రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:44 AM
పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
5,28,239 మంది విద్యార్థులు, 2,676 పరీక్షా కేంద్రాలు
హైదరాబాద్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 5,17,727మంది రెగ్యులర్, ఒకసారి ఫెయిలైన 10,512మంది విద్యార్థులు ఉన్నారు. ఈసారి ప్రైవేటు పాఠశాల నుంచి అత్యధికంగా 2,50,015 విద్యార్థులుండగా, ప్రభుత్వ బడుల నుంచి 2,07,573 మంది, సంక్షేమ గురుకులాల నుంచి 60,139 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 1,582 ప్రభుత్వ, 1,094 ప్రైవేటు విద్యాసంస్థలున్నాయి. హాల్ టికెట్లు ఇప్పటికే అన్ని పాఠశాలకు పంపించామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. పాఠశాల గుర్తింపు తెలియకుండా సాధారణ దుస్తుల్లోనే విద్యార్థులు పరీక్షకు రావాలని కోరారు. పరీక్షల పర్యవేక్షణకు 144 ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటుచేశామన్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మద్యాహ్నం 12:30వరకు ఉంటాయి.