయిల్‌- చెంచా, నిమ్మరసం- రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు- పావు కప్పు, పుదీనా తరుగు- పావు కప్పు

తయారీ విధానం

స్టవ్‌ మీద గ్రిల్‌ పెట్టి దానిపై ఉసిరికాయలు, క్యాప్సికమ్‌, పచ్చి మిర్చి ఉంచి వాటిని అన్నివైపులా ఎర్రగా కాల్చి పళ్లెంలోకి తీయాలి. ఉసిరికాయలపై నల్లగా మారిన తొక్కను చాకుతో గీకాలి. ఆపైన చిన్న ముక్కలుగా కోయాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి అందులో ఉసిరికాయ ముక్కలు, చక్కెర వేసి కొన్ని నీళ్లు చిలకరించి రెండు నిముషాలు మగ్గించాలి. ఉసిరికాయ ముక్కలు పొడిగా మారిన తరువాత స్టవ్‌ మీద నుంచి దించి చల్లార్చి వెడల్పాటి గిన్నెలోకి తీయాలి. అందులో క్యాప్సికమ్‌ ముక్కలు, పచ్చిమిర్చి తరుగుతో పాటు పైన సూచించిన పదార్థాలన్నింటి వేసి చెంచాతో నెమ్మదిగా కలపాలి. అంతే ఆమ్లా సల్సా రెడీ! ఇది సాయంకాలపు స్నాక్‌లా తినడానికి బాగుంటుంది.


ఆమ్ల క్రంబుల్‌

కావాల్సిన పదార్థాలు

ఉసిరికాయ ముక్కలు- రెండు కప్పులు, బెల్లం పొడి- ముప్పావు కప్పు, కార్న్‌ఫ్లోర్‌- చెంచా, యాలకుల పొడి- అర చెంచా, దాల్చినచెక్క పొడి- చిటికెడు, గోధుమ పిండి- కప్పు, ఓట్స్‌- అర కప్పు, వెన్న- అర కప్పు, బ్రౌన్‌ షుగర్‌- అరకప్పు, ఉప్పు- చిటికెడు

తయారీ విధానం

స్టవ్‌ మీద గిన్నె పెట్టి అందులో ఉసిరికాయ ముక్కలు, బెల్లం పొడి వేసి కొన్ని నీళ్లు చిలకరించి చిన్న మంట మీద ఉడికించాలి. పది నిముషాల తరువాత యాలకుల పొడి వేసి కార్న్‌ఫ్లోర్‌ కలిపిన నీళ్లు పోసి మిశ్రమం చిక్కగా మారిన తరువాత స్టవ్‌ మీద నుంచి దించాలి. వెడల్పాటి గిన్నెలో గోధుమపిండి, ఓట్స్‌, బ్రౌన్‌షుగర్‌, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత వెన్న కూడా వేసి పిండిని పొడిలా కలపాలి. బేకింగ్‌ ట్రేలో ఉసిరికాయల మిశ్రమాన్ని పరిచి దానిమీద పిండి మిశ్రమాన్ని చల్లి సమంగా సర్దాలి. 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద పది నిముషాలు ప్రీ హీట్‌ చేసిన ఓవెన్లో ఈ బేకింగ్‌ ట్రేను పెట్టి అరగంటసేపు బేక్‌ చేయాలి. తరువాత బయటికి తీసి వెనీలా ఐస్‌క్రీమ్‌ లేదా కస్టర్డ్‌తో సర్వ్‌ చేయాలి.


ఆమ్లచికెన్‌

కావాల్సిన పదార్థాలు

ఉసిరి కాయలు- పావు కేజీ, చికెన్‌- కేజీ, నెయ్యి- చెంచా, నూనె- మూడు చెంచాలు, పచ్చి మిరపకాయలు- అయిదు, కరివేపాకు- నాలుగు రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు- చెంచా, పసుపు- అర చెంచా, కారం- రెండు చెంచాలు, ధనియాల పొడి- చెంచా, జీలకర్ర పొడి- చెంచా, చికెన్‌ మసాల పొడి- చెంచా, ఉప్పు- తగినంత, టమాటా ముక్కలు- అర కప్పు, గరం మసాల పొడి- చెంచా, కసూరి మేతి- చెంచా, కొత్తిమీర తరుగు- తగినంత

తయారీ విధానం

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి నెయ్యి, నూనె వేసి ఆపైన పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఆపై అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. అవి వేగిన తరువాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్‌ మసాల పొడి వేసి కలపాలి. రెండు నిమిషాలతరువాత టమాటా ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక ఓ గ్లాసు వేడినీటిని పోసి చిన్న మంట మీద మగ్గించాలి. అయిదు నిమిషాల తరువాత ఉసిరికాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. ఆపైన చికెన్‌ ముక్కలు వేసి కలిపి పావుగంటసేపు మగ్గించాలి. తరువాత గరంమసాల పొడి, కసూరి మేతి వేసి కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ మీద నుంచి దించాలి. చపాతీ, రోటీ లేదా వేడివేడి అన్నంతో ఈ ఆమ్ల చికెన్‌ కర్రీని సర్వ్‌ చేయవచ్చు.

Updated Date - Nov 28 , 2026 | 12:14 AM