Teachers Protest: టెట్ మినహాయింపు కోసం ఫిబ్రవరి 5న ఢిల్లీలో మార్చ్ టు పార్లమెంట్
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:27 AM
సీనియర్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయించాలి. ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే జాతీయ విద్యావిధానాన్ని...
ఈనెల 9న నల్లబ్యాడ్జీలతో నిరసనలు: ఏఐ జాక్టో
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ‘‘సీనియర్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయించాలి. ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌ఈపీ) రద్దు చేయాలి. పాఠశాలల మూసివేత, విలీనాలను ఆపాలి. న్యూపెన్షన్ స్కీమ్, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎ్‌స)లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్థరించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్రాథమిక ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి’’ అని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఏఐ జాక్టో) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఐ జాక్టో ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న ఢిల్లీలో పార్లమెంటు మార్చ్‌ను చేపట్టాలని నిర్ణయించింది. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఏఐ జాక్టో స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం గౌడ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలపాలని, అన్ని జిల్లాల నుంచి రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి వినతిపత్రాలు పోస్టు చేయాలని ఫిబ్రవరి 5న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో చావ రవి (యూటీఎఫ్) తదితరులు పాల్గొన్నారు.