విజయ్ విత్ కామన్‌మ్యాన్...!
ABN , Publish Date - May 05 , 2026 | 05:38 AM
టీవీకేలో విజయ్ తప్ప, జనాదరణ ఉన్న నాయకులే లేరు. అన్నాడీఎంకే చీలిక సమయంలో జయకు కుడిభుజంగా వ్యవహరించిన కేఏ..
చెన్నై, మే 4 (ఆంధ్రజ్యోతి): టీవీకేలో విజయ్ తప్ప, జనాదరణ ఉన్న నాయకులే లేరు. అన్నాడీఎంకే చీలిక సమయంలో జయకు కుడిభుజంగా వ్యవహరించిన కేఏ సెంగోట్టయ్యన్, గతంలో స్టాలిన్‌కు సన్నిహితంగా మెలగిన విల్లివాక్కం అభ్యర్థి ఆదవ్ అర్జున తప్ప టీవీకేలోని నేతలెవరూ ప్రజలకు తెలియదు. డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్‌లలో నిరాదరణకు గురైన నాయకులను విజయ్ చేరదీశారు. వారినే గెలుపు గుర్రాలుగా మలచుకున్నారు. కొందరు వీరాభిమానులకూ టికెట్లు ఇచ్చారు. ఇందులో ఆటోడ్రైవర్లు, సాధారణ ఉద్యోగులూ ఉన్నారు. విజయ్ దాము అనే ఆటో డ్రైవర్ టీవీకే తరఫున రాయపురంలో పోటీచేసి గెలవడం విశేషం. మొత్తం 234 మంది అభ్యర్థులను విజయ్ ఒకేసారి ప్రకటించి, వారిని పరిచయం చేశారు. వారితో తాను దిగిన ఫొటోను ఇచ్చి ప్రజల్లోకి పంపించారు. కొంతమంది అభ్యర్థులైతే విజయ్ విగ్రహాలను, ఫొటోలను తమ ప్రచార వాహనంపై పెట్టుకుని జనంలోకి వెళ్లి గెలిచారు.