Share News

CMA: విలువను లెక్కకట్టే సీఎంఏ కీలకం

ABN , Publish Date - Jan 19 , 2026 | 05:26 AM

ఒక వస్తువు ఉత్పత్తికి ఎంత ఖర్చయిందో కచ్చితంగా తెలిస్తే, ఆపై ఎంత లాభం పొందాలి, కలకాలం ఆ వస్తూత్పత్తికి ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కలుగుతుంది.

CMA: విలువను లెక్కకట్టే సీఎంఏ కీలకం

ఒక వస్తువు ఉత్పత్తికి ఎంత ఖర్చయిందో కచ్చితంగా తెలిస్తే, ఆపై ఎంత లాభం పొందాలి, కలకాలం ఆ వస్తూత్పత్తికి ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కలుగుతుంది. ఒక ఉత్పత్తి సంస్థకు సంబంధించి మొత్తం వ్యయం ఒక ఎత్తు. ప్రత్యేకించి ఒక వస్తువు ఉత్పత్తికి చేస్తున్న ఖర్చు మరో ఎత్తు. ముడి సరుకు నుంచి వస్తురూపం సంతరించుకునే వరకు ఎక్కడెక్కడ ఎంత మొత్తం అవుతుందో కచ్చితంగా తెలిస్తే, వాటిలోనుంచి ఏ స్థాయిలో ఖర్చులను తగ్గించుకోవడం లేదంటే అవసరాన్ని బట్టి పెంచుకోవడాన్ని నిర్ణయించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో సీఎంఏ పని తీరుతెలియజేస్తాను. అప్పుడు ఈ కోర్సుకు ఉన్న ప్రాముఖ్యం అర్థమవుతుంది.

ఇంటర్‌లో ఎంఈసీ తీసుకుంటాం, ఆపై సీఏ చేస్తాం అంటున్నారు ఇప్పటి యువతలో కొందరు. తరవాత కొద్ది రోజులకు అడిగితే సీఎంఏ(కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌) ఫౌండేషన్‌ కూడా రాశామని చెబుతుంటారు మళ్ళీ వారిలో కొందరు. అసలు ఈ సీఎంఏ అంటే ఏమిటి, దీని ప్రాధాన్యం ఏమిటో ఈ కోర్సును ఆఫర్‌ చేసే ఐసీఎంఏఐ(ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా) సదరన్‌ రీజియన్‌ ట్రెజరర్‌ కేవీఎన్‌ లావణ్య వివరించారు. ఎలకా్ట్రనిక్స్‌లో బీటెక్‌ చేసిన ఈమె కొంతకాలం ఐటీ కంపెనీలో చేశారు. ఇంకో విషయం, బీటెక్‌ చేస్తూనే మరో వైపు సీఎంఏ కూడా పూర్తి చేసిన ఘనత ఈమె సొంతం. బ్రిటన్‌కు చెందిన ఏసీసీఏ కూడా చేసిన ఈమె ఐసీఎంఏఐకి హైదరాబాద్‌ చాప్టర్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం అదే సంస్థ సదరన్‌ రీజియన్‌ కమిటీలో ట్రెజరర్‌గా ఉన్నారు. ఇంతకీ సీఎంఏ గురించి ఆమె ఏమి చెబుతున్నారో చూద్దాం.


  • వ్యయాల లెక్కలు - ఆడిట్‌లో సీఎంఏది వ్యూహాత్మక పాత్ర. దీని ద్వారా లాభాలు, ధరలకు తోడు ప్రజాప్రయోజనాన్ని సీఎంఏ పరిరక్షించగలుగుతారు. మార్కెట్లో వివిధ బ్రాండ్లు పోటీపడతుంటాయి. కేవలం ఆదాయం పెంపు మాత్రమే కాదు, ఖర్చు తగ్గించినా అది ఒక కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టడమే కాదు, ఉద్యోగులకు, వాటాదారులకు, ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది.

