ఆకాశం కూలినా సరే న్యాయం జరగాలి
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:34 AM
మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ తదితరులను నిర్దోషులుగా పేర్కొంటూ ఇచ్చిన 598 పేజీల సుదీర్ఘ తీర్పులో రౌజ్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తీర్పులో రౌజ్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కీలక వ్యాఖ్యలు
మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ తదితరులను నిర్దోషులుగా పేర్కొంటూ ఇచ్చిన 598 పేజీల సుదీర్ఘ తీర్పులో రౌజ్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ తీర్పు రాస్తున్నప్పుడు.. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన ‘అన్యాయం ఎక్కడ జరిగినా.. అది అన్నిచోట్లా న్యాయానికి ముప్పు’ అనే మాటలను.. ‘ఆకాశం కూలిపోయినా సరే న్యాయం జరగాలి’ అనే సూత్రాన్ని గుర్తు చేసుకుంటున్నాను. న్యాయవ్యవస్థ పని ఒక అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడం లేదా ఒక వర్గం చెప్పే కథనాన్ని సమర్థించడం కాదు, చట్టబద్ధమైన పాలనను కాపాడటం. ఈ ఆదర్శాలకు కట్టుబడి ఉన్నప్పుడే న్యాయవ్యవస్థపై పౌరుల నమ్మకం నిలుస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఆయన తీర్పులోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
విశ్వసనీయత లేదు
కచ్చితమైన, అత్యంత శ్రమతో కూడిన విచారణ అనంతరం, రెండు నెలలకు పైగా సమయం వెచ్చించి.. అపారమైన డాక్యుమెంటరీ సమాచారాన్ని, దాదాపు మూడు వందల మంది ప్రాసిక్యూషన్ సాక్షుల వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించిన మీదట.. ఈ కేసులో కనీస ప్రాథమిక (ప్రైమాఫేసీ) అనుమానం కూడా కనిపించడం లేదని ఈ కోర్టు నిస్సందేహంగా భావిస్తోంది. అంతేకాదు.. నేర చట్ట సూత్రాల ప్రకారం విచారణను ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన ‘తీవ్రమైన అనుమానం’ అసలే లేదని భావిస్తోంది. సీబీఐ ప్రతిపాదించిన ఈ ఎక్సైజ్ పాలసీ కేసు, న్యాయపరమైన పరిశీలనను తట్టుకోలేకపోయింది. పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయింది.
అది న్యాయవైఫల్యమే
ప్రాసిక్యూషన్ ప్రాథమిక ఆరోపణలకు వ్యతిరేకంగా ఉన్న వాంగ్మూలాలను సైతం దర్యాప్తు సంస్థ (సీబీఐ) సమర్పించడం అభినందనీయమేగానీ.. అవి ఈ కేసును బలపరచడానికి బదులుగా పూర్తిగా కుప్పకూల్చేస్తున్నాయి. ఎలాంటి సాక్ష్యాలూ లేకుండా, పూర్తిస్థాయి విచారణ ఎదుర్కోవాలని నిందితులను బలవంతం చేయడం న్యాయం అనిపించుకోదు. అలా చేయడం న్యాయవైఫల్యం, క్రిమినల్ ప్రాసె్‌సను దుర్వినియోగం చేయడం, నిష్పాక్షికత, చట్టబద్ధమైన పాలన తాలూకూ ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుంది.
ఊహలు.. కల్పనలు కుదరవు
చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన ఆధారాలు ఉంటేనే అభియోగాలు మోపాలి తప్ప.. ఊహలు లేదా దర్యాప్తు సంస్థల కల్పనలపై ఆధారపడి ఆ పని చేయకూడదని సాక్ష్యాధారాల చట్టం చెబుతోంది. ఈ గీటురాయి ఆధారంగా రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని పరీక్షిస్తే.. ప్రాసిక్యూషన్ ఈ కేసును ప్రాథమికంగా కూడా నిరూపించలేకపోయింది.
