గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే..? ఇవిగో చిట్కాలు..
ABN , Publish Date - May 27 , 2026 | 06:15 PM
పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. వాణిజ్య సిలిండర్ ధర రూ. 3 వేలు దాటితే.. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 50 పెంచారు.
పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. వాణిజ్య సిలిండర్ ధర రూ. 3 వేలు దాటితే.. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 50 పెంచారు. వీటి ధరలు మళ్లీ ఎప్పుడు? ఏ నిమిషంలో పెరుగుతాయో చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వినియోగం బాగా పెరిగింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ కేవలం 30 రోజులు మాత్రమే వస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా.. ఒక ప్రణాళిక ప్రకారం గ్యాస్‌పై వంట చేస్తే.. ఒక సిలిండర్‌ను చాలా రోజులు వాడుకోవచ్చని చిట్కా రాయుళ్లు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఏడాదికి రెండు సిలిండర్లను ఆదా చేయవచ్చని వారు సూచిస్తున్నారు.
పొదుపునకు తొలి సూత్రం నీలి మంట: వంట కోసం గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు.. మంట నీలి రంగులో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మంట ఎరుపు లేదా పసుపు రంగులోకి మారితే..బర్నర్ రంధ్రాలు మురికితో మూసుకుపోయాయని అర్థం. అందువల్ల గ్యాస్ నెమ్మదిగా మండుతుంది. దాంతో అధిక గ్యాస్ వినియోగం అవుతుంది. దీంతో వారానికి ఒకసారి వేడి నీటితో బర్నర్‌ను బ్రష్‌తో శుభ్రం చేయాలి. శుభ్రమైన బర్నర్‌పై వంట వేగంగా ఉడుకుతుంది. తద్వారా 10 నుంచి 15 శాతం గ్యాస్ ఆదా అవుతుంది.
పాత్రకు మూత పెట్టి వండడం వల్ల..: వంట చేసేటప్పుడు పాత్రకు మూత పెట్టడం చాలా ముఖ్యం. మూత పెట్టి ఉంచితే.. లోపల ఉన్న వేడి ఆవిరి బయటకు పోకుండా ఆహారం త్వరగా ఉడుకుతుంది. దీనివల్ల వంట చేసే సమయం చాలా తగ్గడమే కాకుండా.. గ్యాస్ కూడా బాగా ఆదా అవుతుంది. కూరగాయలు, అన్నం, సాంబార్ వంటి ఏ వంటను అయినా మూత పెట్టి వాడుకునేలా అలవాటు చేసుకొండి. ప్రెషర్ కుక్కర్ వాడటం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. కుక్కర్‌లో వంట త్వరగా పూర్తవుతుంది. సాదారణ పాత్రతో పోలిస్తే.. సగం గ్యాస్ ఆదా అవుతుంది.
తడి పాత్రను గ్యాస్ పొయ్యి మీద పెడితే.. : చాలా మంది పాత్రను కడిగిన వెంటనే స్టవ్ మీద పెడతారు. తడి పాత్ర వేడెక్కడానికి అధిక సమయం పడుతుంది. పాత్రలోని నీరు ముందుగా ఆవిరైపోవాలి. ఆ తర్వాతే వంట మొదలవుతుంది. దీనివల్ల గ్యాస్ అనవసరంగా వృధా అవుతుంది. అందువల్ల వంటకు ఉపయోగించే పాత్రలను స్టవ్ మీద పెట్టే ముందు వాటిని శుభ్రంగా తుడిచి ఆరబెట్టాల్సి ఉంటుంది.
పక్కా ప్రణాళికతో.. : ఒక సారి టీ, మరో సారి టిఫిన్, ఇంకోసారి భోజనం అన్నట్లుగా కాకుండా.. ఒకేసారి అన్ని వండేయండి. ఉదయం, మధ్యాహ్ననానికి కలిపి ఒకేసారి వంట చేసుకోండి. ఒకేసారి స్టవ్ ఆన్ చేసి అన్నీ పూర్తి చేయండి.
నానబెట్టి వండుకుంటే.. రెండు ఆదా..: పప్పులు, శనగలు, రాజ్మా, బియ్యం వంటి ధాన్యాలను వండే ముందు అరగంట పాటు నీటిలో నానబెట్టండి. నానబెట్టిన తర్వాత వాటిని వండితే వెంటనే ఉడుకుతాయి. వీటిని నానబెట్టకుండా నేరుగా వండితే అధిక సమయం పడుతుంది. అలాగే ఎక్కువ గ్యాస్ అవుతుంది. అరగంట పాటు నానబెట్టడం వల్ల వంట సమయం 20 నిమిషాల నుంచి 10 నిమిషాలకు తగ్గుతుంది.
చిన్న గిన్నెకు పెద్ద మంట వద్దు..: చిన్న గిన్నెను పెద్ద బర్నర్‌పై పెట్టి వండడం గ్యాస్ వృధాకు ప్రధాన కారణం. మంట గిన్నె చుట్టూ వ్యాపించి ఆరిపోతే.. గ్యాస్ వృధా అవుతుంది. గిన్నె పరిమాణానికి తగిన బర్నర్‌ను ఉపయోగించండి. ఎల్లప్పుడూ గ్యాస్ మంట మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. అధిక మంట పెడితే.. ఆహారం మాడిపోవడమే కాకుండా.. అధికంగా గ్యాస్‌ను కూడా వినియోగిస్తుంది.
ఈ చిన్న చిన్న చిట్కాలు రోజూ పాటిస్తూ వంట చేస్తే.. ఒక గ్యాస్ సిలిండర్ మరిన్ని రోజులు వస్తుంది. మీరు ఏడాదికి సుమారు రెండు లేదా మూడు సిలిండర్లతోపాటు నగదును ఆదా చేసినట్లు అవుతుంది. గ్యాస్ ఆదా చేయడం అంటే నగదు ఆదా చేయడమే కాదు.. పర్యావరణాన్ని కూడా కాపాడినట్లు అవుతంది.