డబ్బులు కాదు.. విజిల్స్ పంచి గెలిచారు!
ABN , Publish Date - May 05 , 2026 | 04:20 AM
ఓటర్లు అమ్ముడుపోతారా? ఓట్లు కొనుక్కోవచ్చా? డబ్బులు పంచితే తప్ప ఎన్నికల్లో గెలవలేరా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పటిదాకా ..
చెన్నై, మే 4 (ఆంధ్రజ్యోతి): ఓటర్లు అమ్ముడుపోతారా? ఓట్లు కొనుక్కోవచ్చా? డబ్బులు పంచితే తప్ప ఎన్నికల్లో గెలవలేరా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పటిదాకా ఉన్న సమాధానాలను విజయ్ తిరగరాశారు! పార్టీ ఫండు, ఓటుకు నోటు ప్రస్తావనే లేకుండా తమిళ ఎన్నికల్లో అధికార పీఠానికి చేరువయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే అభ్యర్థులు పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేశారు. ఓటుకు వెయ్యి నుంచి రెండువేల రూపాయల దాకా చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. విజయ్ పార్టీ అభ్యర్థులు మాత్రం ఎక్కడా డబ్బు పంపిణీ జోలికి పోలేదు. తమ చిహ్నంపై ఓటేయాలంటూ ‘విజిల్’లను ఇబ్బడిముబ్బడిగా పంపిణీ చేశారు. విచ్చలవిడిగా పోస్టర్లను అతికించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని హోరెత్తించారు. ఎన్నికల ప్రచారంలో ఆర్భాటానికి పోలేదు. కొన్నిచోట్ల టీవీకే అభ్యర్థులు కేవలం ఇద్దరు ముగ్గురు సహచరులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. అలాంటి వారు కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం.