Skills University: స్కిల్స్ యూనివర్సిటీ కీలక మైలురాయి
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:26 AM
డిగ్రీ ఉంటే చాలు.. ఉద్యోగం ఖాయం అనే రోజులు పోయాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది డిగ్రీ పట్టాలు చేతబట్టి బయటకొస్తున్నా వివిధ సంస్థలకు అవసరమైన ....
ప్రారంభించిన అనతికాలంలోనే 1,000 మంది యువతకు శిక్షణ
హైదరాబాద్, జనవరి 8(ఆంధ్రజ్యోతి): డిగ్రీ ఉంటే చాలు.. ఉద్యోగం ఖాయం అనే రోజులు పోయాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది డిగ్రీ పట్టాలు చేతబట్టి బయటకొస్తున్నా వివిధ సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడంతో యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. ‘అకడమిక్ నాలెడ్జ్ ఉంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేద’నే అభిప్రాయాన్ని కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంతరాన్ని అధిగమించడమే విద్యా వ్యవస్థకు అతిపెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2024లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా, తరగతి గది చదువుకు మించి ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్‌షి్‌పలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ నైపుణ్యాలను విద్యార్థులకు అందించడంపై స్కిల్స్ యూనివర్సిటీ ప్రత్యేక దృష్టి సారించింది. తాత్కాలిక క్యాంప్‌సను ఐఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయగా.. శాశ్వత క్యాంప్‌సను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో 57.8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. చాన్స్‌లర్‌గా సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తుండగా చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర ఉన్నారు. స్కిల్స్ యూనివర్సిటీ కార్యకలాపాలను పారిశ్రామిక రంగ ప్రముఖులతో కూడిన బోర్డు ఆఫ్ మేనేజ్‌మెంట్ పర్యవేక్షిస్తోంది. వర్సిటీ ప్రారంభమైన తక్కువ కాలంలోనే కీలక మైలురాయిని చేరుకుంది. ఇటీవలే 1,000మంది విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. డిగ్రీలు పూర్తిచేసిన యువతకు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు అందించి, వారు నేరుగా ఉద్యోగాల్లోకి అడుగుపెట్టేలా స్కిల్స్ యూనివర్సిటీ మార్గనిర్దేశం చేస్తోంది. ఇక్కడి శిక్షణ విధానం సంప్రదాయ విద్యకు భిన్నంగా ఉంటుంది. పుస్తకాలు, పరీక్షలే కాకుండా పరిశ్రమలతో అనుసంధానమవుతూ ఇంటర్న్‌షి్‌పలు, రియల్ టైమ్ ప్రాజెక్ట్‌ల్లో అవకాశం కల్పించడంతో పాటు కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్, టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాల వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దీంతో యువతలో ఆత్మవిశ్వాసం పెరిగి, ప్రతిభను వ్యక్తీకరించే సామర్థ్యం మెరుగవుతుంది.