  • ఖర్చుల వ్యవస్థ రూపకల్పన. ఉదాహరణకు ఒక ఆటోమోబైల్‌ సంస్థలో 120 వేరియంట్లు ఉత్పత్తి అవుతున్నాయని అనుకుందాం. సంప్రదాయ అబ్జార్షషన్‌ కాస్టింగ్‌కు బదులు యాక్టివిటీ ఆధారిత ఖర్చుల విధానాన్ని సీఎంఎ ప్రవేశపెడతారు. మెషీన్‌ సెటప్‌, క్వాలిటీ ఇన్‌స్పెక్షన్‌, మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ను విశ్లేస్తారు. అప్పుడు మొత్తం ఉత్పత్తుల్లో వేటితో నష్టం కలుగుతోందో కూడా తెలుస్తుంది. వాటిని నిలిపివేయడానికి అవకాశం కలుగుతుంది. తద్వారా మొత్తం ప్రక్రియను ఆపివేయాల్సిన అవసరం ఉండదు. వ్యయాలను తగ్గించుకునే వెసులుబాటుకు తోడు లాభార్జనకు అవకాశం కలుగుతుంది.

  • ఉత్పత్తిలో భాగంగా వివిధ ప్రక్రియల మధ్య ఖర్చుల విశ్లేషణ, దిగుబడి నియంత్రణ మరొకటి. ఉదాహరణకు రిఫైనరీలో ప్రాసెస్‌ ప్రక్రియల్లో ఎక్కడెక్కడ నష్టం వస్తుందన్నది తేలుస్తారు. ఔట్‌డేటెడ్‌ టెంపరేచర్‌ కంట్రోల్‌తో చార్జీలను తగ్గించుకోవచ్చు. వ్యయాలను నియంత్రించుకుని లాభాల బాట పట్టవచ్చు.

  • సామర్థ్య మార్పుల సమయంలో ఖర్చుల ప్రవర్త విశ్లేషణ మరొకటి. ఇక్కడ స్థిర, అస్థిర వ్యయాలను వేరు చేస్తారు. ఉదాహరణకు ఒక స్టీల్‌ప్లాంట్‌ 65 శాతం కెపాసిటీతో పని చేస్తే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అదే కెపాసిటీని 85 శాతానికి పెంచితే ఖర్చు తగ్గుతుంది. అంటే ఖర్చు తగ్గింపుదారుడే కాదు, ఒక సీఎంఏ విలువల పరిరక్షకుడు కూడా.

  • టెలికాం కంపెనీల నుంచి పలు సంస్థల్లో వృథా ఖర్చులను తగ్గించడంలో సీఎంఏలు కీలకపాత్ర పోషిస్తున్నారు. సంక్లిష్ట సరఫరా గొలుసులతో మొదలుకుని తరుచూ మారే ఇంధన ధరల వరకు కఠిన నియంత్రణలు పాటించి వాటికి స్థిర లాభదాయికతను సమకూర్చడంలో సీఎంఏ మౌనశిల్పిలా వ్యహరిస్తారు. వనరులను గరిష్ఠంగా వినియోగించడమే కాకుండా అదే స్థాయిలో లాభాలు తద్వారా వ్యాపార సముదాయాలు పది కాలాల పాటు నిలదొక్కుకేందుకు సీఎంఏ తనదైన పాత్ర పోషిస్తారు.

  • సీఎంఏ పాత్రను ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ఆసక్తికరంగా ఈ ప్రొఫెషన్‌ ఉంటుంది. కంపెనీ లేదంటే ఒక వ్యవస్థ అప్పజెప్పిన పనిని సమర్థంగా పూర్తి చేసి, ప్రయోజనాలను వారికి చూపించడమే కాదు, ఆత్మసంతృప్తికి వీలు కల్పించే ప్రొఫెషన్‌ ఇది అని చెప్పగలను. కామర్స్‌ రంగంవైపు ఆసక్తిని కనబరిచే యువతకు ఇది మంచి ఆప్షన్‌. దీనిపై ఎంత అవగాహన పెంచుకుంటే అంతే స్థాయిలో ఈ కోర్సు వైపు మొగ్గు చూపవచ్చు.

Updated Date - Jan 19 , 2026 | 05:26 AM