పదిలో 95 శాతం పాస్
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:04 AM
ఇంటర్ తరహాలోనే పదోతరగతిలోనూ రికార్డుస్థాయి ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ సలహదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా, పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్....
నిరుటి కంటే 2.37 శాతం అధికం.. కొవిడ్ తర్వాత ఇదే అత్యధికం
హైదరాబాద్, ములుగు, హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ తరహాలోనే పదోతరగతిలోనూ రికార్డుస్థాయి ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ సలహదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా, పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు పి.వి.శ్రీహరి బుధవారం పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5,26,166 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరవగా.. వారిలో 4,97,312 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5,16,815 మంది కాగా.. 4,91,774 (95.15 శాతం) మంది పాసయ్యారు. ఒకసారి ఫెయిలై మళ్లీ రాసినవారు 9,351 మంది ఉండగా.. వారిలో 5,538 (59.22 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. నిరుటితో పోలిస్తే ఈసారి పది ఫలితాల్లో ఉతీర్ణత 2.37 శాతం మేర అధికంగా నమోదు కాగా.. కొవిడ్ తర్వాత ఇప్పటిదాకా ఇదే అత్యధికం కావడం విశేషం. అలాగే.. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల ఉత్తీర్ణత 2.19 శాతం అధికంగా ఉంది. ఈ పరీక్షల్లో 2,45,027 మంది బాలురు పాస్ కాగా.. 2,46,747 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా నలుగురు విద్యార్థులు అత్యధికంగా 597 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. ఆ నలుగురూ.. ఖమ్మం జిల్లాకు చెందిన కుంచాల వృతిక కృష్ణ, రంగారెడ్డి జిల్లాకు చెందిన మేధాంశ్ శ్రీరామ, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎంటెనుక శశాంక్, ముద్దాయిపేట మధు. వీరు గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాల్లో నూటికి నూరు, భాషల్లో 99 చొప్పున సాధించారు. అలాగే, ఆరుగురు విద్యార్థులు 596 మార్కులు సాధించారు. మాధ్యమాలవారీగా చూస్తే.. ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల ఉత్తీర్ణత అధికంగా ఉంది. ఆ మాధ్యమంలో 4,45,376 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 95.86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మాధ్యమంలో 39,831 (89.14 శాతం) మంది, ఉర్దూ మాధ్యమంలో 6,236 (86.71 శాతం) మంది, ఇతర మాధ్యమాల్లో 331 (95.11 శాతం) మంది పాసయ్యారు.
గురుకుల విద్యార్థుల సత్తా..
పది ఫలితాల్లో సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు అత్యధిక ఉత్తీర్ణత సాధించాయి. సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు 99.1 శాతం ఉత్తీర్ణతతో ప్రథమస్థానంలో నిలవగా.. 99శాతంతో బీసీ సంక్షేమ గురుకులాలు, 98.64 శాతంతో తెలంగాణ సంక్షేమ గురుకులాలు, 98.13 శాతంతో గిరిజన సంక్షేమ గురుకులాలు, 98.64 శాతంతో మైనారిటీ గురుకులాలు సత్తా చాటాయి. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో 98శాతం, ప్రైవేటు స్కూళ్లలో 95.81 శాతం, మోడల్ స్కూళ్లలో 97.83 శాతం, జిల్లాపరిషత్ పాఠశాలల్లో 93.53 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 86.18 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా.. ఈ ఫలితాలు క్రమశిక్షణ, నిబద్ధత, సమష్టి కృషికి నిదర్శనమని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి విజయేంద్ర బోయి అన్నారు. అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అభినందనలు తెలిపారు.
5,731 బడుల్లో 100 శాతం ఉత్తీర్ణత..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,677 పాఠశాలలుండగా.. ఈసారి రికార్డుస్థాయిలో 5731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 231 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 152 (65.8 శాతం) చోట్ల వందశాతం ఫలితాలు నమోదయ్యాయి. అలాగే మొత్తం 475 కేజీబీవీలకుగాను 290 (61 శాతం), 204 మైనారిటీ గురుకులాలకుగాను 119 (58.33 శాతం), 104 గిరిజన సంక్షేమ గురుకులాలకుగాను 60 (57.69 శాతం), 4,127 జిల్లాపరిషత్ పాఠశాలలకుగాను 2065 (50 శాతం), 194 మోడల్ స్కూళ్లకుగాను 83 (42.78 శాతం), 498 ప్రభుత్వ పాఠశాలలకుగాను 65 చోట్ల (13 శాతం) వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆరు పాఠశాలల్లో సున్నా ఫలితాలు రాగా.. అవన్నీ ప్రైవేటు పాఠశాలలే కావడం గమనార్హం.
ములుగు ప్రథమం.. హైదరాబాద్ చివర
జిల్లాలావారీగా చూస్తే.. పదో తరగతి ఫలితాల్లో 99.3 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. కిందటి ఏడాది 97.64 శాతం ఉత్తీర్ణతతో ఎనిమిదో స్థానంలో ఉన్న ములుగు జిల్లా ఈసారి ఏకంగా మొదటి స్థానంలో నిలవడం విశేషం. పది ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలవడంపట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల విద్యార్థులు పదో తరగతిలో సత్తాచాటడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. కాగా.. ములుగుతోపాటు.. నాగర్‌కర్నూల్ (99.03శాతం), నిర్మల్ (98.96శాతం), జగిత్యాల (98.87శాతం), మహబూబాబాద్ (98.81శాతం) టాప్ 5లో నిలిచాయి. ఇక.. 89.23 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో హైదరాబాద్ జిల్లా చివరిస్థానంలో నిలిచింది.
జూన్ 5 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి 12 వరకూ నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకూ పరీక్షలు ఉంటాయన్నారు. ఈ నెల 30 నుంచి మే 14లోపు ఫీజు చెల్లించాలని కోరారు. రీకౌంటింగ్ కోసం రూ.500, రీ వెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజు ఆన్‌లైన్లో 30 నుంచి మే 14లోపు చెల్లించాలని సూచించారు.