కమలాలతో కొత్తగా..!
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:16 AM
తీపి, పులుపు కలగలిసిన రుచితో నోరూరించే కమలాలను ఇష్టపడని వారుండరు. అలాంటి కమలాలతో జామ్, షర్బత్, క్యాండీ, కేక్‌లాంటి ఎన్నో రకాలు తయారుచేస్తుంటాం. ఇవికాక ఇంట్లోనే సులువుగా చేసుకోగలిగే విభిన్న రుచులు మీ కోసం...
తీపి, పులుపు కలగలిసిన రుచితో నోరూరించే కమలాలను ఇష్టపడని వారుండరు. అలాంటి కమలాలతో జామ్, షర్బత్, క్యాండీ, కేక్‌లాంటి ఎన్నో రకాలు తయారుచేస్తుంటాం. ఇవికాక ఇంట్లోనే సులువుగా చేసుకోగలిగే విభిన్న రుచులు మీ కోసం...
ఆరెంజ్ పాసెట్
కావాల్సిన పదార్థాలు
ఆరెంజ్ జ్యూస్- అర కప్పు, ఫ్రెష్ క్రీమ్- కప్పు, చక్కెర- అర కప్పు, ఆరెంజ్ జెస్ట్(నారింజ తొక్క తురుం)- చెంచా, నిమ్మరసం- చెంచా, వెనీలా ఎసెన్స్- చెంచా, పుదీనా ఆకులు- కొన్ని
తయారీ విధానం
కమలాల నుంచి జ్యూస్ తీసిన తరువాత కప్పులను పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో ఫ్రెష్ క్రీమ్, చక్కెర వేసి బాగా కలపాలి. తరువాత వెనీలా ఎసెన్స్, అరెంజ్ జెస్ట్ వేసి కలపాలి. ఆపైన గిన్నెను స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. తరువాత ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమం బాగా ఉడికి దగ్గరకు వచ్చాక స్టవ్ మీద నుంచి దించి చల్లార్చాలి. దీన్ని కమలాల కప్పుల్లో పోసి కనీసం ఆరు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. మిశ్రమం గట్టిపడిన తరువాత బయటికి తీసి పైన పుదీనా ఆకులు ఉంచి సర్వ్ చేయాలి.
ఆరెంజ్ మింట్ జ్యూస్
కావాల్సిన పదార్థాలు
ఆరెంజ్ జ్యూస్- కప్పు, పుదీనా ఆకులు- పది, నిమ్మరసం- చెంచా, చక్కెర లేదా తేనె- తగినంత, మంచినీళ్లు- పావు కప్పు, ఉప్పు- చిటికెడు, ఐస్ క్యూబ్స్- కొన్ని
తయారీ విధానం
బ్లెండర్‌లో పుదీనా ఆకులు వేసి మంచినీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసం, చక్కెర లేదా తేనె, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు గ్లాసులో పోసి ఐస్ క్యూబ్స్ వేసి పుదీనా ఆకులు, ఆరెంజ్ తొక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
ఆరెంజ్ వాల్‌నట్ సలాడ్
కావాల్సిన పదార్థాలు
ఆలివ్ ఆయిల్- రెండు చెంచాలు, నిమ్మరసం- రెండు చెంచాలు, ఉప్పు- పావు చెంచా, మిరియాల పొడి- పావు చెంచా, పాలకూర ఆకులు- నాలుగు, పుదీనా తరుగు- కొద్దిగా, కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఆరెంజ్ ముక్కలు- కప్పు, వాల్‌నట్స్- పావు కప్పు, యాపిల్ ముక్కలు- పావు కప్పు, చీజ్ తురుం- కొద్దిగా
తయారీ విధానం
పెద్ద గిన్నెలో ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. తరువాత సన్నగా తరిగిన పాలకూర, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, ఆరెంజ్ ముక్కలు, వాల్ నట్స్, యాపిల్ ముక్కలు వేసి చెంచాతో జాగ్రత్తగా కలపాలి. ఆపైన చీజ్ తురుం వేసి సర్వ్ చేయాలి.
