Share News

ఆరోగ్య సిరి ఉసిరి

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:09 AM

ఉసిరిని కాయనుకుంటే కాయ, పండనుకుంటే పండు, కూరగాయనుకుంటే కూరగాయ. ‘భోజన కుతూహలం’ గ్రంథం ఉసిరికాయను కరక్కాయతో సమాన గుణాలు కలిగిన ద్రవ్యంగా పేర్కొంది. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ...

ఆరోగ్య సిరి ఉసిరి

ఉసిరిని కాయనుకుంటే కాయ, పండనుకుంటే పండు, కూరగాయనుకుంటే కూరగాయ. ‘భోజన కుతూహలం’ గ్రంథం ఉసిరికాయను కరక్కాయతో సమాన గుణాలు కలిగిన ద్రవ్యంగా పేర్కొంది. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ... ఈ మూడింటిని త్రిఫలాలంటారు. నూటికి తొంబై ఆయుర్వేద ఔషధాలలో త్రిఫలా చూర్ణం కలుస్తుంది. అంటే అన్ని దోషాలపైనా ఔషధంగా పని చేసే శక్తి ఈ మూడు కాయలకూ ఉంది. ఈ మూడింటిలో ఉసిరికాయ ఆహార యోగ్యమైంది.

ఉసిరికాయ శరీరంలోని రస రక్తాది ధాతువుల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. కనుకనే ఉసిరిని రసాయనం అన్నారు. తినేటప్పుడు వగరుగా, పుల్లగా ఉన్నా... తిన్న తరువాత తియ్యగా మారుతుంది. రక్తానికి సంబంధించి రక్తస్రావం లాంటి వ్యాధులపైనా, వేడివలన కలిగే అరికాళ్లు అరిచేతుల్లో మంటల మీద బాగా పని చేస్తుంది. రక్త హీనతను నివారిస్తుంది. గొంతులో ఏర్పడే వ్యాధులపైన కూడా పని చేస్తుంది. చర్మానికి మంచి వర్ణాన్ని ఇస్తుంది. మలబద్ధకాన్ని పోగొట్టి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. వాంతి, వికారం, నీరసం, నిస్సత్తువల్ని పోగొడుతుంది.


  • 100 గ్రాముల ఉసిరి పొడికి 100 మిల్లీ లీటర్ల నువ్వుల నూనె కలిపి భద్రపరచుకోవాలి. దీన్ని రోజూ సాయంత్రం పూట ఒకటి రెండు చెంచాల చొప్పున వేడి నీటితో తీసుకుంటే, వాత వ్యాధులు అన్నింటిలోనూ ఉపయోగకరంగా ఉంటుంది.

  • పేగుల్లో కలిగే ఇబ్బందులకు ఉసిరికాయల గుజ్జు లేదా పొడిని నెయ్యితో కలిపి రెండు చెంచాల మోతాదులో తీసుకుంటే బాగా పని చేస్తుంది. బక్కచిక్కిపోయేవారు, ఆర్చుకుపోతున్న పిల్లలకు ఈ ఫార్ములా బాగా పని చేస్తుంది. కావాలంటే బెల్లం పొడిని కూడా కలిపి ఇస్తే పిల్లలు త్వరగా పెరుగుతారు.

  • ఊబకాయం, శ్వాస సంబంధ సమస్యల్లో, ఎలర్జీ వ్యాధుల్లో ఉసిరి పొడిని తేనెతో కలిపి తీసుకోవచ్చు.

  • క్యారెట్‌, కీరా, ముల్లంగిని సగం సగంగా తీసుకుని, గింజ తీసేసిన ఒక ఉసిరికాయ కూడా కలిపి, మిక్సీ పట్టి, జ్యూసు తీసుకోవాలి. దీన్ని రోజూ తాగుతుంటే థైరాయిడ్‌ సమస్యలు త్వరగా తగ్గుతాయి. తక్షణ శక్తినిస్తుంది. పేగులను శక్తిమంతం చేస్తుంది.

  • ఇప్పుడు మార్కెట్లోకి 365 రోజులూ ఉసిరికాయలు వస్తున్నాయి. కొట్టిన పసుపు ఒక చెంచాడు, ఒక ఉసిరికాయ గుజ్జు కలిపి రోజూ ఉదయాన్నే తినేవాళ్లకు షుగరు వ్యాధి దరికి రాకుండా ఆపుతుంది. నిశా అంటే పసుపు, ఆమలకి అంటే ఉసిరికాయ... రెండింటినీ కలిపి నిశామలకీ చూర్ణం అంటారు. ఈ పేరుతో ఆయుర్వేద షాపుల్లో టాబ్లెట్లు కూడా దొరుకుతున్నాయి.

  • ఉసిరి కాయల రసం, గుంటకలగరాకు రసం నీళ్లలో వేసి బాగా మరిగించిన కషాయానికి సమానంగా నువ్వుల నూనె తీసుకోవాలి. నూనె మాత్రం మిగిలేలా కాచినదాన్ని ‘భృంగామలక తైలం’ అంటారు. ఈ తైలాన్ని తలకు రాసుకుంటే, జుట్టు నల్లబడటానికి, గుబురుగా పెరగటానికి తోడ్పడుతుంది.

  • వాత వ్యాధుల్లో దీని ఉపయోగం ఎక్కువ. వేడిని తగ్గించి చలవనిస్తుంది. కఫాన్ని నివారిస్తుంది. ఆహార యోగ్యమైన ఫలం కాబట్టి ఫలాలలోనూ, కూరగాయల్లోనూ ఉసిరికాయను ఉత్తమ ఫలంగా భావిస్తారు. తాజా ఉసిరికాయలు నేరుగా తినవచ్చు. ముక్కలుగా చేసి సలాడ్‌లో, పచ్చడిలో, ఊరగాయలో వాడుకోవచ్చు. లేదంటే ఉసిరి పొడి వాడుకోవచ్చు. చ్యవనప్రాశ అనే ప్రసిద్ధ ఆయుర్వేద ఔషధంలో ఉసిరి ప్రధానమైన ద్రవ్యం.

గంగరాజు అరుణాదేవి

Updated Date - Oct 10 , 2026 | 12:09 AM