UTS App to Be Discontinued: ఫిబ్రవరి 28 నుంచి యూటీఎస్ యాప్ నిలిపివేత
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:51 AM
అన్ రిజర్వుడ్, ఫ్లాట్‌ఫారం టికెట్ల బుకింగ్ కోసం ప్రస్తుతం ప్రయాణికులు వాడుతున్న ‘యూటీఎస్’ యాప్‌ను ఫిబ్రవరి 28 నుంచి నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): అన్ రిజర్వుడ్, ఫ్లాట్‌ఫారం టికెట్ల బుకింగ్ కోసం ప్రస్తుతం ప్రయాణికులు వాడుతున్న ‘యూటీఎస్’ యాప్‌ను ఫిబ్రవరి 28 నుంచి నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. దీని స్థానంలో మార్చి 1 నుంచి ‘రైల్‌వన్’ అనే కొత్త అప్లికేషన్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ యాప్ ద్వారా ఇకపై రిజర్వుడ్, అన్‌రిజర్వుడ్ టికెట్లతో పాటు సీజన్ టికెట్ల బుకింగ్, రెన్యూవల్, రిఫండ్ వంటి అన్ని రకాల సేవలను ఒకే చోట పొందవచ్చు. వేర్వేరు టికెట్ల కోసం వేర్వేరు యాప్‌లను వాడాల్సిన అవసరం లేకుండా, అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంపై ప్రయాణికుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.