Share News

గరిష్ఠం 1.83 లక్షలు.. కనిష్ఠం 45 వేలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:21 AM

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ట్యూషన్‌ ఫీజులపై కసరత్తు పూర్తయిన నేపథ్యంలో 2025-2028 విద్యాసంవత్సర ఫీజులపై తెలంగాణ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఎ్‌ఫఆర్‌సీ) తన ప్రతిపాదనను హైకోర్టుకు సమర్పించింది.

గరిష్ఠం 1.83 లక్షలు.. కనిష్ఠం 45 వేలు

  • 70 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పాత ఫీజులే..19 కాలేజీల్లో తగ్గింపు

  • హైకోర్టుకు ప్రతిపాదనను సమర్పించిన టీఎ్‌ఫఆర్‌సీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ట్యూషన్‌ ఫీజులపై కసరత్తు పూర్తయిన నేపథ్యంలో 2025-2028 విద్యాసంవత్సర ఫీజులపై తెలంగాణ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఎ్‌ఫఆర్‌సీ) తన ప్రతిపాదనను హైకోర్టుకు సమర్పించింది. న్యాయస్థానం అనుమతించాక కొత్త ఫీజులను ప్రభుత్వం ఖరారు చేయనుంది. 2022లో ఫీజులను సవరించినప్పుడు గండిపేటలోని సీబీఐటీ వార్షిక ఫీజు రూ.1.65లక్షలుగా ఉంది. ఇప్పుడు ఫీజును రూ.18వేలు పెంచడంతో రూ.1.83 లక్షలకు చేరింది. ఇప్పుడు రాష్ట్రంలో అత్యధిక ఫీజు ఇదే. ఇందులో నాలుగేళ్ల బీటెక్‌ పూర్తి చేయాలంటే ట్యూషన్‌ ఫీజుల రూపంలో రూ.7.32 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని వాసవి కాలేజీలో ఫీజు గతంలో రూ.1.40 లక్షలుండగా.. రూ.35 వేలు పెంచడంతో రూ.1.75లక్షలకు చేరింది. బాచుపల్లిలోని గోకరాజు రంగరాజు కాలేజీ ఫీజు గతంలో రూ.1.30 లక్షలుండగా రూ.30,500 పెంచడంతో రూ.1,60,500కు చేరింది. షేక్‌పేటలోని జి.నారాయణమ్మ మహిళా కాలేజీ ఫీజు గతంలో రూ.లక్ష ఉండగా.. దీనిని ఏకంగా రూ.62వేలు పెంచడంతో ఇక్కడ వార్షిక ఫీజు రూ.1.62లక్షలకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 160 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలుండగా.. కొత్త ప్రతిపాదనల్లో ఏడు కాలేజీల్లో ఫీజు 1.50 లక్షలకుపైగా ఉంది. 28 కాలేజీల్లో రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల మధ్య ఉంది. 40 కాలేజీల్లో రూ.75వేలు-రూ.లక్ష మధ్య, 64 కాలేజీల్లో రూ.50 వేలు - రూ.లక్ష మధ్య ఉంది. 21 కాలేజీల్లో మాత్రం ఫీజు రూ.50వేల లోపు ఉంది. కొత్త ప్రతిపాదనల్లో కనిష్ఠ ఫీజు రూ.45 వేలుగా ఉంది. ఇది గతంలో రూ.35 వేలు ఉండేది. 70 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పాత ఫీజులు కొనసాగిస్తూ.. 19 కాలేజీలలో మాత్రం తగ్గిస్తూ టీఎ్‌ఫఆర్‌సీ ప్రతిపాదన చేసింది.

Updated Date - Feb 20 , 2026 | 01:23 AM