ఎలాంటి సాక్ష్యాలూ లేని అభూతకల్పన
నిశితంగా పరిశీలిస్తే ఈ కేసు ఎటువంటి ఆమోదయోగ్యమైన సాక్ష్యాధారాలూ లేని.. కేవలం ఊహాగానాలు, అనుమానాలపై ఆధారపడి నిర్మించిన ఒక అభూతకల్పన అని వెల్లడైంది. సాక్ష్యాధారాలను, పత్రాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో, వాటి నుండి చట్టబద్ధమైన ముగింపులను రాబట్టడంలో దర్యాప్తు సంస్థ ప్రాథమిక వైఫల్యం కనిపిస్తోంది. ఫలితంగా, కేసు చట్టపరంగా బలహీనమైనదిగా, నిలకడలేనిదిగా, చట్ట ప్రకారం ముందుకు కొనసాగడానికి అనర్హమైనదిగా మారింది. ప్రాసిక్యూషన్ అంత బలంగా నొక్కిచెప్పిన ఈ భారీ కుట్ర సిద్ధాంతం.. సాక్ష్యాల ఆధారంగా పరిశీలించినప్పుడు పూర్తిగా (పేకమేడలా) కుప్పకూలిపోయింది.
కుట్ర అనే భ్రమ కల్పించే యత్నం
రికార్డులను సమగ్రంగా అంచనా వేసినప్పుడు దర్యాప్తు తీరు ఎలా అనిపించిందంటే.. సంబంధం లేని విడివిడి అంశాలను కలిపి కుట్టి, చట్టబద్ధమైన ఆధారాలు లేని ఒక భారీ, సంక్లిష్టమైన కుట్ర అనే భ్రమను కల్పించే ప్రయత్నం జరిగినట్లు కనిపిస్తోంది. ఎక్సైజ్ విధానం రూపకల్పన/అమలుతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తినీ ఇందులో ఇరికించడం ద్వారా.. బలహీనమైన కథనానికి విశ్వసనీయతను, లోతును ఆపాదించేలా ముందుగానే నిర్ణయించిన మార్గంలో దర్యాప్తు సాగినట్లు కనిపిస్తోంది. ఈ ఆరోపణలను గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముడిపెట్టి, నేరపూరిత ఆదాయాన్ని మళ్లించినట్లు చూపేప్రయత్నం, చట్టబద్ధమైన ఆధారాల కంటే ఎక్కువగా ఊహలు, అంచనాలపైనే ఆధారపడింది.
పునాదులు బలహీనం
‘ముందస్తు నగదు (అప్ ఫ్రంట్ మనీ)’ చెల్లింపులు.. వాటిని తిరిగి పొందడం అనే అంశాల చుట్టూ ప్రాసిక్యూషన్ నిర్మించాలనుకున్న కుట్ర కథనం పునాది ప్రాథమికంగా బలహీనపడింది. ముందస్తు నగదు చెల్లింపు, దానిని తిరిగి రాబట్టుకోవడం అనే ఆరోపణలకు చట్టపరమైన ఆధారం లేదు. విధాన రూపకల్పనలో అవకతవకలు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేనందున ఇటువంటి ఆరోపణలు నిలబడవు. ఒకవేళ స్వతంత్రంగా పరిశీలించినా.. ఈ మొత్తం చెల్లింపుల గొలుసు ప్రధానంగా అంగడియా (వ్యాపారులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి డబ్బు పంపడానికి వాడే సంప్రదాయ కొరియర్ వ్యవస్థ; ఇది శతాబ్దాలుగా మనదేశంలో ఉంది) సంస్థల ఎంట్రీల(కాగితాల్లో రాతల)పై ఆధారపడి ఉందని ఈ కోర్టు గుర్తించింది. ఇవి చట్టప్రకారం ఆమోదయోగ్యం కాని పత్రాలు. అలాగే, ఇతర సాక్ష్యాధారాల మద్దతు లేని అప్రూవర్ల వాంగ్మూలాలపై ఇది ఆధారపడి ఉంది. ఇవి చిన్నపాటి లోపాలు కావు. ఇవి కేసు మూలాలనే దెబ్బతీస్తాయి.
చట్టప్రకారమే.. మద్యం విధానం
పైవ్రేట్ వ్యక్తులకు లేదా సోకాల్డ్ ‘సౌత్ గ్రూప్’కి అక్రమంగా, చట్టవిరుద్ధమైన ప్రయోజనాన్ని చేకూర్చడానికే ఢిల్లీ ఎక్సైజ్ విధానాన్ని మార్చారని, తారుమారు చేశారని లేదా కుట్రపూరితంగా రూపొందించారని కనీసం ప్రాథమికంగా సూచించే ఏ ఒక్క ఆధారాన్నీ ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయింది. దీనికి విరుద్ధంగా.. అప్పటి రికార్డులను పరిశీలిస్తే.. సంబంధిత వాటాదారులతో సంప్రదింపులు జరిపి, లోతైన చర్చల తర్వాత, చట్టం నిర్దేశించిన విధానానికి కట్టుబడి ఈ విధానాన్ని రూపొందించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ నుండి సూచనలు తీసుకోవాలనే చట్టబద్ధమైన లేదా రాజ్యాంగపరమైన నిబంధన ఏదీ లేనప్పటికీ, ఫైల్‌లోని నోటింగ్స్‌ను చూస్తే అటువంటి సూచనలను కోరి, వాటిని పరిశీలించి, పాలసీలో చేర్చినట్టు నిస్సందేహంగా అర్థమవుతోంది. ఇలా చర్చలు, సంస్థాగత పరిశీలన అనంతరం.. నిబంధనల ప్రకారం విధాన రూపకల్పన జరిగిందని తేలినప్పుడు, దాని అమలుకు నేరపూరిత ఉద్దేశాన్ని ఆపాదించే ఏ ప్రయత్నమైనా పూర్తిగా నిలకడలేనిది అవుతుంది.
