మీతో న్యాయం కష్టమే.. నాకు నమ్మకం లేదు!
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:16 AM
మద్యం పాలసీ కేసుపై మీరు విచారణ జరిపితే నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు’ అని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మకు ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలియజేశారు.
ట్రయల్‌కోర్టు 3 నెలలు విచారించి, తప్పుడు కేసని తేల్చింది
సీబీఐ సవాల్ చేయగానే మీరు ఆ తీర్పును పక్కనపెట్టారు
బీజేపీ ప్రత్యర్థుల మీద ఉన్న కేసుల్లోనే మీరు వేగంగా విచారణ జరుపుతున్నారు.. ఏబీవీపీ సమావేశాలకు వెళ్లారు
మేం బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌లకు వ్యతిరేకం
మీ వల్ల న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు.. విచారణ నుంచి తప్పుకోండి
ఢిల్లీ మద్యం కేసులో జస్టిస్ స్వర్ణకాంతశర్మ ఎదుట ఆప్ అధినేత కేజ్రీవాల్ వాదనలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ‘మద్యం పాలసీ కేసుపై మీరు విచారణ జరిపితే నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు’ అని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మకు ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలియజేశారు. గతంలో ఇదే కేసులో విచారణ సందర్భంగా.. తనను దాదాపుగా నేరస్థుడిగా జస్టిస్ స్వర్ణకాంత ప్రకటించిన విషయాన్ని కేజ్రీవాల్ గుర్తు చేశారు. కేవలం మూడుసార్లు జరిగిన విచారణలతోనే ఈ కేసులో తనతోపాటు ఉన్న నిందితులందరినీ మహా అవినీతిపరులుగా ఆమె అభివర్ణించిన సంగతిని ప్రస్తావించారు. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణకాంత తప్పుకోవాలని (రెక్యూజల్) తాను దాఖలు చేసిన పిటిషన్ మీద కేజ్రీవాల్ సోమవారం స్వయంగా వాదనలు వినిపించారు. ‘రెక్యూజల్ చట్టం ప్రకారం జడ్జి సరైన వ్యక్తా? కాదా? అన్నది కాదు.. జడ్జి పట్ల కక్షిదారులో ఉండే అపనమ్మకమే ప్రధానం. మీ ముందున్న కేసుల్లో.. ఈ కేసు, బీజేపీ ప్రత్యర్థి అయిన మరో వ్యక్తి మీద ఉన్న కేసు మాత్రమే చాలా వేగంగా ముందుకు కదులుతున్నాయి. మిగిలిన వాటిలో ఆ వేగం లేదు. అదీగాక, ఈ రెండు కేసుల్లో దర్యాప్తు సంస్థల వాదనలతో మీరు దాదాపుగా ఏకీభవిస్తున్నారు. మద్యం విధానం కేసులో 3నెలలపాటు రోజువారీగా విచారణ జరిపి నాతోపాటు నిందితులందర్నీ నిర్దోషులుగా ప్రకటించిన ట్రయల్ కోర్టు తీర్పును సీబీఐ హైకోర్టులో సవాల్ చేయగానే.. విచారణ ప్రారంభమైన తొలిరోజునే (మార్చి 9న) మీరు దాదాపుగా కొట్టివేశారు. ఈ సందర్భంగా.. మీరు చేసిన వ్యాఖ్యలు సహజ న్యాయ సూత్రాలకు పూర్తి విరుద్ధమైనవి’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. తనతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురి బెయిల్ పిటిషన్లపై గతంలో విచారణ సందర్భంగా.. తమను అవినీతిపరులుగా పేర్కొంటూ జస్టిస్ స్వర్ణకాంత వ్యక్తం చేసిన అభిప్రాయాలను కేజ్రీవాల్ గుర్తు చేశారు. కాగా, ఆర్‌ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన ఏబీవీపీ గతంలో ఏర్పాటు చేసిన నాలుగు సమావేశాలకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ హాజరైన విషయాన్ని ప్రస్తావించారు. ఆర్‌ఎస్ఎస్, బీజేపీలను బహిరంగంగా వ్యతిరేకించే తనకు.. ఆ సంస్థల భావజాలంతో ప్రభావితమైన న్యాయమూర్తి నుంచి న్యాయం లభించదన్న సంశయం నెలకొందని చెప్పారు. కాగా, కేజ్రీవాల్ వాదనలను తప్పుబడుతూ సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జడ్జీలు పక్షపాతంగా ఉన్నారని, విచారణ నుంచి తప్పుకోవాలని కేసులు వేసుకుంటూ వెళ్తే.. ఏ జడ్జి అయినా కేసుల విచారణ చేపట్టగలరా? అని ప్రశ్నించారు.