కేన్స్ క్వీన్
ABN , Publish Date - May 24 , 2026 | 03:08 AM
ఐశ్వర్యారాయ్ బచ్చన్... ‘క్వీన్ ఆఫ్ కేన్స్’గా ప్రపంచ సినీ ప్రియులనే కాదు...సెలబ్రిటీలను కూడా ఆకర్షిస్తున్నారు ఈ భారతీయ నటి. రిసార్ట్ నగరంగా పిలిచే ...
ఐశ్వర్యారాయ్ బచ్చన్... ‘క్వీన్ ఆఫ్ కేన్స్’గా ప్రపంచ సినీ ప్రియులనే కాదు...సెలబ్రిటీలను కూడా ఆకర్షిస్తున్నారు ఈ భారతీయ నటి. రిసార్ట్ నగరంగా పిలిచే ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ఏటా అట్టహాసంగా జరిగే ఈ మెగా ఈవెంట్‌తో ఐశ్యర్యది రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం. పేరుకు చిత్రోత్సవమే అయినా... అక్కడి ఎర్ర తివాచీ అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ డిజైనర్ల పనితనానికి ఒక వేదిక. కోట్ల మంది అభిమానధనాన్ని సంపాదించుకున్న తారల తళుకులకు యవనిక. అంతటి ప్రత్యేకతలున్న ఉత్సవంలో ఐశ్వర్య తనదైన వారసత్వాన్ని కొనసాగిస్తూ... భారతీయ సంస్కృతికి ప్రతిబింబంలా మారారు.
‘దేవదాస్’ చిత్రం ప్రీమియర్ కోసం 2002లో కేన్స్ చిత్రోత్సవంలో అరంగేట్రం చేశారు ఐశ్వర్యారాయ్. డిజైనర్ నీతా లుల్లా రూపొందించిన ఐకానిక్ పసుపు రంగు సంప్రదాయ చీరను ధరించిన ఆమె హీరో షారూఖ్ ఖాన్, దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీతో కలిసి అలరించారు. ఆ ప్రదర్శన ఈ అంతర్జాతీయ ఉత్సవంలో భారతీయుల ప్రాధాన్యం పెరగడానికి ఒక ప్రధాన మలుపు అయింది. ఆ మరుసటి ఏడాదే కేన్స్ జ్యూరీలో ఆమెకు చోటు దక్కింది. ఈ అవకాశం అందుకున్న తొలి భారతీయ నటిగా గుర్తింపు పొందిన ఐశ్వర్య... నాటి నుంచి క్రమం తప్పకుండా కేన్స్ చిత్రోత్సవానికి హాజరవుతూనే ఉన్నారు.
గత ఏడాది మన సంప్రదాయం ఉట్టిపడేలా చీర కట్టు, నుదుటిన సిందూరంతో మెరిసిన ఈ మాజీ విశ్వసుందరి... అతిథులను విశేషంగా ఆక్టుకున్నారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు అలా మద్దతు తెలిపి ప్రశంసలు అందుకున్నారు.
అయితే ఎప్పుడూ ఉత్సవం ఆరంభంలోనే మెరిసే ఈ తార... ప్రస్తుత వేడుకల్లో ఆఖరివరకు కనిపించకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలు వెల్లువెత్తాయి. ఈసారి ఆమె స్థానాన్ని మరో బాలీవుడ్ భామ అలియా భట్ భర్తీ చేశారంటూ ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలు అన్నిటికీ తెర దించుతూ, తన కూతురు ఆరాధ్యతో కలిసి కేన్స్ వెళ్లిన ఐశ్వర్య... ఉత్సవం ముగింపు రోజున ఎప్పటిలానే రెడ్ కార్పెట్‌పై విభిన్న వస్త్రధారణలో ప్రత్యక్షమయ్యారు. అభిమానులను మురిపించారు.

గ్లోబల్ ఐకాన్...
