చదువుల తల్లికి అండగా..
ABN , Publish Date - May 02 , 2026 | 03:45 AM
చదువుల తల్లికి విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందరర్‌డ్డి అభయం ఇచ్చారు. భవిష్యత్‌కు భరోసా కల్పించారు. దీంతో తన లక్ష్యం నెరవేరుతుందన్న ...
ప్రభుత్వ పాఠశాలలో చదివి టెన్త్‌లో 594 మార్కులు సాధించిన విద్యార్థినికి విజయనగరం కలెక్టర్ భరోసా
స్వయంగా ఇంటికి వెళ్లి అభినందనలు
ఇంటర్, నీట్ ప్రిపరేషన్‌కు సహకరిస్తానని హామీ
విజయనగరం మే 1(ఆంధ్రజ్యోతి): చదువుల తల్లికి విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందరర్‌డ్డి అభయం ఇచ్చారు. భవిష్యత్‌కు భరోసా కల్పించారు. దీంతో తన లక్ష్యం నెరవేరుతుందన్న ఆశ సదరు విద్యార్థినిలో చిగురించింది. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం పెదరెడ్డి గ్రామానికి చెందిన ఎలిశెట్టి ఉమాపార్వతి తండ్రిని కోల్పోయింది. తల్లి కుమారి కూలి పనిచేస్తూ ఉమాపార్వతిని గంగుబుడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివించింది. అమ్మ ఆశయాలకు అనుగుణంగా కూతురు పదోతరగతిలో 594 మార్కులు సాధించింది. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ రాంసుందరరెడ్డి శుక్రవారం విద్యార్థిని ఇంటికి వెళ్లి మాట్లాడారు. ఉమాపార్వతిని ఆశీర్వదించి.. భవిష్యత్‌లో ఏం చదవాలనుకుంటున్నావని అడిగారు. డాక్టర్ చదవాలని ఉంది సార్.. అని ఉమాపార్వతి చెప్పటంతో... కలెక్టర్ స్పందించి తాను చదివిస్తానంటూ భరోసా ఇచ్చారు. నీట్‌కు ప్రిపేర్ అయ్యేందుకు, ఇంటర్ వరకు ఏ కళాశాలలో చదివినా.. ఫ్రీ ఎడ్యుకేషన్, వసతి కోసం తాను బాధ్యత తీసుకుంటానని కలెక్టర్ హమీ ఇచ్చారు. ఎక్కడ చదవాలన్నది నిర్ణయించుకుని తనను కలవాలని కలెక్టర్ చెప్పారు.