హెల్దీ లెమనేడ్స్...
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:04 AM
వేసవిలో దాహార్తిని తీర్చుకొనేందుకు తరచూ నిమ్మకాయ నీళ్లను తాగుతూ ఉంటాం.ఈ పానీయాన్ని మరింత ఆరోగ్యకరంగా మారుస్తూ విభిన్నంగా తయారు చేసే హెల్దీ లెమనేడ్స్ మీ కోసం.....
వేసవిలో దాహార్తిని తీర్చుకొనేందుకు తరచూ నిమ్మకాయ నీళ్లను తాగుతూ ఉంటాం.ఈ పానీయాన్ని మరింత ఆరోగ్యకరంగా మారుస్తూ విభిన్నంగా తయారు చేసే హెల్దీ లెమనేడ్స్ మీ కోసం.

మింట్ లెమనేడ్
ఒక గ్లాసు చల్లటి నీటిలో నాలుగు చెంచాల నిమ్మరసం, చెంచా తేనెతోపాటు అయిదారు పుదీనా ఆకులను సన్నగా తరిగి వేసి బాగా కలపాలి. ఈ పానీయాన్ని గాజు గ్లాసులో పోసి రెండు ఐస్‌క్యూబ్స్ వేస్తే మింట్ లెమనేడ్ తాగడానికి రెడీ!

జింజర్ లెమనేడ్
ఒక గ్లాసు నీటిలో మూడు చెంచాల నిమ్మరసం, చెంచా అల్లం తురుం, చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ పానీయాన్ని గాజు గ్లాసులోకి వడబోసి అందులో రెండు ఐస్ క్యూబ్స్ వేస్తే నోరూరించే జింజర్ లెమనేడ్ రెడీ!

క్లాసిక్ హనీ లెమనేడ్
ఒక గ్లాసు చల్లటి నీటిలో మూడు చెంచాల నిమ్మరసం, చెంచా తేనె, చిటికెడు ఉప్పు వేసి కలిపేస్తే హనీ లెమనేడ్ రెడీ!

గ్రీన్ టీ లెమనేడ్
స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి రెండు కప్పుల నీళ్లు పోసి బాగా వేడిచేయాలి. తరువాత స్టవ్ మీద నుంచి దించి అందులో గ్రీన్ టీ బ్యాగ్‌ను ఉంచాలి. పది నిమిషాల తరువాత గ్రీన్ టీ తయారవుతుంది. దీన్ని పావుగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఈ చల్లటి గ్రీన్ టీని అందమైన పింగాణీ కప్పులో పోసి రెండు చెంచాల నిమ్మరసం, చెంచా తేనె కూడా వేసి బాగా కలపాలి. ఆపైన నిమ్మ చక్రాలతో గార్నిష్ చేస్తే గ్రీన్ టీ లెమనేడ్ రెడీ!

చియా లెమనేడ్
పావు గ్లాసు నీటిలో రెండు చెంచాల చియా సీడ్స్ వేసి పావు గంటసేపు నానబెట్టాలి. ఒక గ్లాసు చల్లటి నీటిలో నాలుగు చెంచాల నిమ్మరసం, నానబెట్టిన చియా సీడ్స్, రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. అయిదు నిమిషాల తరువాత నిమ్మ చక్రాలతో గార్నిష్ చేసిన గాజు గ్లాసులో పోసి రెండు ఐస్ క్యూబ్స్ వేసి చియా లెమనేడ్‌ను సర్వ్ చేయాలి. ఇలాగే సబ్జా గింజలతో కూడా లెమనేడ్‌ను తయారుచేసుకోవచ్చు.

బ్రెజిలియన్ లెమనేడ్
రెండు చిన్న నిమ్మకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ఒక్కోదాన్ని నాలుగు ముక్కలుగా కోయాలి. బ్లెండర్‌లో నిమ్మకాయ ముక్కలు, రెండు గ్లాసుల నీళ్లు, అర కప్పు పంచదార, మూడు చెంచాల కండెన్స్‌డ్ మిల్క్, నాలుగు ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని స్టయినర్ సహాయంతో మరో గిన్నెలోకి వడబోయాలి. ఇలా తయారుచేసిన బ్రెజిలియన్ లెమనేడ్‌ను గాజు గ్లాసుల్లో పోసి రెండు ఐస్ క్యూబ్స్ వేసి నిమ్మ చెక్కతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి.

కుకుంబర్ లెమనేడ్
ఒక కీరాను తీసుకుని తొక్క తీసి సన్నని చక్రాల్లా తరగాలి. వీటిని బ్లెండర్‌లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఒక గ్లాసు నీటిలో పావు గ్లాసు కీరా జ్యూస్, నాలుగు చెంచాల నిమ్మరసం, రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. తరువాత అందులో రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ వేసి చల్లచల్లగా సర్వ్ చేయాలి.

మసాలా లెమనేడ్
ఒక గ్లాసులో అయిదు చెంచాల నిమ్మరసం, అర చెంచా జీలకర్ర పొడి, అర చెంచా నల్ల ఉప్పు, పావు చెంచా చాట్ మసాలా, రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. తరువాత అందులో ఒక గ్లాసు చల్లటి నీరు పోసి రెండు పుదీనా ఆకులు, రెండు ఐస్ క్యూబ్స్ వేస్తే మసాలా లెమనేడ్ రెడీ!