‘లోరియల్ పారి్‌స’కు ప్రచారకర్తగా రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య పోజులు... రానురాను ఈ ఉత్సవంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఒక ప్రధానాంశంగా మారిపోయింది. వినూత్నమైన సిల్హౌట్‌లు, ఆకట్టుకొనే బాల్‌గౌన్లు, సంప్రదాయ వస్త్రధారణలతో కేన్స్‌కు వెళ్లిన ప్రతిసారీ హైఫ్యాషన్ లుక్స్‌తో ఆమె విస్తృత ప్రయోగాలు చేశారు. అవే ఆమెను గ్లోబల్ ఫ్యాషన్ ప్రతినిధిగా, బ్యూటీ ఐకాన్‌గా నిలబెట్టాయి. ఇటీవల కాలంలో ట్రెండ్‌ను కాస్త మార్చిన ఐశ్వర్య... తన కుమార్తె ఆరాధ్యతో కలిసి కేన్స్‌లో దర్శనమిస్తున్నారు. ఇది అంతర్జాతీయ మీడియాను విశేషంగా ఆకట్టుకొంది.
భారతీయతకు ప్రతినిధిలా...
ఈ చిత్రోత్సవంతో ఐశ్వర్యది విడదీయరాని అనుబంధం. ‘కేన్స్ క్వీన్’గా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న ఆమె... ఫ్రెంచ్ రెవెరా రెడ్ కార్పెట్‌ను భారతీయ గ్లామర్‌కు ఒక ప్రపంచ వేదికగా మార్చేశారు. తనదైన శైలిలో ‘నమస్తే’ అంటూ పలుకరింపు నుంచి ప్రసిద్ధ చేనేతలైన బనారస్ చీరల వరకు... భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శిస్తున్నారు. సంప్రదాయ వస్త్ర శైలిని ప్రపంచ ఫ్యాషన్‌తో అనుసంధానిస్తున్నారు. ఏటా హాలీవుడ్ స్థాయిలో గ్లోబల్ స్టార్లు దిగివస్తున్నా, కొత్త తారలు హంగులు అద్దుతున్నా... ఆమెకున్న ఆదరాభిమానాలు ఇసుమంతైనా తగ్గలేదు. ఏదిఏమైనా ‘ఐశ్వర్య లేకుండా ఈ ఉత్సవం అసంపూర్ణం’ అనేంతగా ఇరవై నాలుగేళ్లుగా కేన్స్‌లో ఆమె తిరుగులేని ప్రస్థానం కొనసాగుతోంది.
1500 గంటలు...
ఈసారి కూడా ఐశ్వర్య ధరించిన డ్రెస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన కౌచర్ దుస్తులైన ‘లుమినారా’లో ఆమె వయ్యారాలు చిందించారు. అది గౌనులా కాకుండా ఒక ప్రకృతి శక్తిలా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న కాంతిని తనలో ఇముడ్చుకున్నట్టుగా, గాఢమైన నీలి రంగులో, మెరుస్తూ కనువిందు చేస్తుంది. దీనికి భుజాలపై రెక్కల్లాంటి కొనసాగింపు... ఐశ్వర్యను ఒక సజీవ శిల్పంలా ఆవిష్కరించాయి. చేతితో చేసిన క్రిస్టల్ మెయిన్ ఎంబ్రయిడరీ ఈ డ్రెస్ మరో ప్రత్యేకత. కెమెరా ఫ్లాష్ లైట్లు పడినప్పుడు ఈ గౌన్‌పై లిక్విడ్ కదులుతున్నట్టుగా అనిపించేలా ఆప్టికల్ ఇల్యూషన్ సృష్టించారు. ఈ గౌన్‌ను రూపొందించడానికి కళాకారులు 1500 గంటలకు పైగా శ్రమించారు. ‘‘కేన్స్‌లో ఐశ్వర్యకున్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని మోహిత్, నేను ‘లుమినారా’ డిజైన్ చేశాం. దీన్ని ఒక డ్రెస్‌లా కాకుండా... ఆమె చుట్టూ ఒక శక్తి క్షేత్రం ఉందనిపించేలా సృష్టించాలని అనుకున్నాం. ప్రపంచ వేదికపై దశాబ్దాలుగా ఐశ్వర్య అసాధారణ ప్రస్థానాన్ని గౌరవిస్తూ... ‘కాంతి’ అనే భావనతో ఆమె తేజస్సును ఇనుమడించే ప్రయత్నం చేశాం’’ అంటూ చెప్పుకొచ్చారు అమిత్ అగర్వాల్.