ఆమోదయోగ్యం కాని సమాచారంతో ఆరోపణలు
భారత సాక్ష్యాధారాల చట్టంలోని సూత్రాలు కాలపరీక్షకు నిలిచిన రక్షణ కవచాలు. ఇవి ప్రాథమిక దశలో కూడా నిజాన్ని కనుగొనడానికి, ఆరోపణల విశ్వసనీయతను పరీక్షించడానికి కోర్టులకు సహాయపడతాయి. ప్రస్తుత కేసులో, ఈ సూత్రాలే మార్గదర్శక చట్రంగా పనిచేశాయి. ప్రాసిక్యూషన్ సమర్పించిన సమాచారాన్ని ఆమోదయోగ్యత, సాక్ష్యపు విలువ అనే గీటురాయిపై పరీక్షించినప్పుడు, ఆ కుట్ర సిద్ధాంతం కరిగిపోయి.. ప్రాసిక్యూషన్ ఆరోపణలు కేవలం ఆమోదయోగ్యం కాని సమాచారంపై ఆధారపడ్డాయని వెల్లడైంది.
అప్రూవర్ వాంగ్మూలం.. తిరుగులేని సత్యమా?
అప్రూవర్ ఇచ్చే వాంగ్మూలం సహజంగానే అనుమానాస్పదమైనదని, దానిని చాలా జాగ్రత్తగా స్వీకరించాలనేది నేర చట్టశాస్త్రంలో స్థిరపడిన సూత్రం. అయినప్పటికీ, ప్రస్తుత కేసులో దర్యాప్తు సంస్థ అనుసరించిన విధానం ఈ నియమానికి విరుద్ధంగా ఉంది. అప్రూవర్ వాంగ్మూలాలను తిరుగులేని సత్యాలుగా భావించి, వాటిని ఎటువంటి విమర్శనాత్మక పరిశీలన లేకుండా ప్రాసిక్యూషన్ కేసుకి వెన్నెముకగా మార్చారు.
పీఎంఎల్‌ఏతో వ్యక్తుల స్వేచ్ఛకు పదేపదే విఘాతం
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఒక నేరం జరిగిందనే అంచనాపై వ్యక్తుల స్వేచ్ఛకు విఘాతం కలుగుతున్న సందర్భాలు ఈ కోర్టు దృష్టికి పదేపదే వస్తున్నాయి. కఠినమైన బెయిల్ నిబంధనల కారణంగా.. నిందితులు విచారణకు ముందే దీర్ఘకాలం జైలులో ఉండాల్సి వస్తోంది. అసలు నేరానికి సంబంధించిన వాస్తవాలను కోర్టు పరీక్షించక ముందే అరెస్టులు, సుదీర్ఘ కస్టడీ వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా.. ఒక వ్యక్తి స్వేచ్ఛ, భవిష్యత్తులో తేలబోయే ఒక అనిశ్చిత ఫలితంపై ఆధారపడి, హరించుకుపోతోంది.
కోర్టు మౌనంగా ఉండదు
సాధారణంగా, దర్యాప్తు విచక్షణను తప్పుబట్టేలా ఉండే వ్యాఖ్యలు చేయడానికి కోర్టులు వెనుకాడతాయి. అయితే, కొన్ని సందర్భాల్లో లోపాలు ఎంత ప్రాథమికంగా ఉంటాయంటే.. అలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు మౌనంగా ఉండడం విధి నిర్వహణ నుండి తప్పుకోవడమే అవుతుంది. అధికార వినియోగం చట్టపరమైన రక్షణలను నీరుగార్చి, నేర చట్టశాస్త్ర ప్రాథమిక సూత్రాలను దెబ్బతీస్తున్నప్పుడు, కోర్టు మూగ ప్రేక్షక పాత్ర వహించలేదు.