ఆరెంజ్ పులావ్
కావాల్సిన పదార్థాలు
ఆరెంజ్ జ్యూస్- కప్పు, బాస్మతి బియ్యం- కప్పు, నెయ్యి- రెండు చెంచాలు, దాల్చిన చెక్క- చిన్న ముక్క, లవంగాలు- మూడు, బిర్యానీ ఆకు- ఒకటి, అనాసపువ్వు- ఒకటి, జీడిపప్పు పలుకులు- కొన్ని, పచ్చిమిర్చి- రెండు, ఆరెంజ్ జెస్ట్- అర చెంచా, కుంకుమ పువ్వు- కొద్దిగా, చక్కెర- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత
తయారీ విధానం
కుక్కర్లో నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు వేయించి పెట్టుకోవాలి. అందులోనే మసాలా దినుసులన్నీ వేసి దోరగా వేయించాలి. తరువాత పచ్చి మిర్చి ముక్కలు, ఆరెంజ్ జెస్ట్ వేసి కలపాలి. నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి కలుపుతూ రెండు నిముషాలు వేయించాలి. ఆపైన ఆరెంజ్ జ్యూస్, కప్పు మంచి నీళ్లు పోయాలి. కుంకుమపువ్వు నానబెట్టిన పాలు, చక్కెర, ఉప్పు వేసి కలపాలి. కుక్కర్‌కు మూతపెట్టి రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ మీద నుంచి దించాలి. కుక్కర్ చల్లారాక మూత తీసి కింది నుంచి పైకి ఒకసారి కలిపి పైన వేయించిన జీడిపప్పు పలుకులు చల్లి సర్వ్ చేయాలి.
ఆరెంజ్ చికెన్
కావాల్సిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్ ముక్కలు- పావు కేజీ, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- చెంచా, కార్న్‌ఫ్లోర్- పావు కప్పు, మైదా- రెండు చెంచాలు, గుడ్డు- ఒకటి, ఆరెంజ్ జెస్ట్- చెంచా, ఆరెంజ్ జ్యూస్- అర కప్పు, నూనె- డీప్ ఫ్రైకి తగినంత, నువ్వుల నూనె- చెంచా, వెల్లుల్లి తురుం- చెంచా, అల్లం తురుం- చెంచా, ఉల్లికాడల ముక్కలు- అర కప్పు, సోయాసాస్- రెండు చెంచాలు, వెనిగర్- చెంచా, చక్కెర- చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా
తయారీ విధానం
ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, కొద్దిగా మిరియాల పొడి, కార్న్‌ఫ్లోర్, మైదా, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆపైన కోడి గుడ్డు సొనలు వేసి చేత్తో కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంటసేపు నాననివ్వాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. తరువాత చికెన్ ముక్కలను ఒక్కోటి వేస్తూ దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. స్టవ్ మీద మరో వెడల్పాటి గిన్నె పెట్టి నువ్వుల నూనె, వెల్లుల్లి తురుం, అల్లం తురుం, ఉల్లికాడల ముక్కలు వేసి కలిపి దోరగా వేయించాలి. తరువాత సోయాసాస్, వెనిగర్, అరెంజ్ జ్యూస్ వేసి కలపాలి. పావు కప్పు నీళ్లు, మిరియాల పొడి, చక్కెర వేసి కొన్ని కార్న్‌ఫ్లోర్ నీళ్లు పోసి ఉడికించాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరకు వచ్చిన తరువాత వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి జాగ్రత్తగా కలపాలి. తరువాత ఆరెంజ్ జెస్ట్, కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ మీద నుంచి దించాలి. దీన్ని ఫ్రైడ్ రైస్ లేదా బిర్యానీతో సైడ్ డిష్‌గా సర్వ్ చేయవచ్చు.