Share News

హిట్టు కొట్టారు!

ABN , Publish Date - May 05 , 2026 | 04:27 AM

ఆరంభమే అదిరింది’... అనిపించడం కొందరికే సాధ్యం! నాడు... తెలుగునాట ఎన్టీఆర్‌ ఒక ప్రభంజనం సృష్టించారు! నేడు... తమిళనాట విజయ్‌ అదేస్థాయిలో ...

హిట్టు కొట్టారు!

  • అప్పుడు ఎన్టీఆర్‌.. ఇప్పుడు విజయ్‌ అరంగేట్రంలోనే అద్భుత విజయాలు

  • ఎంజీఆర్‌ రికార్డూ చెరిపేసిన విజయ్‌

(చెన్నై - ఆంధ్రజ్యోతి)

‘ఆరంభమే అదిరింది’... అనిపించడం కొందరికే సాధ్యం! నాడు... తెలుగునాట ఎన్టీఆర్‌ ఒక ప్రభంజనం సృష్టించారు! నేడు... తమిళనాట విజయ్‌ అదేస్థాయిలో ఆ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పారు. నేటి విజయ్‌ గెలుపు... నాటి ఎన్టీఆర్‌ రాజకీయ అరంగేట్రాన్ని గుర్తుకు తెస్తోంది. తెలుగు తెరపై దశాబ్దాలపాటు తిరుగులేని కథానాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్‌ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవమే ఆయన నినాదం! అప్పటికే కాంగ్రెస్‌ రాజకీయాలతో విసుగెత్తిపోయిన తెలుగు ప్రజలకు ఎన్టీఆర్‌ ఒక తిరుగులేని ప్రత్యామ్నాయంగా కనిపించారు. 1983లో జనవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి ఏపీలోని 275 స్థానాల్లో ఏకంగా 202 చోట్ల విజయం సాధించింది. విజయ్‌ 2024లో ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ స్థాపించారు. ఆపై రెండేళ్లా 2నెలలకు ఎన్నికలు వచ్చాయి. అధికారం చేపట్టేందుకు అవసరమైన ‘మ్యాజిక్‌ ఫిగర్‌’కు కాస్త దూరంగా నిలిచినప్పటికీ విజయ్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే చెప్పవచ్చు.

ఎందరో నట... నాయకులు

ఎన్టీఆర్‌ కంటే ముందే ఎంజీఆర్‌ రాజకీయ అరంగేట్రం చేశారు. తమిళ రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. జయలలిత ఆయన బాటలోనే నడిచారు. తర్వాత టి.రాజేందర్‌, విజయకాంత్‌, శరత్‌కుమార్‌, కార్తీక్‌ పార్టీలు స్థాపించినా, అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయారు. ‘సూపర్‌ స్టార్‌’ రజనీకాంత్‌ రాజకీయాలపై ఒక అడుగు ముందుకూ, రెండడుగులు వెనక్కి అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. కమల్‌ హాసన్‌ ‘మక్కల్‌ నీది మయ్యం’ పేరుతో పార్టీ పెట్టారు. తర్వాత డీఎంకేతో చేతులు కలిపి... రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇక... మెగాస్టార్‌ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ ఏర్పాటు చేసినా దాన్ని కాంగ్రె్‌సలో విలీనం చేసి, కేంద్రమంత్రి అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ ‘జనసేన’ పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు కానీ, ఆయన పార్టీ తరఫున ఒకే ఒక్కరు గెలిచారు. 2024లో ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయ్యారు. ‘వంద శాతం’ స్ట్రైక్‌ రేట్‌తో సంచలనం సృష్టించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.

ఎంజీఆర్‌ రికార్డు అధిగమించి...

డీఎంకే నుంచి విడిపోయిన ఎంజీఆర్‌ 1972 అక్టోబరు 17న అన్నాడీఎంకేను స్థాపించారు. 1977 జూన్‌లో అధికారం చేపట్టారు. ఆయనకు అధికారమెక్కేందుకు ఐదేళ్లు పట్టింది. 2024 ఫిబ్రవరిలో పార్టీని స్థాపించిన విజయ్‌.. రెండేళ్లలోనే అధికారం కైవశం చేసుకోవడం విశేషం. ఎంజీఆర్‌ పార్టీని ప్రారంభించి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 33.52 శాతం ఓట్లు సాధించారు. ఇప్పుడు టీవీకే 36 శాతానికిపైగా ఓట్లు సాధించడం విశేషం.

Updated Date - May 05 , 2026 | 04:27 AM