కాఫీ తాగాక కొందరికి నిద్రమత్తు.. కారణం ఇదే
ABN , Publish Date - Mar 10 , 2026 | 06:37 PM
కాఫీ తాగితే ఉత్సాహం వస్తుందని భావించినా, కొందరిలో మాత్రం నిద్రమత్తు మరింత పెరుగుతుంది. కెఫీన్ ప్రభావం తగ్గిన తర్వాత అడినోసిన్ పెరగడం, షుగర్ లెవెల్స్ మార్పులు వంటి కారణాల వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అలసట, నిద్రమత్తుగా ఉన్న సమయంలో చాలా మంది కాఫీ తాగుతారు. కాఫీతో తమకు తక్షణ ఉత్సాహం వస్తుందని అంటారు. అయితే, కొందరిలో కాఫీ తాగాక నిద్ర మత్తు మరింత ఎక్కువ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థకాక తికమక పడతారు. అయితే, దీని వెనక పలు కీలక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
వైద్యులు చెప్పే దాని ప్రకారం, పగటి పూట మెదడులో అడినోసిన్ అనే రసాయనం పేరుకుంటూ ఉంటుంది. దీని స్థాయి పెరిగే కొద్దీ మెదడు నెమ్మదిస్తుంది. చివరకు సాయంత్రం అయ్యేసరికి అలసట, నిద్ర ముంచెత్తుతాయి. అయితే, కాఫీలోని కెఫిన్ ఎడినోసిన్ ప్రభావాన్ని అడ్డుకుంటుంది. నిద్రమత్తు, అలసట నుంచి తాత్కాలిక విముక్తిని ఇస్తుంది. ఈలోపు అడినోసిన్ స్థాయిలు మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉంటాయి. ఇక కెఫీన్ ప్రభావం తగ్గగానే అడినోసిన్ మెదడును ఒక్కసారిగా ముంచెత్తినట్టు అవుతుంది. నిద్ర ముంచుకొస్తుంది.
సాధారణంగా కెఫీన్ ప్రభావం శరీరం నుంచి తొలగిపోయేందుకు నాలుగు నుంచి ఆరు గంటలు పడుతుంది. ఇది వార వారి శరీరతత్వాన్ని బట్టి ఉంటుంది. ఇక కొందరు కాఫీకి అలవాటుపడిపోవడంతో కెఫీన్ ప్రభావం త్వరగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కెఫీన్‌కు అనుగుణంగా మెదడు పనితీరులో మార్పులు రావడం ఇందుకు కారణమని అంటున్నారు. ఫలితంగా, కాఫీ తాగిన కాసేపటికి ఉత్సాహానికి బదులు నిద్ర ముంచెత్తుతున్న భావన కలుగుతుందట. ఇక చక్కెర కలిపిన కాఫీ తాగే వారిలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగి మళ్లీ తగ్గిపోవడం వల్ల కొందరిలో నిద్రమత్తు, అలసటలకు దారి తీస్తాయట. కాఫీతో వచ్చే సల్ప స్థాయి డీహైడ్రేషన్ కూడా కొందరికి నిద్రమత్తును కలుగుజేస్తుంది. కాబట్టి, కాఫీ ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. కొందరికి నిద్ర మత్తు అనిపిస్తుందని అంటున్నారు.
ఈ వార్తలూ చదవండి:
ఉదయం పూట ఇలా చేస్తారా.. చిన్నతనంలోనే వార్ధక్య లక్షణాలు వస్తాయి జాగ్రత్త!
విజయం కోసం తపిస్తున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే గెలుపు మీదే